ప్రాణంమీదికి తెచ్చిన అభిమానం | Odelus Follower Gattaiah Suicide Attempt In Adilabad | Sakshi
Sakshi News home page

ప్రాణంమీదికి తెచ్చిన అభిమానం

Published Sat, Sep 15 2018 1:02 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Odelus Follower Gattaiah Suicide Attempt In Adilabad - Sakshi

యశోద ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శిస్తున్న , ఇందారంలో పెట్రోల్‌మంటలో గట్టయ్య(ఫైల్‌)

జైపూర్‌(చెన్నూర్‌): చెన్నూర్‌ తాజా మాజీ ఎమ్మె ల్యే నల్లాల ఓదెలుపై ఉన్న అభిమానం ఓ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చింది. ఇందారంలో ఈ నెల 12న చోటు చేసుకున్న  ఈ ఘటన ఇటు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు..అటు ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అనాలోచిత నిర్ణయం, ఆవేశంతో ఇందారం గ్రామానికి చెందిన తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు రేగుంట గట్టయ్య ఓదెలుపై ఉన్న అభిమానంతో టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎమ్మెల్యే టికెటు ఇవ్వకపోవడంతో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.

గట్టయ్య వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ సీసానుంచి అక్కడే మంగళహారతులు పట్టుకున్న మహిళలపై పడడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరి నేతల మధ్య రగిలిన చిచ్చు ప్రజల ప్రాణాలమీదకు తెచ్చింది. ఒక్కసారిగా పెట్రోల్‌ మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న వందలాది మంది ప్రజలు, నాయకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. తోపులాటలో మహిళలు, వృద్ధులు కిందపడడంతో స్వల్పగాయాలయ్యాయి.

యశోద ఆస్పత్రిలో చికిత్స 
ఇందారం ఘటనలో గాయపడ్డ ఎంపీటీసీలు సుంకరి విమల, ముదాం రాజేశ్వరి, పీఏ సీఎస్‌ డైరెక్టర్‌ జక్కుల గంగామణి, తాజా మాజీ సర్పంచ్‌ జక్కుల వెంకటేశ్, పెద్దపల్లి నిఖిత, నాయకులు సుంకరి శ్రీనివాస్, భాస్కర్ల శ్రీకాంత్, తొగరి శ్రీనివాస్, ఎండీ.జైనోద్దీన్, చుంచు రాజ య్య, నమస్తే తెలంగాణ జిల్లా ఫొటోగ్రాఫర్‌ శ్రీను, టీవీ–9 జిల్లా కెమెరామెన్‌ మహేందర్, వెలుగు జిల్లా ఫొటోగ్రాఫర్‌ అనీశ్‌బాబు  సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు చేకూర్తి సత్యనారాణరెడ్డికి జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స  అందిస్తున్నారు. ఎండీ.జైనోద్దీన్, చేకూర్తి సత్యనారాణరెడ్డి, ముదాం రాజేశ్వరి, సుంకరి విమల, జక్కుల గంగామాణి, పెద్దపల్లి నిఖితలు 30శాతంపైగా గాయపడగా మిగిలినవారు తక్కువగా గాయపడ్డారు. స్వల్పంగా గాయపడ్డ భాస్కర్ల శ్రీకాంత్‌ డిచార్జి అయ్యారు. కాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గట్టయ్యకు మలక్‌పేట్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గట్టయ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు.  కాగా రెండ్రోజుల్లో చెన్నూర్‌ రాజకీయం మారిపోయింది. ఎంపీ సుమన్, తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు వర్గం ఒక్కటయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement