
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బోథ్: గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కార్మికుల శవపేటికల్ని స్వగ్రామానికి రవాణా చేయడానికి అంబులెన్స్ సంస్థలు అందిన కాడికి బాధితుల నుంచి దోచుకుంటున్నాయి. గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలు, ప్రమాదాలలో చనిపోయిన వలస కార్మికుల శవాలు స్వగ్రామానికి రావడానికి నెలల తరబడి వేచి చూస్తున్న కుటుంబాల బలహీనతలు ఆసరా చేసుకొని అంబులెన్స్‌ల నిర్వాహకులు అందిన కాడికి దండుకుంటూ డబ్బుల దందా కొనసాగిస్తున్నారు. అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామానికి చెందిన హరీష్ అనే బాధిత కుటుంబ సభ్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన జలెందర్(38) ఉపాధి కోసం మూడు సంవత్సరాల క్రితం బహ్రెయిన్‌కు వెళ్లాడు. ఈ నెల 1వ తేదీన ప్రమాదవశాత్తు బాత్‌రూంలో కాలుజారి పడడంతో తలకు బలమైన గాయాలు అయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
అక్కడి కంపెనీ వారు ఈ నెల 3వ తేదీన జలెందర్ శవపేటికను హైదరాబాద్‌కు పంపారు. ఆధికారులు మృతుని అన్న కుమారుడు హరీష్‌కుమార్‌కు శవపేటికను అప్పగించి, ఉచిత అంబులెన్స్‌లో సాగనంపారు. హైదరాబాద్ నుంచి శవపేటికతో వెళ్లిన అంబులెన్స్‌లో నుంచి శవాన్ని గ్రామాస్థులు దించుకున్నారు. ప్రభుత్వానికి కిరాయికి సరఫరా చేసే శ్రీసాయి అంబులెన్స్ సర్వీసెస్ డ్రైవర్ జలెందర్ బంధువుల నుంచి బలవంతంగా రూ. 1500 వసూలు చేశాడు. మరుసటి రోజు విషయం తెలుసుకున్న హరీష్ కేసీఆర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అంబులెన్స్ సర్వీసు సంస్థ ప్రతినిధి గూగుల్ పేలో డబ్బు వాపస్ ఇచ్చినట్లు హరీష్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment