Beat Officers
-
ఆడవాళ్లకు పోలీసు ఉద్యోగాలెందుకు?!.. అడవిలో ఆడపులులు వాళ్లు
వంటింటి కుందేళ్లన్నారు ఒకప్పుడు.. పులులతో సావాసం చేస్తున్నారిప్పుడు.. సున్నితత్వాన్ని ఆపాదించి కొన్నింటికే పరిమితం చేశారు.. అన్నింటినీ తలదన్ని అటవీ రక్షణకోసం నడుం కట్టారు.. పగలూ రాత్రి, తేడా లేదు.. ఎండా, వానల బెంగేలేదు అడవి కాచిన వెన్నెలను ఆస్వాదిస్తూ.. కలప స్మగ్లర్లనూ ఎదిరిస్తూ.. ప్రతిరోజూ సాహసంతో సహవాసం చేస్తున్నారు ‘మహిళా దినోత్సవం’సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం, గంగారం అడవిలోని బీట్ ఆఫీసర్లపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. సాక్షి, మహబూబాబాద్/కొత్తగూడ: అడవి, అటవీ ఉత్పత్తులను కాపాడటం బీట్ ఆఫీసర్ల విధి. అసలు ఆడవాళ్లకు పోలీసు ఉద్యోగాలెందుకనే ప్రశ్నల నుంచి... మైదానాల్నే కాదు అడవులనూ రక్షించగలమని బాధ్యతలు తీసుకున్నారీ మహిళలు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం రేంజ్ నుండి సరిహద్దు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని దట్టమైన అడవిలో పూనుగుండ్ల, జంగాలగూడెం, మర్రిగూడెం, మడగూడెం, కొడిశల మిట్ల, పందెం, కార్లాయి వంటి గ్రామాలు. ఎటూ 30 కిలోమీటర్ల వైశాల్యం. ఎనిమిది మంది మహిళలు బీట్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. ఓవైపు క్రూర మృగాలు.. మరోవైపు కలప స్మగ్లర్లు. అన్నివైపుల నుంచి సవాళ్లనూ ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. కొన్ని సందర్భాల్లో క్యాంపుగా వెళ్తారు. మరికొన్ని సందర్భాల్లో ఒంటరిగా విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఒక్కసారి అడవిలోకి అడుగుపెట్టారంటే... మొబైల్ సిగ్నల్స్ ఉండవు. వెంట తీసుకెళ్లిన ఆహారం అయిపోతే ఇక ఉపవాసమే. ఒక్కోసారి సెలయేరుల్లో నీటిని తాగాల్సి వస్తుంది. ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి. తరుచుగా పులులు, చిరుతలు, ఎలుగు బంట్లు, ఇతర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. గిరిజనులకు రక్షణ కల్పించేందుకు వాటి సంచారాన్ని గుర్తించాలి. ఏ వైపు నుంచి ఏ జంతువు వస్తుందో తెలియదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేయాల్సి ఉంటుంది. ప్రాణాలను పణంగా పెట్టి... అటవీ ప్రాంతం... టేకు, నల్లమద్ది, జిట్రేగు వంటి విలువైన కలపకు నెలవు. వీటిని దొంగిలించేందుకు స్మగ్లర్ల సంచారమూ ఎక్కువ. రాత్రి పగలు అనే తేడా లేకుండా అటవీ మార్గంలోని చెక్ పోస్టులు, డొంకదారుల వద్ద కాపు కాస్తుంటారు. జంతువుల నుండి ఆత్మరక్షణ పొందేందుకు ప్రభుత్వం ఇచ్చిన కొడవలిని పోలిన ఆయుధం ఒక్కటే ఉంటుంది. వాహనాలకు ఎదురు పోతే ఢీకొట్టి వెళ్తారు. ఈ పరిస్థితుల్లో స్మగ్లర్లను పట్టుకోవడం, ప్రభుత్వానికి అప్పగించడం... ప్రాణాలను పణంగా పెట్టి అడవిలో పెట్రోలింగ్ చేస్తుంటారు. అధికారులు, ఆదివాసీల మధ్య... రోజురోజుకూ అంతరించి పోతున్న అడవిని కాపాడటం వారి బాధ్యత. ఇందులో భాగంగా పోడు కొట్టడం, అటవీ భూముల్లో వ్యవసాయం చేసే రైతులను అడ్డుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తారు. దీంతో అటవీ ప్రాంతానికి వెళ్లి ట్రంచ్(కందకం)లు తీయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు గిరిజనుల నుండి ప్రతిఘటన ఎదురవుతుంది. వారు దాడులు చేసే ప్రమాదమూ ఉంటుంది. కానీ విధి కదా. బాధ్యతగా నిర్వర్తించాలి. ఇక బాధ్యతల్లో ఉన్నది అడవి బిడ్డలైదే... అటు అధికారుల ఆదేశాలు... ఇటు తమ జాతి బతుకుదెరువు. ఎటూ తేల్చుకోలేని స్థితి. గిరిజనులను ఒప్పించడము కత్తిమీద సామే. అటు బంధాలకు బంధీలవ్వకుండా, అధికారుల ఆదేశాలను గౌరవిస్తూ... బ్యాలెన్స్డ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీటెక్ చదివి... బీట్ ఆఫీసర్‌గా మంచి ఇంజనీర్ అవ్వాలనుకున్నా. ఈలోపే బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ పడింది. అప్లై చేస్తే ఉద్యోగం వచ్చింది. బీటెక్ చదివి... బీట్ ఆఫీసర్ ఉద్యోగమా? అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం రావడమే అదృష్టం. వచ్చిన ఉద్యోగాన్ని అంకితభావంతో చేయాలనుకున్నా. ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నా. – దుబ్బ స్రవంతి, ఫారెస్టు బీట్ ఆఫీసర్ చాలెంజింగ్‌గా ఉంది... మాది మంగపేట మండలం. టీచర్ కావాలనుకున్నా. బీఈడీ చదివిన. ఉపాధ్యాయ పోస్టులు పడలేదు. ఈలోపే ఫారెస్టు బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు పడ్డాయి. కష్టపడి చదివి ఉద్యోగం సాధించాను. ఇది కఠినమైన ఉద్యోగమని ఇంట్లో వాళ్లు భయపడ్డారు. ‘మగవాళ్లు చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదు’అని ఉద్యోగంలో చేరాను. విధి నిర్వహణ చాలెంజింగ్‌గా ఉంది. – కొండ లక్ష్మి, ఫారెస్టు బీట్ఆఫీసర్ అదృష్టంగా భావిస్తా.. మాది ములుగు జిల్లా మేడారం. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. అడవిలో పుట్టి పెరిగిన నేను మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలుగన్నాను. మా ఇండ్లలో ప్రభుత్వ ఉద్యోగం రావడమే అదృష్టం. ఈ ఉద్యోగం వచ్చింది. అమ్మ, నాన్నలు కూడా ప్రోత్సహించారు. అడవిబిడ్డగా ఆదివాసీల మధ్య ఉద్యోగం చేయడం అదృష్టంగా భావిస్తున్నా. – ఆలెం వసంతలక్ష్మి, ఫారెస్టు బీట్ ఆఫీసర్ చిన్న పిల్లలను విడిచి నైట్ పెట్రోలింగ్‌కు... మాది ఉమ్మడి వరంగల్ జిల్లా వాడగూడ. కొత్తగూడ రేంజ్లో బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నా. కఠినమైన ఈ డ్యూటీలో చేరాలంటే ముందు భయపడ్డా. నాకు ఇద్దరు పిల్లలు. పసిపిల్లలను ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం క్యాంపు ఆఫీసులో విడిచిపెట్టి నైట్ పెట్రోలింగ్‌కు వెళ్లాల్సి వచ్చేది. పిల్లలా... ఉద్యోగమా అనుకున్నప్పుడు. రెండూ ముఖ్యమే అనిపించింది. అలాంటి పరిస్థితుల్లోనూ వెనుకడుగేయకుండా పనిచేసినందుకు గర్వంగా ఉంటుంది. –బంగారం లలిత, ఫారెస్టు బీట్ ఆఫీసర్ కత్తిమీద సాములా... మాది గంగారం అడవి ప్రాంతంలోని మడగూడెం. నేను డిగ్రీ చదివిన. 2013లో బీట్ ఆఫీసర్‌గా చేరాను. కొంత కాలం ములుగు, ఏటూరు నాగారం ప్రాంతాల్లో పనిచేశాను. ఇప్పుడు కొత్తగూడ రేంజ్లో పనిచేస్తున్నాను. గత ఏడాది గిరిజనుల భూముల్లో ట్రంచ్‌లు వేసేందుకు వెళ్లాను. ఒక వైపు అధికారుల ఆదేశాలు. మరో వైపు ఆదివాసీ గిరిజనుల ఆందోళనలు. అడవి బిడ్డగా వారి వాదన సమంజసమే అనిపిస్తుంది. అయినా నా విధులు నేను నిర్వర్తించాలి. ఇలాంటప్పుడు కత్తిమీద సాములా ఉంటుంది. – సుంచ సంధ్యారాణి, ఫారెస్టు బీట్ ఆఫీసర్ -
30 ఏళ్లుగా పదోన్నతులు లేవు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అటవీ శాఖ ఉద్యోగుల విషయంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దాలని తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణలో బీట్ ఆఫీసర్లకు 30 ఏళ్లుగా ఎలాంటి పదోన్నతులు ఇవ్వలేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతుల అంశంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. పే స్కేల్, కేడర్ల అంశంలో ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అటవీ శాఖలో ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమం కిసాన్ ఆందోళన నేపథ్యంలో వాయిదా పడింది. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీ తెలంగాణభవన్‌లో జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ మొజాం అలీ ఖాన్ మాట్లాడుతూ..ఉద్యోగ విధుల్లో అమరులైన తమతోటి ఉద్యోగులను గౌరవంగా చూడాలని, మరణించిన ఉద్యోగి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. తమ ప్రాణరక్షణ కోసం ఆయుధాలు కూడా అందించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా అటవీ ఉద్యోగులకు ఒకేరీతిలో ఒకే సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆల్ ఇండియా ఫారెస్ట్ ఆఫీసర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కమల్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ...పర్యావరణ విభాగాన్ని పూర్తిగా కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ విభాగం కేంద్రం, రాష్ట్రం ఉమ్మడి పరిధిలో ఉండటంతో అనేక సమస్యలకు పరిష్కారం లభించడం లేదని ఆయన వాపోయారు. త్వరలోనే మళ్ళీ ఆందోళన కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. -
గల్లంతైన ఫారెస్ట్ ఆఫీసర్ల మృతదేహాలు లభ్యం
సాక్షి,ఆదిలాబాద్: కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండలంలోని గూడెం వద్ద ప్రాణహిత నదిలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్ల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఆదివారం విధుల్లో ఉన్న ఇద్దరు బీట్ అధికారులు గల్లంతయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహెరి నుంచి గూడెం వైపుకు నాటు పడవలో వస్తుండగా ప్రమాదం జరిగింది. పడవలో పడవనడిపే నావికుడు పాణె లింగయ్య, సహాయకుడు పేదం అర్జయ్య, ప్రయాణికుడు సూర కత్రయ్య, ముగ్గురు అటవీశాఖ బీట్ అధికారులు సద్దాం, ముంజం బాలక్రిష్ణ, బానావత్ సురేష్ నాయక్‌లు ఉన్నారు. ఖర్జెల్లి రేంజ్ పరిధిలోని గూడెం సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు బీట్ అధికారులు తమ విధుల్లో భాగంగా పర్యవేక్షిస్తూ నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి కాలినడకన ప్రాణహిత నదికి ఆవలివైపుకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో నాటు పడవలోకి నీరు రావడంతో బయటకు తోడే క్రమంలో పడవ మునిగింది. లింగయ్య , సహాయకుడు అర్జయ్య, కత్రయ్య సమీపంలోని చెట్ల సహాయంతో బయటకు వచ్చారు. కాగా బీట్ అధికారి సద్దాం ఈదుకుంటూ బయటకు రాగా ముంజం బాలక్రిష్ణ, సురేష్ నాయక్‌లు నీటమునిగారు. ముంజం బాలక్రిష్ణ స్వస్థలం కాగజ్‌నగర్ మండలంలోని చింతగూడ కోయవాగు కాగా బానావత్ సురేష్ నాయక్ కెరమెరి మండలంలోని దేవాపూర్ గ్రామపంచాయితీ టెంమ్లగూడ గ్రామానికి చెందినవాడు. సమాచారం అందుకున్న చింతలమానెపల్లి ఎస్సై రాం మోహన్, అటవీశాఖ అధికారులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని కాగజ్‌నగర్ డీఎస్పీ స్వామి, కాగజ్‌నగర్ అటవీ డివిజన్ అధికారి విజయ్‌కుమార్‌లు పరిశీలించారు. అటవీ అధికారుల ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సాయంత్రం చీకటి పడడంతో గా లింపు చర్యలు నిలిపి వేసినట్లు ఎస్సై రాంమోహన్ తె లిపారు. నదిలో ప్రమాదం నుంచి బయటపడ్డ సద్దాం అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. పడవ నావికుడు లింగయ్య, అర్జయ్యలను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. నిర్లక్ష్యంతోనే ప్రమాదం. పడవ నడిపే వారి నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికుల ఆరోపణలు చేస్తున్నారు. పడవ నడిపే లింగయ్య, సహాయకుడు అర్జయ్యలు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతిరోజు గూడెం నుంచి అహెరి ప్రాంతానికి అహెరి నుంచి అహెరి వైపుకు నిత్యం వందల సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులను తరలించడానికి ఇంజన్లను బిగించిన పెద్ద సైజు పడవలను వినియోగిస్తుంటారు. ఉదయం కేవలం నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉండడంతో చేపల వేటకు వినియోగించే చిన్న నాటుపడవలో వీరిని తరలించేందుకు ప్రయత్నించారు. పడవ ప్రమాదకరంగా ఉండడంతో పడవలోకి నీళ్లు రాగా తోడే క్రమంలో పడవ బోల్తా పడింది. ఆందోళనలో కుటుంబసభ్యులు. బీట్ అధికారులు గల్లంతయిన ప్రమాదంపై సమాచారం అందడంతో ఘటనా స్థలానికి బీట్ అధికారుల కుటుంబసభ్యులు చేరుకున్నారు. బాలక్రిష్ణ తండ్రి ముంజం మల్లయ్య, సోదరుడు శివ, చింతలమానెపల్లి మండల కేంద్రంలోని ఇతర బంధువులు నది వద్దకు చేరుకున్నారు. బాలక్రిష్ణ గత జూలై నెలలో బీట్ అధికారిగా విధుల్లో చేరగా, సురేష్ గత అక్టోబర్‌లో విధుల్లో చేరాడు. బాలక్రిష్ణకు భార్య దుర్గారాణి, 6 నెలల కుమారుడు రుద్రాంశ్ ఉన్నారు. సురేష్ నాయక్‌కు భార్య మనీషా 4సంవత్సరాల కుమారుడు గణేష్ ఉన్నాడు. కాగా సురేష్ భార్య మనీషా 9నెలల గర్భిణి. కళ్లముందే నీట మునిగారు విధుల్లో భాగంగా నదికి ఆవలివైపునకు నిర్మాణంలో ఉన్న వంతెన నుంచి నడిచి వెళ్లాం. తిరిగి వచ్చేక్రమంలో వంతెనపై నుంచి కాకుండా పడవలో బయలుదేరాం. ప్రయాణికులు లేకపోవడంతో నాటు పడవలో వెళ్లాలని పడవ నిర్వాహకులు చెప్పడంతో పడవలోకి ఎక్కాం. నది మధ్యలోకి వెళ్లగానే పడవలోకి నీరు రావడంతో సహాయకుడు నీరు బయటకు తోడే క్రమంలో పడవ మునిగిపోయింది. చెట్ల సహాయంతో నేను, మరో ప్రయాణికుడు ప్రమాదం నుంచి బయటపడ్డాం. మా కళ్ల ముందే ఇద్దరు బీట్ అధికారులు నదిలో మునిగిపోయారు. –సద్దాం, బీట్ అధికారి -
బీట్ ఆఫీసర్ల నియామకానికి లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్ : ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల నియామకానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగిపోయిన బీట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీని చేపట్టాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. 1857 బీట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ ప్రక్రియ చేపట్టింది. అయితే, టీఎస్పీఎస్సీ 6(A) రూల్స్ పాటించకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నియామకాలను అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు సింగిల్‌బెంచ్ విచారించి స్టే విధించింది. దీంతో సింగిల్ బెంచ్ విధించిన స్టే పై పలువురు అభ్యర్థులు డబుల్ బెంచ్‌లో సవాల్ చేశారు. విచారించిన డబుల్ బెంచ్ బీట్ ఆఫీసర్ల నియామకం జరపాలని.. ఇతరత్రా ఏమైనా నిబంధనలు ఉంటే టీఎస్పీఎస్సీ చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అటవీశాఖలో అధికారుల నియామకం ఆగిపోతే ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. -
అనువాదం..అయోమయం
ఏపీపీఎస్సీ తీరు మారనంటోంది. చిన్నపోస్టులకూ కఠినమైన ప్రశ్నలు సంధిస్తోంది. ఇది చాలదన్నట్టూ ఇంగ్లిషు, తెలుగు అనువాదంలో గందరగోళం సృష్టిస్తోంది. ఏది తప్పో.. ఏది కరెక్టో తెలియక తలలుపట్టుకునేలా చేస్తోంది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. దీన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, తిరుపతి అన్నమయ్యసర్కిల్ : రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 430 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టుల నియామకానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ జారీచేసింది. ఆయా పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా నుంచి దాదాపు 6,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం జిల్లాలో తిరుపతి కేంద్రంగా 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆదివారం జరిగిన పరీక్షకు 58.09శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. గందరగోళంగా ప్రశ్నాపత్రం ఆదివారం జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పరీక్ష ప్రశ్నాపత్రం గందరగోళంగా ఉందని అభ్యర్థులు విమర్శించారు. ప్రధానంగా తెలుగు, ఇంగ్లిష్ అనువాదంలో తప్పులు దొర్లాయని ఆరోపించారు. ప్రశ్నలు రెండు భాషల్లోనూ ఒకే విధంగా ఉన్నా, నాలుగు ఆప్షన్లలో ఇచ్చిన జవాబుల్లో పూర్తిగా సంబంధం లేని విధంగా ఉండడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఇదిలా ఉంటే మ్యాథ్స్ ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని, సైన్స్, కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలు సివిల్స్ పరీక్షను తలపించాయని అభ్యర్థులు వాపోయారు. ప్రశ్నల సరళి గతం కంటే భిన్నంగా తికమక కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. ఇంటర్ విద్యార్హతతో నిర్వహించే ఈ పరీక్షను కఠినమైన ప్రశ్నలతో ఇవ్వడం దారుణమని అభ్యర్థులు, వివిధ విద్యార్థి సంఘాలు, మేధావులు విమర్శించారు. మితిమీరుతున్న విమర్శలు ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న ప్రతి పరీక్ష వివాదాస్పదంగా మారిందని మేధావులు చెబుతున్నారు. ఆదివారం జరిగిన పరీక్షే కాకుండా గతంలో జరిగిన గ్రూప్–1, 2, 3తో పాటు డిపార్టమెంటల్ పరీక్షల్లో కూడా ప్రశ్న పత్రాల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీపీఎస్సీ తీరులో ఎటువంటి మార్పు రాలేదు. రాష్ట్రంలో కొత్తగా కొలువైన ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మ్యాథ్స్ కఠినం మ్యాథ్స్ కఠినంగా అనిపించింది. జనరల్ సైన్స్ సులువుగా ఉన్నా కరెంట్ అఫైర్స్‌పై అధిక ప్రశ్నలు వచ్చాయి. మొత్తానికి ఈ ప్రశ్న పత్రం ఇంటర్ స్థాయిలో లేదు. కొంత కఠినంగా ఉంది. ప్రశ్నలు తారుమారుగా ఇవ్వడంతో సమయం వృథా అయ్యింది. – లేఖశ్రీ, అభ్యర్థిని, తిరుపతి అనువాదంలో అయోమయం తెలుగు, ఇంగ్లిష్ ప్రశ్నల విషయంలో అనువాదం సరిగ్గా లేదు. అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. గణితంలో ఇచ్చిన ప్రశ్నలు గ్రూప్–1 స్థాయిని తలపించింది. సైన్స్, కరెంట్ అఫైర్స్ కొంత సులువుగా ఉన్నాయి. – అభిలాష్, అభ్యర్థి, తిరుపతి ఆప్షన్స్‌లో గందరగోళం తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రశ్నలు ఒకే విధంగా ఉన్నప్పటికీ ఆప్షన్స్‌లో ఇచ్చిన జవాబుల్లో గందరగోళం నెలకొంది. తెలుగులో ఒకలా, ఇంగ్లిష్‌లో మరోలా జవాబులున్నాయి. ఏది సరి, ఏది తప్పు అని గుర్తించడంలో కొంత గందరగోళం నెలకొంది. – నాగమణి, అభ్యర్థిని, అనంతపురం ప్రశ్నల సరళి విభిన్నం గత మోడల్ పేపర్ కంటే ప్రస్తుత పరీక్షలో ప్రశ్నల సరళి విభిన్నంగా ఉంది. చాలా ప్రశ్నలు తప్పుగా ఇచ్చారు. ఎక్కువ భాగం సైన్స్, కరెంట్ అఫైర్స్‌లో సంధించారు. ప్రశ్న పత్రం విభిన్నంగా ఉండడంతో అర్థం చేసుకోవడానికే సమయం సరిపోయింది. – జనార్థన్, అభ్యర్థి, తిరుపతి కొత్త ప్రభుత్వంపై ఆశలు ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసే దిశగా నూతన ప్రభుత్వం వ్యవహరిస్తుందని భావిస్తున్నాం. నిరుద్యోగులు సైతం నూతన ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఏపీపీఎస్సీ క్యాలెండర్‌ను రూపొందించి ప్రతి ఏటా ప్రతి శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నిరుద్యోగులకు అండగా ఉంటుందని ఆశిస్తున్నాం. – డి.సుబ్రమణ్యంరెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎస్వీయూ -
ఇద్దరు అటవీ బీట్ అధికారుల దారుణహత్య
గొడ్డళ్లతో నరికి చంపిన కలప దొంగలు బొల్లాపల్లి: కలప అక్రమ రవాణాదారులు రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న ఇద్దరు అటవీశాఖ బీట్ అధికారులపై గొడ్డళ్లతో దాడి చేసి దారుణంగా నరికి చంపారు. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం కనమలచెర్వు పంచాయతీ శివారు నెహ్రూనగర్ తండా సమీపంలోని పురుగులకుంట వద్ద శనివారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. కలప అక్రమ రవాణాదారులు చెట్లను నరుకుతున్నారన్న సమాచారం మేరకు నాయుడుపాలెం, కండ్రిక బీట్ అధికారులు దిడ్ల లాజర్(44), షేక్ బాజీషాహిద్(48) ఘటనాస్థలానికి ఉదయం 8 గంటల సమయంలో తమ ద్విచక్ర వాహనంపై చేరుకున్నారు. వారిపై నిందితులు అటవీశాఖాధికారులపై గొడ్డళ్లతో దాడి చేసి పాశవికంగా నరికేశారు. లాజర్, బాజీషాహిద్ అక్కడికక్కడే మృతిచెందారు. అటవీశాఖ డీఆర్వో నరసింహారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లాజర్, బాజీలు తమ వద్దనున్న కెమెరాతో తీసిన ఫొటోలను పరిశీలించిన పోలీసులు.. ఈ దారుణానికి పాల్పడిన వారు ఘటనా ప్రాంతానికి సమీపంలోని గాంధీనగర్(సంగం)కు చెందినవారుగా గుర్తించారు. గాలింపు చేపట్టారు.