సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అటవీ శాఖ ఉద్యోగుల విషయంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దాలని తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణలో బీట్ ఆఫీసర్లకు 30 ఏళ్లుగా ఎలాంటి పదోన్నతులు ఇవ్వలేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతుల అంశంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. పే స్కేల్, కేడర్ల అంశంలో ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అటవీ శాఖలో ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమం కిసాన్ ఆందోళన నేపథ్యంలో వాయిదా పడింది.
ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీ తెలంగాణభవన్‌లో జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ మొజాం అలీ ఖాన్ మాట్లాడుతూ..ఉద్యోగ విధుల్లో అమరులైన తమతోటి ఉద్యోగులను గౌరవంగా చూడాలని, మరణించిన ఉద్యోగి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. తమ ప్రాణరక్షణ కోసం ఆయుధాలు కూడా అందించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా అటవీ ఉద్యోగులకు ఒకేరీతిలో ఒకే సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఆల్ ఇండియా ఫారెస్ట్ ఆఫీసర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కమల్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ...పర్యావరణ విభాగాన్ని పూర్తిగా కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ విభాగం కేంద్రం, రాష్ట్రం ఉమ్మడి పరిధిలో ఉండటంతో అనేక సమస్యలకు పరిష్కారం లభించడం లేదని ఆయన వాపోయారు. త్వరలోనే మళ్ళీ ఆందోళన కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment