గుట్టుగా గుట్ట తవ్వకాలు   | Illegal Mining In Adilabad | Sakshi
Sakshi News home page

గుట్టుగా గుట్ట తవ్వకాలు  

Published Sat, Aug 11 2018 11:43 AM | Last Updated on Sat, Aug 11 2018 11:43 AM

Illegal Mining In Adilabad - Sakshi

అనుమతి లేకుండా గుట్టను తవ్వుతున్న కూలీలు 

మంచిర్యాలటౌన్‌ : కళ్ల ముందే ఖనిజ సంపదను కొల్లగొడుతున్నా వాటిని రక్షించాల్సిన మైనింగ్‌ శాఖ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంలోనే గత ఆరు నెలలకుపైగా ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా క్వారీని నిర్వహిస్తున్నా, తమకేమి సంబంధం లేనట్లుగా వ్యవహరించడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. క్వారీ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని తెలుసుకున్న కొందరు స్థాని కులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, రెండు ట్రాక్టర్లను క్వారీ వద్ద నుంచి బండ ను తరలిస్తుండగా, పట్టుకుని సీజ్‌ చేశారు.

అప్పటి వరకు అది ప్రభుత్వ భూమి అని, అందులోని బం డను పట్టపగలే యథేచ్ఛగా కొందరు కూలీలను పెట్టి మరీ ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నా మైనింగ్‌ శాఖ అధికారుల దృష్టికి రాకపోవడంతోనే కొన్ని నెలలుగా గుట్టను కొల్లగొట్టడంతో ఆ ప్రదేశం అంతా గుంతలుగా మారింది. ఇది పాత మంచిర్యాల నుంచి రంగంపేట్‌కు వెళ్లే దారిలో అండాళమ్మ కాలనీ వద్ద గల కుమ్మరికుం ట చెరువు పక్కనే సాగుతున్న అక్రమ క్వారీ నిర్వహణ. రెవెన్యూ, మైనింగ్‌ శాఖల మధ్య సమన్వ యం లేకపోవడంతో యథేచ్ఛగా గుట్టను తవ్వు తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.

లక్షల సంపద దోపిడీ

పాత మంచిర్యాల నుంచి రంగంపేట్, ఆండాళమ్మ కాలనీకి వెళ్లే దారిలోనే మెయిన్‌ రోడ్డుకు కూతవేటు దూరంలోనే కుమ్మరికుంట చెరువు ఉంది. ఈ చెరువు పక్కనే ఉన్న ప్రదేశం అంతా ప్రభుత్వ భూమినే. 131 సర్వే నంబరులో దాదాపు 11 ఎకరాలకుపైగా మొత్తం క్వారీతో నిండిన ప్రదేశమే. అయితే ఈ భూమి కొంత అటవీప్రాంతంను ఆనుకుని ఉండడం, పూర్తిస్థాయిలో బండరాళ్లు లేకుండా అక్కడక్కడా మైదానప్రాంతం ఉండడం వల్ల ఇక్కడ బండరాయి ఉన్నట్లుగా కనిపించదు.

అయితే ఇటీవల మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా తాగునీటిని సరఫరా చేసేందుకు వాటర్‌ ట్యాంక్‌ను కుమ్మరికుంట చెరువుకు సమీపంలో నిర్మిస్తున్నారు. ఈ ట్యాంకు నిర్మాణంను ఓ కాంట్రాక్టర్‌ చేపడుతుండగా, నిర్మాణం కోసం తవ్వకాలు జరపడంతో ఇక్కడ అంతా బండరాళ్లు బయటపడ్డాయి. ట్యాంకు నిర్మాణం కోసం ఇసుకను సరఫరా చేస్తున్న ట్రాక్టర్‌ యజమానుల కళ్లు అక్కడి బండరాళ్లపై పడింది.

ఆ రాళ్లను ఎవరి అనుమతి తీసుకోకుండానే ప్రతీరోజు రెండు ట్రాక్టర్లతో 20కి పైగా ట్రిప్పులను తరలిస్తున్నారు. ఇందుకు కొందరు కూలీలను సైతం నియమించి, బేస్‌మెంట్‌కు ఉపయోగపడేలా రాళ్లను పగులకొట్టిస్తూ, అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఇక్కడే మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం పనులు జరుగుతుండడంతో, ఇక్కడ అక్రమంగా గుట్టను తవ్వుతున్నట్లుగా ఎవ్వరూ గుర్తించలేకపోయారు.

స్థానికులు కొందరు గుర్తించి, అడిగితే ట్యాంకు నిర్మాణంలో భాగంగా వచ్చిన బండరాయిని వారి అనుమతితోనే ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు అక్రమార్కులు చెప్పుకొచ్చారు. మరికొందరు అనుమతులు ఉన్నాయనుకున్నారు. ఆరు నెలలకు పైగా ఇక్కడి గుట్టను తవ్వకాలు జరపడంతో, గుట్టగా ఉన్న ఆ ప్రాంతం అంతా గుంతలుగా మారింది.

బండరాయి ఒక్కో ట్రాక్టర్‌ ట్రిప్పుకు రూ.1800ల నుంచి రూ.2వేల వరకు తీసుకుంటున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.40 వేలకు పైగా క్వారీ ద్వారా అక్రమంగా సంపాదిస్తున్నారు. నెలకు రూ.12 లక్షకు పైగా ఆదాయం సమకూరుతుండగా, ఆరు నెలలుగా దాదాపుగా రూ.75 లక్షలకు పైగా విలువైన బండరాళ్లను అక్రమంగా ఇక్కడి నుంచి తరలించి సొమ్ము చేసుకున్నారు.

ఎవరికి తెలియదట.. 

జిల్లా కేంద్రంలోనే గత ఆరు నెలలుగా కళ్లముందే అక్రమంగా క్వారీని నిర్వహిస్తున్నా ఇటు మైనింగ్‌ శాఖ అధికారులకు గాని, రెవెన్యూ శాఖ అధికారులకు గాని తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిత్యం ట్రాక్టర్ల ద్వారా బండరాయిని కూలీలను, జేసీబీని పెట్టి పగులకొట్టి తరలిస్తున్నా, ఇంత వరకు తమకు అక్రమ క్వారీ నిర్వహిస్తున్నారన్న విషయం తెలియదని ఆ రెండు శాఖల అధికారులు చెబుతున్నారు.

అధికార పార్టీకే చెందిన కొందరు స్థానికులే ఈ అక్రమదందాకు పాల్పడుతున్నారని, అందుకే అధికారులు ఈ అక్రమ క్వారీని అడ్డుకోలేకపోయారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలోని గోదావరి నదిలో ఇసుకను అక్రమంగా తరలించి, మైనింగ్‌శాఖకు రావాల్సిన కోట్లాది రూపాయలను అక్రమార్కులు కొల్లగొడుతుండగా, ఈ అక్రమ క్వారీ నిర్వహణపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఖనిజ సంపదను ఎవరు పడితే వారు దోచుకెళ్తుంటే, అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై స్థానికులు విస్మయం చెందుతున్నారు.

ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్వారీని నిర్వహించేందుకు ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కేవలం క్వారీ ప్రాంతంలోని సున్నపురాయిని తవ్వుకునేందుకు ఎంసీసీ కంపెనీ వారికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. జిల్లాలోని సబ్బెపల్లి, తిమ్మాపూర్, గూడెం, నాగారం, దేవాపూర్‌లలోని క్వారీలకు మాత్రమే తాము అనుమతి ఇచ్చాం. అక్రమంగా క్వారీని నిర్వహించి, బండరాళ్లను తొలగించిన వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికీ ఈ అక్రమ క్వారీ నిర్వహణ తమ దృష్టికి రాలేదు.

– శ్రీనివాస్, మైనింగ్‌ ఆర్‌ఐ మంచిర్యాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement