ఇంటి నుంచి బయలుదేరే ముందు యువకుల ఫొటో (సీసీ ఫుటేజ్)
కొండపోచమ్మ సాగర్‌లో మునిగి ఐదుగురి మృతి
సాక్షి,హైదరాబాద్/గజ్వేల్/ముషిరాబాద్/బన్సీలాల్‌పేట్/ఖైరతాబాద్: పండుగ సెలవుల్లో సరదాగా గడుపుదామని వెళ్లిన ఆ యువకులకు.. అదే చివరి ప్రయాణమైంది. ఆట విడుపే ఆఖరి క్షణమైంది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌లో మునిగి శనివారం ఐదుగురు యువకులు మృతి చెందారు. హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ఇందిరానగర్‌కు చెందిన ధనుష్ (20), లోహిత్ అలియాస్ లక్కీ (17) సోదరులు.
బన్సీలాల్‌పేటలోని కవాడిగూడకు చెందిన చీకట్ల దినేశ్వర్ (18), ఖైరతాబాద్‌కు చెందిన జతిన్ (17), రాంనగర్‌కు చెందిన మృగాంక్ (17), ఎండీ ఇబ్రహీం (20), అత్తాపూర్‌కు చెందిన సాహిల్ వీరికి స్నేహితులు. శనివారం సెలవు కావడంతో సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి ఆలయం, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ సందర్శనకు వెళ్లారు. నేరుగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు చేరుకొన్న వీరంతా సరదాగా గడిపేందుకు కట్టపై నుంచి కిందికి దిగారు.
సెల్ఫీలు దిగుతున్న సమయంలో లోహిత్ కాలుజారి నీళ్లలో పడ్డాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో ధనుష్, సాహిల్, దినేశ్వర్, జతిన్ సైతం నీళ్లలో పడి మునిగిపోయారు. భయకంపితులైన మృగాంక్, ఇబ్రహీంలు గట్టిగా కేకలు వేస్తూ కట్టపైకి పరుగులు తీశారు. 100 నంబర్‌కు డయల్ చేసి విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో ములుగు, మర్కూక్ పోలీసులు వెంటనే స్పందించారు.
గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సిద్దిపేట సీపీ అనురాధ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో మరింత అప్రమత్తమై గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రెస్క్యూ టీమ్‌ను, గజ ఈతగాళ్లను రప్పించి డ్రోన్‌ల సాయంతో మృతదేహాలను గుర్తించి వెలికితీసే ప్రక్రియను చేపట్టారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రమించి నీటిలో 30 అడుగుల లోతులో మునిగిన ఐదు మృతదేహాలను వెలికితీశారు.
లోహిత్, దినేశ్వర్, జతిన్‌లు మీర్‌పేటలోని టీకేఆర్ కళాశాలలో డిప్లొమా చేస్తున్నారు. సాహిల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, ధనుష్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఘటనా స్థలానికి డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.
తండ్రి జన్మదినం రోజే కొడుకు మృతి
కొండపోచమ్మ సాగర్‌లో మునిగి చనిపోయిన చీకట్ల దినేశ్వర్ (17) తండ్రి కిషన్‌దాస్ జన్మదినం శనివారమే. తన పుట్టినరోజు నాడే కుమారుడు చనిపోవటంతో ఆ తండ్రి బాధ వర్ణాతీతంగా ఉంది. మరోవైపు చేతికంది వచ్చిన ఇద్దరు కొడుకులూ ఒకేసారి చనిపోవటంతో ధనుష్, లోహిత్‌ల తల్లిదండ్రుల రోదనలు ఆపటం ఎవరితరం కాలేదు.
‘తండ్రి లేని బిడ్డ.. చదివిస్తే బాగుపడతాడని అనుకుంటే ప్రాణాలు పోగొట్టుకుండు..అంటూ సాహిల్ తల్లి అనిత గుండెలవిసేలా రోదించింది. అత్తాపూర్ ముష్క్ మహల్ ప్రాంతానికి చెందిన సాహిల్ దీపక్ సుతార్ (18) చిన్నతనంలోనే అతడి తండ్రి మృతి చెందాడు. తల్లి అనిత స్థానికంగా చిన్నచిన్న పనులు చేస్తూ జీవిస్తోంది. అనిత ఇద్దరు కొడుకుల్లో పెద్ద కుమారుడు డిగ్రీ చదువుతుండగా, సాహిల్ ఇంటరీ్మడియట్ చదువుతున్నాడు. కుమారుడి మృతితో ఆమె తల్లడిల్లిపోయింది.
సీఎం రేవంత్ విచారం
కొండపోచమ్మ సాగర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. యువకులు గల్లంతైన విషయం తెలియగానే గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలకు ఆయన ఆదేశించారు. అనంతరం యువకుల మరణవార్త తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
యువకుల మృతి కలిచి వేసింది:హరీష్‌రావు
కొండపోచమ్మ సాగర్‌లో యువకుల మృతి తనను కలచివేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు అకాల మరణం చెందటం మనస్సును కలిచి వేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment