గల్లంతైన ఫారెస్ట్‌ ఆఫీసర్ల మృతదేహాలు లభ్యం | 2 Forest Beat Officers Drown Into Pranahita River | Sakshi
Sakshi News home page

గల్లంతైన ఫారెస్ట్‌ ఆఫీసర్ల మృతదేహాలు లభ్యం

Published Mon, Dec 2 2019 8:14 AM | Last Updated on Mon, Dec 2 2019 11:11 AM

2 Forest Beat Officers Drown Into Pranahita River - Sakshi

గాలింపు చర్యలు నిర్వహిస్తున్న సిబ్బంది; బాలకృష్ణ(ఫైల్‌), సురేష్‌ నాయక్‌(ఫైల్‌)

సాక్షి,ఆదిలాబాద్‌: కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండలంలోని గూడెం వద్ద ప్రాణహిత నదిలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్‌ ఆఫీసర్ల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఆదివారం విధుల్లో ఉన్న ఇద్దరు బీట్‌ అధికారులు గల్లంతయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహెరి నుంచి గూడెం వైపుకు నాటు పడవలో వస్తుండగా ప్రమాదం జరిగింది. పడవలో పడవనడిపే నావికుడు పాణె లింగయ్య, సహాయకుడు పేదం అర్జయ్య, ప్రయాణికుడు సూర కత్రయ్య, ముగ్గురు అటవీశాఖ బీట్‌ అధికారులు సద్దాం, ముంజం బాలక్రిష్ణ, బానావత్‌ సురేష్‌ నాయక్‌లు ఉన్నారు. ఖర్జెల్లి రేంజ్‌ పరిధిలోని గూడెం సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు బీట్‌ అధికారులు తమ విధుల్లో భాగంగా పర్యవేక్షిస్తూ నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి కాలినడకన ప్రాణహిత నదికి ఆవలివైపుకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో నాటు పడవలోకి నీరు రావడంతో బయటకు తోడే క్రమంలో పడవ మునిగింది.

లింగయ్య , సహాయకుడు అర్జయ్య, కత్రయ్య సమీపంలోని చెట్ల సహాయంతో బయటకు వచ్చారు. కాగా బీట్‌ అధికారి సద్దాం ఈదుకుంటూ బయటకు రాగా ముంజం బాలక్రిష్ణ, సురేష్‌ నాయక్‌లు నీటమునిగారు. ముంజం బాలక్రిష్ణ స్వస్థలం కాగజ్‌నగర్‌ మండలంలోని చింతగూడ కోయవాగు కాగా బానావత్‌ సురేష్‌ నాయక్‌ కెరమెరి మండలంలోని దేవాపూర్‌ గ్రామపంచాయితీ టెంమ్లగూడ గ్రామానికి చెందినవాడు. సమాచారం అందుకున్న చింతలమానెపల్లి ఎస్సై రాం మోహన్, అటవీశాఖ అధికారులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని కాగజ్‌నగర్‌ డీఎస్పీ స్వామి, కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌ అధికారి విజయ్‌కుమార్‌లు పరిశీలించారు. అటవీ అధికారుల ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సాయంత్రం చీకటి పడడంతో గా లింపు చర్యలు నిలిపి వేసినట్లు ఎస్సై రాంమోహన్‌ తె లిపారు. నదిలో ప్రమాదం నుంచి బయటపడ్డ సద్దాం అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. పడవ నావికుడు లింగయ్య, అర్జయ్యలను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు.

నిర్లక్ష్యంతోనే ప్రమాదం.

పడవ నడిపే వారి నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికుల ఆరోపణలు చేస్తున్నారు. పడవ నడిపే లింగయ్య, సహాయకుడు అర్జయ్యలు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతిరోజు గూడెం నుంచి అహెరి ప్రాంతానికి అహెరి నుంచి అహెరి వైపుకు నిత్యం వందల సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులను తరలించడానికి ఇంజన్లను బిగించిన పెద్ద సైజు పడవలను వినియోగిస్తుంటారు. ఉదయం కేవలం నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉండడంతో చేపల వేటకు వినియోగించే చిన్న నాటుపడవలో వీరిని తరలించేందుకు ప్రయత్నించారు. పడవ ప్రమాదకరంగా ఉండడంతో పడవలోకి నీళ్లు రాగా తోడే క్రమంలో పడవ బోల్తా పడింది. 
ఆందోళనలో కుటుంబసభ్యులు.
బీట్‌ అధికారులు గల్లంతయిన ప్రమాదంపై సమాచారం అందడంతో ఘటనా స్థలానికి బీట్‌ అధికారుల కుటుంబసభ్యులు చేరుకున్నారు. బాలక్రిష్ణ తండ్రి ముంజం మల్లయ్య, సోదరుడు శివ, చింతలమానెపల్లి మండల కేంద్రంలోని ఇతర బంధువులు నది వద్దకు చేరుకున్నారు. బాలక్రిష్ణ గత జూలై నెలలో బీట్‌ అధికారిగా విధుల్లో చేరగా, సురేష్‌ గత అక్టోబర్‌లో విధుల్లో చేరాడు. బాలక్రిష్ణకు భార్య దుర్గారాణి, 6 నెలల కుమారుడు రుద్రాంశ్‌ ఉన్నారు. సురేష్‌ నాయక్‌కు భార్య మనీషా 4సంవత్సరాల కుమారుడు గణేష్‌ ఉన్నాడు. కాగా సురేష్‌ భార్య మనీషా 9నెలల గర్భిణి.

కళ్లముందే నీట మునిగారు
విధుల్లో భాగంగా నదికి ఆవలివైపునకు నిర్మాణంలో ఉన్న వంతెన నుంచి నడిచి వెళ్లాం. తిరిగి వచ్చేక్రమంలో వంతెనపై నుంచి కాకుండా పడవలో బయలుదేరాం. ప్రయాణికులు లేకపోవడంతో నాటు పడవలో వెళ్లాలని పడవ నిర్వాహకులు చెప్పడంతో పడవలోకి ఎక్కాం. నది మధ్యలోకి వెళ్లగానే పడవలోకి నీరు రావడంతో సహాయకుడు నీరు బయటకు తోడే క్రమంలో పడవ మునిగిపోయింది. చెట్ల సహాయంతో నేను, మరో ప్రయాణికుడు ప్రమాదం నుంచి బయటపడ్డాం. మా కళ్ల ముందే ఇద్దరు బీట్‌ అధికారులు నదిలో మునిగిపోయారు.
–సద్దాం, బీట్‌ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement