పట్టుపడ్డ నకిలీ మవోయిస్టులు
కాగజ్‌నగర్ (ఆదిలాబాద్): కాగజ్‌నగర్ పట్టణంలో వ్యాపారులు, వివిధ సంస్థల వద్ద బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నకిలీ మావోయిస్టులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. కుమురంభీం జిల్లా వాంకిడి మండలం కిర్డీ గ్రామానికి చెందిన తిరుపతి, సూర్యపేట జిల్లా గుంజలూరు గ్రామానికి చెందిన సైదయ్య సీపీఐ (ఎంఎల్) రెడ్‌స్టార్ పేరుతో పెట్రోల్‌పంపులు, జిన్నింగ్ మిల్లులు, విద్యాసంస్థలు, ఇతర వ్యాపారుల వద్ద చందాలు వసూలు చేస్తున్నారని, కార్మిక సంఘాన్ని స్థాపిస్తామని చెబుతూ వేల రూపాయల్లో డబ్బులు వసూలు చేస్తుండడంతో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
గత 6 నెలల క్రితం ఇదే తరహాలో వసూళ్లకు పాల్పడ్డారని అప్పటి నుంచి ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పట్టణ సీఐ వెంకటేశ్వర్, క్యాట్ టీం సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి పట్టున్నారని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుస్తామని స్పష్టం చేశారు.
అసభ్యకరంగా పోస్టు చేసిన ఇద్దరిపై కేసు
ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు చేసి కించపరిచినందుకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఒకసారి చేసిన తప్పు మరోసారి చేయడంతో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశామన్నారు. సంబంధిత గ్రూపుల అడ్మిన్‌లు జాగ్రత్తగా ఉండాలన్నారు. అలా కాకుండా అసభ్య పదజాలంతో కూడిన పోస్టులు, బరిలో ఉన్న అభ్యర్థులపై కామెంట్ చేయడం సరికాదన్నారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment