నిజామాబాద్ సిటీ/నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా చింతగూడకు చెందిన దాసరి హర్ష (24) తాను ఉంటున్న హాస్టల్ గదిలోనే శనివారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.
ప్రస్తుతం ఫైనల్ పరీక్షలు జరుగుతుండగా, శుక్రవారం పరీక్ష రాసిన అనంతరం హర్ష నడుంనొప్పిగా ఉందని స్నేహితులతో చెప్పి ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయించుకున్నాడు. రాత్రి భోజనం తర్వాత 10 గంటలకు తన గదికి వెళ్తూ.. తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేపాలని స్నేహితుడు తరుణ్‌కు చెప్పాడు. తరుణ్ ఆ సమయానికి వచ్చి హర్ష గది తలుపు తట్టగా స్పందనలేదు. మళ్లీ ఉదయం 7 గంటలకు వచ్చి పిలిచినా హర్ష స్పందించకపోవటంతో తరుణ్ తోటి విద్యార్థులకు విషయాన్ని తెలిపాడు.
మెస్ ఇన్‌చార్జులు వచ్చి హర్షను పిలవగా స్పందించకపోవటంతో తలుపును బలవంతంగా తెరిచారు. హర్ష ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించటంతో అంతా షాక్‌కు గురయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర వన్‌టౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు హర్ష తల్లి రాధకు విషయం తెలిపి, మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
తెలియని కారణాలు.. అనుమానాలు
దాసరి శ్రీనివాస్, రాధ దంపతులకు హర్ష, ధనుష్ ఇద్దరు కుమారులు. పెద్దవాడైన హర్ష ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి శ్రీనివాస్ పన్నెండేళ్లుగా మలేసియాలో ఉంటున్నారు. తల్లి ఇంటివద్ద ఉంటున్నారు. హాస్టల్‌లో ఎలాంటి ఇబ్బందుల్లేవని, హర్ష చదువులో చురుగ్గా ఉండేవాడని స్నేహితులు చెబుతున్నారు. తోటి విద్యార్థులతో కలసిమెలసి ఉండే హర్ష ఆత్మహత్యకు పాల్పడటం అనుమానాలను రేకెత్తిస్తోందని అంటున్నారు.
హర్షకు ఎలాంటి దురలవాట్లు లేవని కుటుంబసభ్యులు చెప్పారు. ప్రేమ వ్యవహారాలు కారణమా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఘటనపై విచారణ జరిపించాలంటూ ఎన్‌ఎస్‌యూఐ, ఏఐఎస్‌ఎఫ్ తదితర సంఘాల విద్యార్థులు హాస్టల్ ఎదుట బైఠాయించారు. పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు.
మమ్మీ నేను డాక్టరవుతున్నా..
‘మమ్మీ నేను డాక్టర్‌ను అవుతున్నా.. నీకు ఇల్లు కట్టిస్తా.. కారు కొనిస్తా’ అంటూ తన కుమారుడు మూడ్రోజుల క్రితమే ఫోన్లో సంబరంగా చెప్పాడని తీరా శవమై కనిపిస్తాడని అనుకోలేదంటూ హర్ష తల్లి దాసరి రాధ విలపించిన తీరు కలచివేసింది. సంవత్సరం నుంచి హర్షకు నడుం నొప్పి ఉందని, బుధవారం ఫోన్‌చేసి నొప్పి బాగా ఉందని ఏడ్వటంతో ఇంటికి రమ్మని చెప్పానన్నారు.
కాని పరీక్షలు ఉన్నాయని, ఇప్పుడే ఇంటికి రాలేనని అన్నాడని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యాక హర్షను హైదరాబాద్‌కు తీసుకెళ్లి చూపిద్దామనుకున్నామని, ఇంతలోనే అఘాయిత్యానికి పాల్పడతాడనుకోలేదన్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లి, బంధువులు గుండేలవిసేలా రోదించారు. నడుం నొప్పి మినహా మరే సమస్యలు లేవని, తన కొడుకు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడంటూ తల్లి రాధ కళాశాల అధికారులను, తోటి విద్యార్థులను ప్రశ్నిస్తూ విలపించడం కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment