పద్మావతి బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రానికి వెళ్తున్న అభ్యర్థులు
ఏపీపీఎస్సీ తీరు మారనంటోంది. చిన్నపోస్టులకూ కఠినమైన ప్రశ్నలు సంధిస్తోంది. ఇది చాలదన్నట్టూ ఇంగ్లిషు, తెలుగు అనువాదంలో గందరగోళం సృష్టిస్తోంది. ఏది తప్పో.. ఏది కరెక్టో తెలియక తలలుపట్టుకునేలా చేస్తోంది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. దీన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
సాక్షి, తిరుపతి అన్నమయ్యసర్కిల్ : రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 430 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టుల నియామకానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ జారీచేసింది. ఆయా పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా నుంచి దాదాపు 6,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం జిల్లాలో తిరుపతి కేంద్రంగా 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆదివారం జరిగిన పరీక్షకు 58.09శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు.
గందరగోళంగా ప్రశ్నాపత్రం
ఆదివారం జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పరీక్ష ప్రశ్నాపత్రం గందరగోళంగా ఉందని అభ్యర్థులు విమర్శించారు. ప్రధానంగా తెలుగు, ఇంగ్లిష్ అనువాదంలో తప్పులు దొర్లాయని ఆరోపించారు. ప్రశ్నలు రెండు భాషల్లోనూ ఒకే విధంగా ఉన్నా, నాలుగు ఆప్షన్లలో ఇచ్చిన జవాబుల్లో పూర్తిగా సంబంధం లేని విధంగా ఉండడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఇదిలా ఉంటే మ్యాథ్స్ ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని, సైన్స్, కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలు సివిల్స్ పరీక్షను తలపించాయని అభ్యర్థులు వాపోయారు. ప్రశ్నల సరళి గతం కంటే భిన్నంగా తికమక కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. ఇంటర్ విద్యార్హతతో నిర్వహించే ఈ పరీక్షను కఠినమైన ప్రశ్నలతో ఇవ్వడం దారుణమని అభ్యర్థులు, వివిధ విద్యార్థి సంఘాలు, మేధావులు విమర్శించారు.
మితిమీరుతున్న విమర్శలు
ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న ప్రతి పరీక్ష వివాదాస్పదంగా మారిందని మేధావులు చెబుతున్నారు. ఆదివారం జరిగిన పరీక్షే కాకుండా గతంలో జరిగిన గ్రూప్–1, 2, 3తో పాటు డిపార్టమెంటల్ పరీక్షల్లో కూడా ప్రశ్న పత్రాల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీపీఎస్సీ తీరులో ఎటువంటి మార్పు రాలేదు. రాష్ట్రంలో కొత్తగా కొలువైన ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మ్యాథ్స్ కఠినం
మ్యాథ్స్ కఠినంగా అనిపించింది. జనరల్ సైన్స్ సులువుగా ఉన్నా కరెంట్ అఫైర్స్‌పై అధిక ప్రశ్నలు వచ్చాయి. మొత్తానికి ఈ ప్రశ్న పత్రం ఇంటర్ స్థాయిలో లేదు. కొంత కఠినంగా ఉంది. ప్రశ్నలు తారుమారుగా ఇవ్వడంతో సమయం వృథా అయ్యింది.
– లేఖశ్రీ, అభ్యర్థిని, తిరుపతి
అనువాదంలో అయోమయం
తెలుగు, ఇంగ్లిష్ ప్రశ్నల విషయంలో అనువాదం సరిగ్గా లేదు. అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. గణితంలో ఇచ్చిన ప్రశ్నలు గ్రూప్–1 స్థాయిని తలపించింది. సైన్స్, కరెంట్ అఫైర్స్ కొంత సులువుగా ఉన్నాయి.
– అభిలాష్, అభ్యర్థి, తిరుపతి
ఆప్షన్స్‌లో గందరగోళం
తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రశ్నలు ఒకే విధంగా ఉన్నప్పటికీ ఆప్షన్స్‌లో ఇచ్చిన జవాబుల్లో గందరగోళం నెలకొంది. తెలుగులో ఒకలా, ఇంగ్లిష్‌లో మరోలా జవాబులున్నాయి. ఏది సరి, ఏది తప్పు అని గుర్తించడంలో కొంత గందరగోళం నెలకొంది.
– నాగమణి, అభ్యర్థిని, అనంతపురం
ప్రశ్నల సరళి విభిన్నం
గత మోడల్ పేపర్ కంటే ప్రస్తుత పరీక్షలో ప్రశ్నల సరళి విభిన్నంగా ఉంది. చాలా ప్రశ్నలు తప్పుగా ఇచ్చారు. ఎక్కువ భాగం సైన్స్, కరెంట్ అఫైర్స్‌లో సంధించారు. ప్రశ్న పత్రం విభిన్నంగా ఉండడంతో అర్థం చేసుకోవడానికే సమయం సరిపోయింది.
– జనార్థన్, అభ్యర్థి, తిరుపతి
కొత్త ప్రభుత్వంపై ఆశలు
ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసే దిశగా నూతన ప్రభుత్వం వ్యవహరిస్తుందని భావిస్తున్నాం. నిరుద్యోగులు సైతం నూతన ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఏపీపీఎస్సీ క్యాలెండర్‌ను రూపొందించి ప్రతి ఏటా ప్రతి శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నిరుద్యోగులకు అండగా ఉంటుందని ఆశిస్తున్నాం.
– డి.సుబ్రమణ్యంరెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎస్వీయూ
Comments
Please login to add a commentAdd a comment