వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి
సాక్షి, మామడ(నిర్మల్): ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు తన తమ్ముడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చింది. మామడ మండలకేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం నిర్మల్ డీఎస్పీ ఉపేంద్రరెడ్డి, సోన్ సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై అనూష వివరించారు. మండలకేంద్రానికి చెందిన సయ్యద్ సద్దాం (30) ఈనెల 16న మృతిచెందాడు. మృతిపై అనుమానాలు రావడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు విషయాన్ని చేధించారు. బోథ్‌కు చెందిన సయ్యద్ సద్దాం.. మామడకు చెందిన సయ్యద్ నూరిని ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి మామడలోనే ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా సద్దాం వద్ద మహ్మద్ షఫీ మేకలకాపరిగా పనిచేస్తున్నాడు. షఫీ కుమారుడైన అలీంతో సద్దాం భార్య నూరికి పరిచయం ఏర్పడింది.
అది వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న సద్దాం భార్యను పద్ధతి మార్చుకోవాలని మందలించాడు. మద్యం సేవించి వచ్చి మందలిస్తుండడంతో నూరి తన ప్రియుడు అలీంకు తెలిపింది. దీంతో సద్దాంను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించిన ఇద్దరు ఈనెల 16నరాత్రి నూరి తన తమ్ముడు రియాజ్ సహకారంతో సద్దాం మెడకు చున్నీతో ఉరివేసి చంపేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోని ఓ కర్రకు ఉరేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. మొదట్లో ఆత్మహత్యగానే భావించిన కుటుంబ సభ్యులు మృతదేహంపై గాయాలు, భార్య తీరుపై అనుమానం ఉండటంతో సద్దాం తల్లి తాజ్‌బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
నెలలోనే మరో ఘటన..
మామడ మండలంలో ఇదే తీరులో.. నెల వ్యవధిలో మరో ఘటన చోటుచేసుకోవడం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు ప్రియులతో కలిసి స్థానిక పొన్కల్ శివారులోనే గోదావరి వద్ద చంపించింది. ఆ కేసు ఈనెల ఒకటిన తేలింది. తాజాగా ఇదే మండలకేంద్రంలో ప్రియుడి మోజులో పడి భార్య భర్తను హతమార్చిన ఘటన వెలుగు చూసింది.
Comments
Please login to add a commentAdd a comment