ఓదెలుతో గట్టయ్య (ఫైల్)
జైపూర్(చెన్నూర్): తాను నమ్ముకున్న నాయకుడికి ఎమ్మెల్యే టికెట్ రాలేదని మనస్తాపం చెందిన రేగుంట గట్టయ్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడి తన కుటుంబానికి తీరనిశోకాన్ని మిగిల్చాడు. ఈ నెల 12న ఇందారంలో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ ప్రచార ర్యాలీ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గట్టయ్య(35) 80శాతం కాలిన గాయాలతో హైదరాబాద్ మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటలకు మృతి చెందాడు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ ఇటీవల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత సిటింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు స్థానంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను టీఆర్‌ఎస్ చెన్నూర్ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు.
ఓదెలుకు టికెట్ ఇవ్వకపోవడంతో ముందు నుంచి టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన రేగుంట గట్టయ్య మనస్తాపం చెందాడు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా, కేసీఆర్ సేవా దళం జిల్లా ఉపాధ్యక్షులుగా, ఇందారం 13వ వార్డు సభ్యులుగా ఉన్న గట్టయ్య ఓదెలు, ఆయన కుటుంబానికి దగ్గరయ్యారు. గట్టయ్య అనారోగ్యపరిస్థితుల్లో ఓదెలు ఆయనను ఆదుకోవడం అన్నివిధాలుగా సహకరించడంతో అభిమానం మరింత పెరిగింది. మరో సారి ఓదెలుకు టికెట్ వచ్చి మళ్లీ ఆయన గెలిస్తే తనకు కూడా ప్రాధాన్యతపెరుగుతుందని భావించిన గట్టయ్య టికెట్ రాకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
ఈ క్రమంలో చెన్నూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎంపీ బాల్క సుమన్ 12న(బుధవారం) తొలిసారి నియోజకవర్గానికి రావడం ఇందారం వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అక్కడే ఉన్న గట్టయ్య తన నిరసనను వ్యక్తం చేయడానికి ప్రచార ర్యాలీ ప్రారంభించే ముందు ఎంపీ సుమన్ రాజీవ్ రహదారి పక్కన డీఎంఎఫ్‌టీ నిధులతో నూతనంగా నిర్మించనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తుండగా జై..కేసీఆర్..జై ఓదెలు అంటూ గట్టయ్య తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ సీసాను ఒంటిపై పోసుకోగా దాన్నిఅడ్డుకునే ప్రయత్నంలో అక్కడే ఎంపీకి స్వాగతం పలకడానికి మంగళహారతులతో వచ్చిన మహిళలపై పెట్రోల్ పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఇందారం, రామారావుపేట, టేకుమట్ల, భీమారం గ్రామాలకు చెందిన 12మంది ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులతోపాటు 3 రిపోటర్లకు గాయాలయ్యాయి. ముందు గట్టయ్య తనపై పెట్రోల్ పోసుకోవడంతో ఆయన 80శాతం కాలిపోయాడు. హుటాహుటిన మంచిర్యాలకు తరలించి అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు, అనంతరం హైదరాబాద్ మలక్‌పేట్ యశోద ఆస్పత్రి తరలించి వైద్యం అందించారు. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన గట్టయ్య మంగళవారం మృతి చెందాడు.
ఇందారంలో విషాదం..
అందరితో కలివిడిగా ఉండే గట్టయ్య మృతి చెందడంతో ఇందారంలో విషాదం నెలకొంది. గట్టయ్య మరణ వార్త తెలిసి ఇందారం వాసులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. గట్టయ్య మృతితో ఆయన కుటుంబ రోడ్డున పడింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరులా రోధించారు. గట్టయ్యకు భార్య విజయ, కుమార్తె సాయినివేదిత(5), కుమారుడు సాయి విజ్ఞేశ్(3) ఉన్నారు. బుధవారం ఇందారంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సమాజ సేవలో గట్టయ్య..
ఇందారం గ్రామానికి చెందిన గట్టయ్య తన నాన్నమ్మ బుచ్చమ్మ దగ్గర పెరిగిన గట్టయ్య ఆమె మృతితో 2010లో గ్రాండ్ మా యూత్ స్థాపించారు. గ్రాండ్ మా యూత్ ద్వారా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రక్తదాన శిబిరాలు, దాతల సహకారంతో ఉచిత వైద్యశిబిరాల ఏర్పాటు, నిరుపేద విద్యార్థులకు విద్యాసామగ్రి తదితర సేవకార్యక్రమాలు చేపట్టి జిల్లా స్థాయిలో గుర్తింపు పొంది పలుమార్లు అవార్డులు సైతం అందుకున్నారు. ఇందారం ఓపెన్‌కాస్టుకు వ్యతిరేకంగా గట్టయ్య ఉద్యమించారు. జేఏసీ నేతృత్వంలో తలపెట్టిన ఓపెన్‌కాస్టు వ్యతిరేక పోరాటాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.
గట్టయ్య మృతి బాధాకరం : ఓదెలు
మంచి మనస్సున గట్టయ్య మృతి చెందడం చాలా బాధకరమని చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. గట్టయ్య కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటానని ఆయన కుమార్తె సాయినివేదిత, కుమారుడు సాయివిజ్ఞేశ్‌పై రూ.5 లక్షల చొప్పున ఇద్దరిపై రూ.10లక్షలు బ్యాంకులో ఫిక్స్‌డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. అంత్యక్రియల ఖర్చు మొత్తం బరించుకుంటామని కుటుం బానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment