అనుమానమే పెనుభూతమై.. | Husband Harassment Women Suicide Attempt Adilabad | Sakshi
Sakshi News home page

అనుమానమే పెనుభూతమై..

Published Fri, May 3 2019 8:05 AM | Last Updated on Fri, May 3 2019 8:05 AM

Husband Harassment Women Suicide Attempt Adilabad - Sakshi

రోదిస్తున్న సరిత తల్లి, కుటుంబ సభ్యులు, సరిత( ఫైల్‌)

రెబ్బెన(ఆసిఫాబాద్‌): కట్టుకున్న భార్యపై ఉన్న అనుమానానికి తోడు అదనపు కట్నంకోసం జీవితాంతం తోడుగా నిలవాల్చిన భర్తే భార్యను కడతేర్చిన సంఘటన రెబ్బెన మండలం నారాయణపూర్‌లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నారాయణపూర్‌ గ్రామానికి చెందిన కుడికాలు రామకృష్ణ ఆటోడ్రైవర్‌. ఈయనకు తాండూర్‌ మండలం కాసిపేట గ్రామానికి చెందిన సరిత (27)తో 2011లో వివాహమైంది. వీరికి అరవింద్‌ (7), శ్రీనిధి(5)  పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగింది. రెండేళ్లుగా రామకృష్ణ భార్య సరితపై అనుమానం పెంచుకున్నాడు.

అప్పటినుంచి కలహాలు ఏర్పడ్డాయి. ఈక్రమంలోనే రామకృష్ణ తల్లి కమల, తండ్రి హన్మంతుతో కలిసి సరితను అదనపు కట్నంకోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. నారాయణపూర్‌ గ్రామంలో సరిత పేరుపై రెండెకరాల వ్యవసాయ భూమి ఉండగా.. దానిని అమ్మాలని ఒత్తిడి తెచ్చారు. దానికి సరిత ససేమిరా అనటంతో వేధింపులు మరింత అధికమయ్యాయి.

దీంతో ఎలాగైనా సరితను అంతమొందించాలనే పథకం పన్నిన రామకృష్ణ.. తల్లిదండ్రుల ప్రోద్బలంతో బుధవారం అర్ధరాత్రి ఇంట్లో పడుకుని ఉన్న సరిత తలపై బలమైన ఆయుధంతో మోదడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్‌ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. రెబ్బెన సీఐ రమణమూర్తి, ఆసిఫాబాద్‌ సీఐ మల్లయ్య, ఆసిఫాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి తమ్ముడు ములుకుట్ల లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement