Kondapocamma Sagar reservoir
-
ఎన్నికలపై స్టే కోరుతూ వ్యాజ్యం.. హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై స్టే ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం న్యాయస్థానం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పిటిషన్లో శ్రవణ్ పేర్కొన్నారు. రాజకీయంగా వెనకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ నిర్వహించలేదని పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదించారు. అయితే విచారణ సందర్భంగా సంబంధిత వ్యాజ్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ వాదనను తీవ్రంగా తప్పపట్టింది. పదేళ్ల క్రితం తీర్పు ఇస్తే ఇప్పటి వరకు ఏం చేశారని ఘాటుగా ప్రశ్నించింది. ఎంబీసీలపై ప్రేమ ఉంటే పదేళ్ల నుంచి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ఎన్నికల షెడ్యూల్ ఇవ్వబోయే చివరి క్షణంలో సుప్రీంకోర్టు తీర్పు గుర్తొచ్చిందా అంటూ వ్యాఖ్యానించింది. రాజకీయ దురుద్దేశంతో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని మండిపడింది. చివరికి పిటిషన్పై విచారణ చేస్తాం కానీ ఎన్నికలపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీచేసింది. హైకోర్టు తీర్పుపై అభ్యంతరం.. సాక్షి, న్యూఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ పరిహారంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గతంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. పెళ్లికాని మేజర్ యువతకు విడిగా పరిహారం చెల్లించాలన్న తీర్పుపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వాదనలు పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని వాదించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ వాదనను ప్రాజెక్ట్ నిర్వాసితుల తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. వాదనలను పరిగణనలోకి తీసుకునే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పూర్తి అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్వాసితులను సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలపై గతంలో ఇచ్చిన స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
కొండపోచమ్మ ప్రణాళిక కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం పెంపు విషయంలో అధికారులు తుది ప్రణాళికలు ఖరారు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా 21 టీఎంసీల బ్యారేజీ సామర్థ్యానికి అనుగుణంగా అంచనాలు, డిజైన్లు, అవసరమయ్యే ఇతర మార్పులపై సమగ్ర నివేదిక సిద్ధం చేశారు. దీన్ని ‘రింగ్ బండ్’ తరహాలో నిర్మించేలా అధికారులు ప్రణాళికలు తయారు చేసినట్లు నీటిపారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో నిర్ణయించిన 7 టీఎంసీల కొండపోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యాన్ని తిరిగి 21 టీఎంసీలకు పెంచాలని ఇటీవల సీఎం నిర్ణయించిన విషయం తెలిసిందే. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో మిగిలిన గ్యాప్ ఆయకట్టుకు సైతం పూర్తి స్థాయిలో నీరందించేలా ప్రతిపాదనలు, డిజైన్లు తయారు చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో గత పది రోజులుగా అధికారులు అదే పనిలో నిమగ్నమయ్యారు. ‘రింగ్ బండ్’ తో తగ్గనున్న ముంపు గతంలో కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణాన్ని 53.74 మీటర్ల ఎత్తులో కట్ట నిర్మాణం చేయాలని భావించారు. దీంతో 5,200 ఎకరాల ముంపు ఉండటంతో పాటు, 1,055 గృహాలను తరలించాల్సి ఉంటుందని లెక్కలేశారు. గతంలో మిగతా రిజర్వాయర్ల మాదిరి ‘యూ’ మోడల్ తరహాలో రిజర్వాయర్ను ప్రతిపాదించడంతో వాటర్ స్ప్రెడ్ ఏరియా పెరిగి ముంపు గణనీయంగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ తరహాలో కాకుండా ‘రింగ్’ అకారంలో బండ్ నిర్మించేలా డిజైన్లు వేశారు. ‘రింగ్బండ్’ విధానంలో రిజర్వాయర్ లోతు పెరగ నుండగా, వాటర్ స్ప్రెడ్ ఏరియా పెరిగేం దుకు అవకాశం ఉండదు. దీంతో ముంపు తగ్గిపోతుంది. ప్రస్తుతం ఈ తరహా విధానమే కొండపోచమ్మలోనూ అమలు చేయాలని అధి కారులు భావిస్తున్నారు. అయితే రింగ్ బండ్ విధానంలో 60 మీటర్ల లోతుకు రిజర్వాయర్ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. దీంతో ముంపు గత అంచనాకు విరుద్ధంగా కేవలం 1,200 ఎకరాలకు పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం 7 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణానికి రూ. 519 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కలు వేయగా, ప్రస్తుతం 21 టీఎంసీల నిర్మాణానికి ఏకంగా రూ.3వేల కోట్లు పెరుగుతుందని అంటున్నారు. రింగ్బండ్ విధానం కావడం తో మోటార్లు, డిశ్చార్జిలుసహా మిగతా అన్నింటి వ్యయ అంచనాలు పెరగనున్నాయి. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల వద్ద ఈ ప్రణాళిక పరిశీలన పూర్తికాగా, ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి, మంత్రి వద్ద ఈ ప్రతిపాదనలపై చర్చ జరిగే అవకాశం ఉంది.