గంజాల్ టోల్‌గేట్ వద్ద ఢీ కొన్న బస్సు: డ్రైవర్‌ను స్ట్రెచర్‌లో తరలిస్తున్న టోల్‌ప్లాజా సిబ్బంది
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ గ్రామ సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద మంగళవారం మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదానికి ప్రధాన కారణంగా డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. టోల్‌ప్లాజా పక్కనే ఉన్న సిమెంట్ గద్దెను బలంగా ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 32మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 22మందికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నవారిని నిజామాబాద్, హైదరాబాద్‌కు తరలించారు. క్షతగాత్రుల్లో వృద్ధులు, చిన్నారులు కూడా ఉండడం కలకలం రేపింది.
సంఘటన జరిగిన వెంటనే ఎస్సై రవీందర్‌కేంద్రే తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తోటి ప్రయాణికులతో కలిసి క్షతగాత్రులకు సహాయం అందించారు. కొందరి తలలు, మరికొందరి కాళ్లు, ఇంకొందరి చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని 108లో, ప్రైవేటు వాహనాల్లో నిర్మల్, నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు వేణుగోపాల కృష్ణ, రఘునందన్ రెడ్డి, శశికాంత్, శ్రీదేవి క్షతగాత్రులకు చికిత్స అందించారు. బస్సు డ్రైవర్ మనోహర్ సింగ్ నిర్లక్ష్యంగా నడపటం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు అంటున్నారు.
ప్రాణాలు కాపాడిన స్పీడ్ బ్రేకర్లు
వేగంగా వచ్చే వాహనాలను అదుపు చేసేందుకు టోల్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లే తమ ప్రాణాలు కాపాడాయని ప్రయాణికులు చెబు తున్నారు. అప్పటికే వేగంగా వచ్చిన బస్సు స్పీ డ్ బ్రేకర్ వద్ద కంట్రోల్ అయినా.. పూర్తిగా ని యంత్రణలోకి రాకపోవడంతో అదుపుతప్పి సిమెంట్ గద్దెను ఢీకొట్టిందని చెబుతున్నారు. స్పీడ్ బ్రేకర్లు లేకుంటే మరింత వేగంతో వచ్చి ఢీ కొని ప్రాణాలు కోల్పోయేవారమని పేర్కొన్నారు.
పరిస్థితి విషమంగా ఉంది వీరే..
భైంసాకు చెందిన హమీదా బేగం ముఖం భాగంలో ఎముకలు విరిగిపోయాయి. నిర్మల్‌కు చెందిన కళ్యాణికి ముక్కుభాగంలో ఎముక విరిగింది. శంకర్ అనే వ్యక్తికి నడుం భాగంలో ఎముకలు విరిగాయి. లక్ష్మీ అనే వృద్ధురాలికి ఎడమ కాలు విరిగి తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఈ నలుగురుకి పరిస్థితి విషమంగా వుండటంతో నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి నిజామాబాద్, హైదరాబాద్‌కు రెఫర్ చేశారు.
గాయాలతో బయటపడిన వారు..
నిర్మల్‌కు చెందిన కండక్టర్ రమేష్‌గౌడ్, నిజాదవ్ వసంత, జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మౌనిక, రేఖ, నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన రమేష్, నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన అమీద, నిజామాబాద్‌కు చెందిన నరేష్, నందిపేట్‌కు చెందిన లక్ష్మీ, గుత్పాకు చెందిన సునిత, లావణ్య, ఆదిలాబాద్ జిల్లా బోథ్‌కు చెందిన శంకర్, హైదరాబాద్‌కు చెందిన నరేష్ కుమార్, నిర్మల్‌కు చెందిన ఫహిజుల్లా ఖాన్, షబాన, షేక్ ఉల్లాఖాన్, గంగయ్య, రమేష్, సునితా, సరీనా బేగం ఉన్నారు. ఇదే బస్సులో ఉన్న నలుగురు చిన్నారులు, మరో ఇద్దరు వృద్ధులు ఎలాంటి గాయాలుకాకుండా బయట పడ్డారు.
మొహర్రం పండగా పూట
ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే పండుగల్లో మొహర్రం పండగా ఒకటి. అయితే పండగను జరుపుకోవడానికి వెళ్లిన ముస్లిం వృద్ధురాలు హమీదాబేగం పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. బైంసాకు చెందిన హమీదా బేగంకు ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. కుమారుడు మహారాష్ట్రలోని నాందెడ్‌లోని అత్తగారి ఇంటివద్ద ఉంటున్నాడు. భర్త అప్సర్ గతంలోనే మరణించగా ఇంట్లో ఒక్కతే కూలీ పని చేసుకుంటూ జీవిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్మూరులో ఉండే ఆమె చిన్న కూతురు ఆసియా బేగం తన తల్లికి ఫోన్ చేసి మొహర్రం పండగకు రావాలని కోరడంతో ఆదివారం ఆర్మూర్‌కు వెళ్లి సోమవారం మొహర్రం పంగను కూతురు, అల్లుడు, మనవళ్లతో ఆనందంగా జరుపుకుంది. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆమె బంధువులు తెలిపారు. ఇదే సంఘటనలో మరో ఐదుగురు ముస్లింలు సైతం గాయపడ్డారు. పండగ పూట ప్రమాదం జరగడంతో వారి కుటుంబాల్లో విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి.
సోన్: జిల్లాలోని 44వ జాతీయ రహదారి మంగళవారం నెత్తురోడింది. నిజామాబాద్ నుంచి నిర్మల్‌కు బయలుదేరిన ఆర్టీసీ అద్దె బస్సు గంజాల్ సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద అదుపు తప్పింది. పక్కనే ఉన్న సిమెంట్ గద్దెకు ఢీకొనడంతో ప్రయాణికులు చెల్లాచెదురయ్యారు. ఒక్కసారిగా హాహాకారాలు.. ఆర్తనాదాలు మిన్నంటాయి. మొత్తం 32 మంది ప్రయాణికుల్లో 24 మందికి తీవ్ర గాయాలవగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment