Fake Maoists arrested
-
వీరన్న దళం పేరుతో నకిలీ మావోయిస్టు ముఠా
సత్తుపల్లి: ఎయిర్ గన్, లైటర్ పిస్టల్ చూపించి మావోయిస్టు వీరన్న దళం అంటూ సింగరేణిలో కాంట్రాక్ట్ సంస్థ మహాలక్ష్మి క్యాంప్ మేనేజర్‌ను బెదిరించిన నకిలీ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం సత్తుపల్లి సీఐ ఎ.రమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సింగరేణి ఐఎన్టీయూసీ నాయకురాలుగా చెప్పుకుంటున్న తాటిపాముల విజయలక్ష్మి, మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండకు చెందిన తన కారు డ్రైవర్ మనోజ్‌కుమార్, అతని బావమరిది హరీష్, మరో వ్యక్తితో కలిసి వీరన్నదళం అంటూ సింగరేణి మహాలక్ష్మి క్యాంప్ మేనేజర్ జితేంద్రకు పలుమార్లు ఫోన్ చేశారు. ‘మీ క్యాంప్‌లు రామగుండంతో సహా అన్ని తెలుసు.. మాకు చందా ఇవ్వకపోతే క్యాంప్‌లను పేల్చివేస్తాం’అని బెదిరించారు. ఈ నెల 5న ఇద్దరు వ్యక్తులు కారులో సత్తుపల్లి వచ్చి, మహాలక్ష్మి క్యాంప్‌కు వెళ్లి మేనేజర్ జితేంద్రను కలిసి వీరన్నదళం అంటూ పరిచయం చేసుకుని రూ.50లక్షలు డిమాండ్ చేశారు. కొంత సమయం కావాలని, యజమాని దృష్టికి తీసుకెళ్తానని చెప్పటంతో కొద్దిసేపు వాగ్వాదం చేసి బెదిరించి వెళ్లిపోయారు. అదేరోజు రాత్రి 11, 12 గంటల సమయంలో తుపాకులను చూపించి బెదిరించి డబ్బులు ఇప్పుడే ఇవ్వాలని ఒత్తిడి చేసి రూ.5 లక్షలు తీసుకెళ్లారు. విషయం పోలీసుల దృష్టికెళ్లడంతో వాళ్ల కదలికలు, ఫోన్ కాల్స్‌పై నిఘా పెట్టారు. మళ్లీ ఈ నెల 18న వచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తుండటంతో కల్లూరు ఏసీపీ ఎన్.వెంకటేష్ ఆధ్వర్యంలో ఖమ్మం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు, సీఐ వెంకటస్వామి, ఎస్సై రఘులు వలపన్ని పట్టుకున్నారు. ప్రధాన నిందితురాలు తాటిపాముల విజయలక్ష్మిని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, సెల్ఫోన్లు, ఒక ఎయిర్ గన్, ఒక లైటర్ పిస్టల్, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మనోజ్‌కుమార్, హరీష్‌లను శనివారం రాత్రి కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. విజయలక్ష్మిని ఆదివారం రిమాండ్‌కు పంపుతున్నట్లు, మరో వ్యక్తి పరారీలో ఉన్నారని సీఐ రమాకాంత్, ఎస్ఐ నరేష్ తెలిపారు. నకిలీ ముఠాకు సూత్రదారిగా తాటిపాముల విజయలక్ష్మి వ్యవహరించిందని, ఈజీమని కోసమే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఇంకా ఎంతమందికి ఈ ముఠాతో సంబంధాలు ఉన్నాయనే విషయమై విచారణ నిర్వహిస్తున్నామన్నారు. -
నకిలీల ఆటకట్టు..
సాలూరు: పట్టణ పరిసర ప్రాంతాల్లో నకిలీ మావోయిస్టులు, నకిలీ పోలీసులు హల్చల్ చేస్తున్నారు. వర్తకులను లక్ష్యంగా చేసుకుని వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులమని, మావోయిస్టులమని బెదిరించి వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా వేల నుంచి లక్షల రుపాయల వరకు ఈ డిమాండ్లు ఉంటున్నాయి. దీంతో ఈ నకిలీలలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. చాకచక్యంగా దర్యాప్తు నిర్వహిస్తూ నకిలీలను పట్టుకుంటున్నారు. కొద్ది రోజుల కిందటే నకిలీ పోలీసులను పట్టుకున్న విషయం మరువకముందే తాజాగా పాచిపెంట మండలంలో నకిలీ మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. జరిగిన సంఘటనలు.. ►ఈ ఏడాది జూన్ 11న పాచిపెంట మండలం పారమ్మకొండ వద్ద మక్కువ మండలంనకు చెందిన నలుగురు నకిలీ మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. ►ముగ్గురు నకిలీ పోలీసులు సాలూరు మండలంనకు చెందిన ఓ వర్తకుడి నుంచి 27 వేల రుపాయల నగదు కాజేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురులో ఇద్దరు నకిలీ పోలీసులను పట్టుకుని ఈ నెల 12న వారిని బొబ్బిలి కోర్టులో ప్రవేశపెట్టగా 26వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ►పాచిపెంట మండలంలో ముగ్గురు నకిలీ మావోయిస్టులను తాజాగా పాచిపెంట పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక దృష్టి సారించాం.. నకిలీ పోలీసులు, నకిలీ మావోయిస్టుల హల్చల్ చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. దీంతో అటువంటి నకిలీలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇటీవల సాలూరు పట్టణంలో నకిలీ పోలీసులను పట్టుకోగా... తాజాగా పాచిపెంట మండలంలో నకిలీ మావోయిస్టులను పట్టుకున్నాం. అసాంఘిక కార్యక్రమాలకు ఎవ్వరు పాల్పడినా చర్యలు తప్పవు. – సింహాద్రినాయుడు, సీఐ, సాలూరు -
నకిలీ మావోయిస్టుల ముఠా అరెస్ట్
సాక్షి, వరంగల్ : మావోయిస్టుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు నకిలీ నక్సలైట్ ముఠాను అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. సోమవారం సాయంత్రం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు.నిందితులు మహబుబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రానికి చెందిన పూసల శ్రీమన్నారాయణ, వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం, కామారెడ్డిపల్లికి చెందిన పోతరాజు అశోక్, తొర్రూరుకు చెందిన నర్మెట్ట నాగరాజు, జనగామ జిల్లా కొడకండ్ల మండలం చెరువు ముందు గ్రామానికి చెందిన ధరావత్ శ్రీనివాస్‌లు నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బులు సంపాధించడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు పూసల శ్రీమన్నారాయణ ఎమ్మెస్సీ వరకు చదువుకుని 2004–2009 వరకు తొర్రూరు, రాయపర్తి ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో లెక్చరర్‌గా పనిచేశాడు. మరింత సంపాదన కోసం ఎడ్యూకేషన్ కన్సల్టెన్సీ నిర్వహించినట్లు తెలిపారు. కన్సల్టెన్సీలో నష్టాలు రావడంతో సులువుగా డబ్బులు సంపాధించాలనే ఆలోచనతో మావోయిస్టు నకిలీ పేరుతో ప్రణాళికలు రూపొందించుకున్నారు. మిగితా ముగ్గురు నిందితులు స్నేహితులు కావడంతో కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టు నాయకులు దామోదర్, భాస్కర్ల పేర్లతో ఫోన్లలో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూళ్లు చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. బెదిరింపులకు పాల్పడి.. పోలీసు కమిషనరేట్ పరిధిలో హంటర్‌రోడ్డు చిట్‌ఫండ్ వ్యాపారి నుంచి రూ. లక్ష, తొర్రూరు ప్రాంతానికి చెందిన రియల్టర్ నుంచి రూ.50వేలు, జనగామ జిల్లా కేంద్రం కిరాణ వ్యాపారి నుంచి రూ.10వేలు, çసూర్యపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన రియల్ వ్యాపారి నుంచి రూ.30 వేలు, వసూల్ చేయడంతో పాటు మరో ఇద్దరు వ్యాపారులను బెదిరించినట్లు తెలిపారు. దీంతో నిందితులపై హసన్‌పర్తి, పరకాల, హన్మకొండ, కేయూసీ, జనగామ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులు మరికొంత మందిని బెదిరించేందుకు కేయూసీ అతిథి గృహం వద్ద సమావేశం అయినట్లు ఏసీపీ చక్రవర్తికి సమాచారం వచ్చింది. టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ దేవేందర్‌రెడ్డి, కేయూసీ ఇన్స్పెక్టర్ డేవిడ్‌రాజ్, నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఆయన తెలిపారు. బొమ్మ తుపాకీ స్వాధీనం నిందితుల నుంచి రూ.1.65 లక్షల నగదుతో పాటు, 16 సెల్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, కత్తి పెన్నును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ రవీందర్ తెలిపారు. నిందితులను సకాలంలో గుర్తించడంలో ప్రతిభ కనపరిచిన అధికారులను సీపీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ నాగరాజు, ఏసీపీ చక్రవర్తి, ఇన్స్పెక్టర్లు దేవేందర్‌రెడ్డి, డేవిడ్‌రాజ్, టాస్క్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుళ్లు శ్యాంసుందర్, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీను, అలీ, రాజులు పాల్గొన్నారు. -
నకిలీ మావోయిస్టుల అరెస్ట్
కాగజ్‌నగర్ (ఆదిలాబాద్): కాగజ్‌నగర్ పట్టణంలో వ్యాపారులు, వివిధ సంస్థల వద్ద బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నకిలీ మావోయిస్టులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. కుమురంభీం జిల్లా వాంకిడి మండలం కిర్డీ గ్రామానికి చెందిన తిరుపతి, సూర్యపేట జిల్లా గుంజలూరు గ్రామానికి చెందిన సైదయ్య సీపీఐ (ఎంఎల్) రెడ్‌స్టార్ పేరుతో పెట్రోల్‌పంపులు, జిన్నింగ్ మిల్లులు, విద్యాసంస్థలు, ఇతర వ్యాపారుల వద్ద చందాలు వసూలు చేస్తున్నారని, కార్మిక సంఘాన్ని స్థాపిస్తామని చెబుతూ వేల రూపాయల్లో డబ్బులు వసూలు చేస్తుండడంతో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గత 6 నెలల క్రితం ఇదే తరహాలో వసూళ్లకు పాల్పడ్డారని అప్పటి నుంచి ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పట్టణ సీఐ వెంకటేశ్వర్, క్యాట్ టీం సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి పట్టున్నారని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుస్తామని స్పష్టం చేశారు. అసభ్యకరంగా పోస్టు చేసిన ఇద్దరిపై కేసు ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు చేసి కించపరిచినందుకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఒకసారి చేసిన తప్పు మరోసారి చేయడంతో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశామన్నారు. సంబంధిత గ్రూపుల అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. అలా కాకుండా అసభ్య పదజాలంతో కూడిన పోస్టులు, బరిలో ఉన్న అభ్యర్థులపై కామెంట్ చేయడం సరికాదన్నారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. -
నకిలీ మావోయిస్టుల అరెస్ట్
సూర్యాపేట: ప్రజాప్రతినిధికి ఫోన్ చేసి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఇద్దరు నకిలీ మావోయిస్టులను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎంఏ రషీద్ నిందితుల వివరాలు వెల్లడించారు. గరిడేపల్లి మండలం పొనుగోడుకు చెందిన మునగలేటి లక్ష్మన్, రాంవెంకట్‌లు గత మే 4వ తేదీన పేట ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్‌కు ఫోన్ చేశారు. తాము మావోయిస్టు పార్టీకి చెందన వారమని, పార్టీ ఫండ్‌గా రూ. 4 లక్షలే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీన మధ్యాహ్న సమయంలో అంజనాపురి కాలనీలోని వాయుపుత్ర డిగ్రీ కళాశాలవద్దకు వచ్చామని డబ్బులు తీసుకురావాలని.. ఎంపీపీకి నిందితులు ఫోన్ చేశారు. ఎంపీపీ రూ.10 వేలు తీసుకుని వారు చెప్పిన ప్రదేశానికి వెళ్తూ పోలీసులకు సమాచరం ఇచ్చారు. నిందితులకు డబ్బులు ఇస్తుండగా పోలీసులు వెంటనే చుట్టుముట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు.అదే విధంగా వారి వద్ద నుంచి డమ్మి పిస్టల్, కేజీ గంజాయి, కత్తి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో మునగలేటి లక్ష్మణ్ అతడి స్నేహితుడు మధుతో కలిసి నేరేడుచర్లకు చెందిన రియల్ వ్యాపారి శ్రీధర్‌ను బెదిరించిన ఘటనలో గరిడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సమావేశంలో సీఐ మొగలయ్య, క్రైం ఎస్ఐ జబ్బార్, ఎస్ఐ శ్రీనివాస్, ఐడీ పార్టీ సిబ్బంది గొర్ల కృష్ణ, గోదేషి కరుణాకర్, కరణం అరవింద్, సంగి నరేందర్, దైద రాజులు పాల్గొన్నారు.