కొండపోచమ్మ ప్రణాళిక కొలిక్కి! | Final plans finalized Kondapocamma Sagar reservoir to increase capacity | Sakshi
Sakshi News home page

కొండపోచమ్మ ప్రణాళిక కొలిక్కి!

Published Mon, Jun 5 2017 1:48 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

కొండపోచమ్మ ప్రణాళిక కొలిక్కి! - Sakshi

కొండపోచమ్మ ప్రణాళిక కొలిక్కి!

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపు విషయంలో అధికారులు తుది ప్రణాళికలు ఖరారు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలకు అనుగుణంగా 21 టీఎంసీల బ్యారేజీ సామర్థ్యానికి అనుగుణంగా అంచనాలు, డిజైన్లు, అవసరమయ్యే ఇతర మార్పులపై సమగ్ర నివేదిక సిద్ధం చేశారు. దీన్ని ‘రింగ్‌ బండ్‌’ తరహాలో నిర్మించేలా అధికారులు ప్రణాళికలు తయారు చేసినట్లు నీటిపారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది.

గతంలో నిర్ణయించిన 7 టీఎంసీల కొండపోచమ్మ రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని తిరిగి 21 టీఎంసీలకు పెంచాలని ఇటీవల సీఎం నిర్ణయించిన విషయం తెలిసిందే. గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలో మిగిలిన గ్యాప్‌ ఆయకట్టుకు సైతం పూర్తి స్థాయిలో నీరందించేలా ప్రతిపాదనలు, డిజైన్లు తయారు చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో గత పది రోజులుగా అధికారులు అదే పనిలో నిమగ్నమయ్యారు.

‘రింగ్‌ బండ్‌’ తో తగ్గనున్న ముంపు
గతంలో కొండపోచమ్మ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని 53.74 మీటర్ల ఎత్తులో కట్ట నిర్మాణం చేయాలని భావించారు. దీంతో  5,200 ఎకరాల ముంపు ఉండటంతో పాటు, 1,055 గృహాలను తరలించాల్సి ఉంటుందని లెక్కలేశారు. గతంలో మిగతా రిజర్వాయర్ల మాదిరి ‘యూ’ మోడల్‌ తరహాలో రిజర్వాయర్‌ను ప్రతిపాదించడంతో వాటర్‌ స్ప్రెడ్‌ ఏరియా పెరిగి ముంపు గణనీయంగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ తరహాలో కాకుండా ‘రింగ్‌’ అకారంలో బండ్‌ నిర్మించేలా డిజైన్‌లు వేశారు. ‘రింగ్‌బండ్‌’ విధానంలో రిజర్వాయర్‌ లోతు పెరగ నుండగా, వాటర్‌ స్ప్రెడ్‌ ఏరియా పెరిగేం దుకు అవకాశం ఉండదు.

 దీంతో ముంపు తగ్గిపోతుంది. ప్రస్తుతం ఈ తరహా విధానమే కొండపోచమ్మలోనూ అమలు చేయాలని అధి కారులు భావిస్తున్నారు. అయితే రింగ్‌ బండ్‌ విధానంలో 60 మీటర్ల లోతుకు రిజర్వాయర్‌ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. దీంతో  ముంపు గత అంచనాకు విరుద్ధంగా కేవలం 1,200 ఎకరాలకు పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం 7 టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ. 519 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కలు వేయగా, ప్రస్తుతం 21 టీఎంసీల నిర్మాణానికి ఏకంగా రూ.3వేల కోట్లు పెరుగుతుందని అంటున్నారు. రింగ్‌బండ్‌ విధానం కావడం తో మోటార్లు, డిశ్చార్జిలుసహా మిగతా అన్నింటి వ్యయ అంచనాలు పెరగనున్నాయి. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల వద్ద ఈ ప్రణాళిక పరిశీలన పూర్తికాగా, ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి, మంత్రి వద్ద ఈ ప్రతిపాదనలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement