యూబీ రుణాలపై డియాజియో దర్యాప్తు
ముంబై: యూబీ గ్రూప్ కంపెనీలకు యునెటైడ్ స్పిరిట్స్ అందించిన రుణాలపై దర్యాప్తునకు యూకే దిగ్గజం డియాజియో నిర్ణయించడంతో ఈ కంపెనీ షేరు 5% పతనమైంది. బీఎస్‌ఈలో యునెటైడ్ స్పిరిట్స్ రూ. 2,279 వద్ద ముగిసింది. ఒక దశలో దాదాపు 7% దిగజారి రూ. 2,226 వద్ద కనిష్టాన్ని తాకింది. ఎన్‌ఎస్‌ఈలో 4% వరకూ క్షీణించి రూ. 2,300 వద్ద నిలిచింది. రెండు ఎక్స్ఛేంజీల్లోనూ కలిపి 2 లక్షలకుపైగా షేర్లు ట్రేడయ్యాయి.
డియాజియో ఇటీవల యునెటైడ్ స్పిరిట్స్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వెరసి గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాలపై దర్యాప్తునకు యునెటైడ్ స్పిరిట్స్ బోర్డ్ ద్వారా తాజాగా ఆదేశించింది. కాగా, యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యాను యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
నష్టాల నేపథ్యం
గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో యునెటైడ్ స్పిరిట్స్ రూ. 4,489 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. వీటిలో రూ. 1,013 కోట్లను డౌట్‌ఫుల్ రుణాలుగా చూపించగా, స్కాటిష్ అనుబంధ సంస్థ వైట్ అండ్ మెకే విక్రయానికి సంబంధించి రూ. 3,236 కోట్ల ప్రత్యేక నష్టాన్ని యునెటైడ్ స్పిరిట్స్ నమోదు చేసింది. తాజాగా కంపెనీ బోర్డు ఈ అంశాలపై దర్యాప్తును చేపట్టనుంది. దీనిలో భాగంగా కంపెనీ అధికారులు, సలహాదారులను ప్రశ్నించనున్నట్లు డియాజియో తెలిపింది. పూర్తిస్థాయి అనుబంధ సంస్థలకు సంబంధించి 2013 మార్చి31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం వరకూ ఉన్న రుణాలు, డిపాజిట్లు తదితర అంశాలను దర్యాప్తులో పరిగణనలోకి తీసుకోనున్నట్లు కంపెనీ బోర్డ్ తెలిపింది.