కట్టేసి..దోచుకెళ్లారు | Thieves Attacked | Sakshi
Sakshi News home page

కట్టేసి..దోచుకెళ్లారు

Published Fri, Aug 24 2018 2:25 PM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

Thieves Attacked  - Sakshi

దొంగతనం జరిగిన ఇల్లు ఇదే.. 

నిర్మల్‌అర్బన్‌ : నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని కమలానగర్‌ కాలనీలో దొంగల ముఠా బుధవారం రాత్రి కలకలం సృష్టించింది. రెడ్డి ఫంక్షన్‌ హాల్‌ సమీపంలోని చిట్టచివరన ఉన్న ఇంట్లో అర్ధరాత్రి దొంగలు చొరబడి ఇంట్లోని వారిని కత్తులతో బెదిరించి, చీరలతో కట్టేసి దొంగతనానికి పాల్పడ్డారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దొంగతనం నిర్మల్‌ జిల్లా కేంద్ర ప్రజలను భయాందోళనకు గురిచేసింది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

పట్టణంలోని కమలానగర్‌కాలనీలోని రెడ్డి ఫంక్షన్‌హాల్‌ సమీపంలో పొద్దుటూరి ప్రసాద్‌రెడ్డి, పద్మ దంపతులు కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. ప్రసాద్‌రెడ్డి నిర్మల్‌లోని ఏఎన్‌రెడ్డి కాలనీ సమీపంలో మిల్క్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి తలుపులను బండరాళ్లు, ఇనుప రాళ్లతో బాదారు. తలుపు చప్పుల్లతో ఇంటి ముందు గదిలో నిద్రిస్తున్న ప్రసాద్‌రెడ్డి అత్త భయంతో అరిచింది.

లోపలి గదిలో ఉన్న ప్రసాద్‌రెడ్డి, అతని భార్య పద్మ  ముందు గదిలోకి వచ్చారు. అప్పటికే ఇంటి తలుపులు బలవంతంగా తెరిచిన నలుగురు దొంగలు లోపలికి ప్రవేశించారు. వారి గొంతుపై కత్తిపెట్టి బెదిరించారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు లాక్కున్నారు. ముగ్గురితోపాటు ఇద్దరు పిల్లల కాళ్లు, చేతులను వెనక్కి మలిచి చీరలతో కట్టేశారు. డబ్బులు, బంగారు ఎక్కడ దాచారో చెప్పాలంటూ బెదిరించారు. చెప్పకపోతే చంపేస్తామన్నారు.

బెడ్‌రూంలోని బీరువా తాళాలు పగులగొట్టారు. అందులోని, బెడ్‌కింద ఉన్న రూ.20 వేలు, సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి దోచుకెళ్లారు. సుమారు రెండున్నర గంటలపాటు వారిని భయభ్రాంతులకు గురి చేసి పప్పు, బియ్యం డబ్బాలు, బ్యాగులను చిందరవందరగా పడేసి అందులో దాచుకున్న డబ్బులను సైతం చోరీ చేశారు. వారి వద్ద ఉన్న 3 సెల్‌ఫోన్లు తీసుకెళ్లారు.

గొళ్లెం పెట్టి ఉడాయింపు..

ఈ ఇంటి చుట్టు ఇళ్లు లేకపోవడంతో దొంగలు తమ పనిని సులభంగా కానిచ్చేశారు. ఇంట్లోకి చొరబడి నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించిన దొంగలు తమ పనిపూర్తయిన తర్వాత ఇంటి బయట తలుపులకు గొళ్లెం వేసి అక్కడి నుంచి పారిపోయారు. ఎవరైనా అరిస్తే చంపేస్తామని బెదిరించడంతో బాధితులు బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ఎలాగోలా చేతులకు కట్టిన తాళ్లను తొలగించుకుని, చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం అందించారు.

దొంగతనం జరిగిన విషయం తెలియడంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. అలాగే క్లూస్‌ టీం సభ్యులు బీరువా, ఇతర సామగ్రిపై వేలిముద్రలను, ఇతర ఆధారాలను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement