స్వాతిబాయి మృతదేహం నిందితుడు శివను చూపిస్తూ వివరాలు వెల్లడిస్తున్న సీఐ రమేష్ (ఇన్‌సెట్) అరుణ మృతదేహం
భార్యలను ప్రేమగా చూసుకోవాల్సిన ఆ భర్తలు కిరాతకంగా మారారు. ఒకరు వివాహేతర సంబంధం నెరపుతుందనే అనుమానంతో భార్యను కర్రతో విచక్షణారహితంగా కొట్టి హతమార్చాడు. మరొకరు అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తుండటంతో మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తే తమ కూతురుని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలు ఉభయ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్నాయి..
పాల్వంచ: అనుమానం ఆమె పాలిట శాపమైంది.. భార్య వివాహేతర సంబంధం నెరుపుతుందని కక్ష పెంచుకుని కొంత కాలంగా వేధిస్తూ చివరికి ఆమెను హతమార్చిన సంఘటన పాల్వంచ మండలంలో చోటుచేసుకుంది.. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మడత రమేష్ వివరించారు. పట్టణంలోని సీతారాంపట్నం ఏరియా చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కందుకూరి శివ 15 సంవత్సరాల క్రితం భద్రాచలానికి చెందిన మేనకోడలు అరుణ (32)ను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం పాటు వారి సంసారం సాఫీగా సాగింది. సంవత్సర కాలంగా భార్య అరుణను అనుమానించడం మొదలు పెట్టాడు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతున్నావంటూ వేధిస్తున్నాడు. ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా చేశారు. అయినా మార్పు రాలేదనే కక్షతో రగిలిపోయాడు.
గురువారం అర్ధరాత్రి 2గంటల సమయంలో భార్య నిద్రిస్తుండగా కర్రతో తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె తల, ముఖం తీవ్రంగా పగిలి రక్తస్రావం అయి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే శివ పరారయ్యాడు. సంఘటనా స్థలాన్ని సీఐ మడత రమేష్, ఎస్‌ఐ ముత్యం రమేష్ సందర్శించారు. శివ అంబేడ్కర్ సెంటర్ వద్ద ఉన్నాడనే సమాచారంతో అక్కడకు వెళ్లి పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మృతురాలికి కుమారుడు, కూతురు, ఉన్నారు.
వరకట్న వేధింపులకు మహిళ బలి
కారేపల్లి: వరకట్న వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బతండా గ్రామంలో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ధర్మారంతండా గ్రామానికి చెందిన బారోతు మాలు కుమార్తె స్వాతిబాయి (22)కి, దుబ్బతండా గ్రామానికి చెందిన భూక్యా శ్రీనివాస్‌తో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కాగా భర్త శ్రీనివాస్‌కు వివాహ సమయంలో కట్నకానుకలు ఇచ్చారు. శ్రీనివాస్ మద్యానికి బానిసై తరచూ స్వాతిబాయిని అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవాడు. దీనిపై ఇరువురి తల్లిదండ్రుల సమక్షంలో గతంలో పంచాయతీలు జరిగాయి. అయినా తీరు మార్చు కోని శ్రీనివాస్ అదనపు కట్నం తీసుకురావాలని గురువారం రాత్రి గొడవ పడటంతో తీవ్ర మనస్తాపం చెందిన స్వాతి ఇంట్లోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
భర్తే హతమార్చాడు.. కుటుంబ సభ్యులు
భర్తే స్వాతిని కొట్టి చంపాడని, ఆపై ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి తండ్రి బారోతు మాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారేపల్లి ఏఎస్‌ఐ కృష్ణప్రసాద్‌రావు కేసు నమోదు చేయగా, సింగరేణి తహసీల్దార్ సీహెచ్ స్వామి పంచనామా నిర్వహించారు. ఈ కేసు విషయమై ఖమ్మం రూరల్ ఏసీపీ రామోజీ రమేష్ దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment