నకిలీ మావోయిస్టుల ముఠా అరెస్ట్‌ | Fake Maoists Arrested In Warangal | Sakshi
Sakshi News home page

నకిలీ మావోయిస్టుల ముఠా అరెస్ట్‌

Published Tue, Jul 30 2019 9:48 AM | Last Updated on Tue, Jul 30 2019 9:48 AM

Fake Maoists Arrested In Warangal - Sakshi

వివరాలు వెల్లడిస్తూ, బొమ్మ తుపాకీని చూపెడుతున్న సీపీ

సాక్షి, వరంగల్‌ : మావోయిస్టుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు నకిలీ నక్సలైట్‌ ముఠాను అరెస్టు చేసినట్లు వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం కమిషనరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు.నిందితులు మహబుబాబాద్‌ జిల్లా తొర్రూరు మండల కేంద్రానికి చెందిన పూసల శ్రీమన్నారాయణ, వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మండలం, కామారెడ్డిపల్లికి చెందిన పోతరాజు అశోక్, తొర్రూరుకు చెందిన నర్మెట్ట నాగరాజు, జనగామ జిల్లా కొడకండ్ల మండలం చెరువు ముందు గ్రామానికి చెందిన ధరావత్‌ శ్రీనివాస్‌లు నలుగురు ముఠాగా ఏర్పడ్డారు.

సులువుగా డబ్బులు సంపాధించడానికి  ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు పూసల శ్రీమన్నారాయణ ఎమ్మెస్సీ వరకు చదువుకుని 2004–2009 వరకు తొర్రూరు, రాయపర్తి ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో లెక్చరర్‌గా పనిచేశాడు. మరింత సంపాదన కోసం ఎడ్యూకేషన్‌ కన్సల్టెన్సీ నిర్వహించినట్లు తెలిపారు.

కన్సల్టెన్సీలో నష్టాలు రావడంతో సులువుగా డబ్బులు సంపాధించాలనే ఆలోచనతో మావోయిస్టు నకిలీ పేరుతో ప్రణాళికలు రూపొందించుకున్నారు. మిగితా ముగ్గురు నిందితులు స్నేహితులు కావడంతో కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టు నాయకులు దామోదర్, భాస్కర్ల పేర్లతో ఫోన్లలో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూళ్లు చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

బెదిరింపులకు పాల్పడి..
పోలీసు కమిషనరేట్‌ పరిధిలో హంటర్‌రోడ్డు చిట్‌ఫండ్‌ వ్యాపారి నుంచి రూ. లక్ష, తొర్రూరు ప్రాంతానికి చెందిన రియల్టర్‌ నుంచి రూ.50వేలు, జనగామ జిల్లా కేంద్రం కిరాణ వ్యాపారి నుంచి రూ.10వేలు, çసూర్యపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన రియల్‌ వ్యాపారి నుంచి రూ.30 వేలు,  వసూల్‌ చేయడంతో పాటు మరో ఇద్దరు వ్యాపారులను బెదిరించినట్లు తెలిపారు.

దీంతో నిందితులపై హసన్‌పర్తి, పరకాల, హన్మకొండ, కేయూసీ, జనగామ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులు మరికొంత మందిని బెదిరించేందుకు కేయూసీ అతిథి గృహం వద్ద సమావేశం అయినట్లు ఏసీపీ చక్రవర్తికి సమాచారం వచ్చింది.  టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, కేయూసీ ఇన్‌స్పెక్టర్‌ డేవిడ్‌రాజ్, నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఆయన తెలిపారు. 

బొమ్మ తుపాకీ స్వాధీనం
నిందితుల నుంచి రూ.1.65 లక్షల నగదుతో పాటు, 16 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, కత్తి పెన్నును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ రవీందర్‌ తెలిపారు. నిందితులను సకాలంలో గుర్తించడంలో ప్రతిభ కనపరిచిన అధికారులను సీపీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో ఈస్ట్‌ జోన్‌ డీసీపీ నాగరాజు, ఏసీపీ చక్రవర్తి, ఇన్‌స్పెక్టర్లు దేవేందర్‌రెడ్డి, డేవిడ్‌రాజ్, టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు శ్యాంసుందర్, శ్రీకాంత్‌రెడ్డి,  శ్రీను, అలీ, రాజులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement