
జ్యోతి మృతదేహం
నార్నూర్(ఆసిఫాబాద్): ఉన్నత చదువులు చదివింది. ఉద్యోగం కోసం అనేకసార్లు పోటీ పరీక్షలు రాసింది. అయినా జాబ్ రాలేదు. బతుకుదెరువు కోసం భర్తతో కలిసి ఖరీఫ్‌లో పత్తి సాగు చేస్తే ఆ పంట అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఉపాధి లేక జీవితంపై విరక్తి చెందిన రాథోడ్ జ్యోతి (30) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం మండలంలోని భీంపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...జాదవ్ కమలాబాయి, జాను దంపతుల కూతురు జ్యోతికి అదే గ్రామానికి చెందిన రాథోడ్ బాగుబాయి–శేషరావుల కూమారుడు రాథోడ్ రాజేశ్‌తో గత పదేళ్ల క్రితం వివాహమైంది.
ఆమె ఎంఏ, బీఈడీ పూర్తి చేసింది. గత నాలుగేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఐటీడీఏ ద్వారా భర్తీ చేస్తున్న సీఆర్‌టీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకుంది. అది రాకపోవడంతో విద్యావలంటీర్ కోసం దరఖాస్తు చేసుకుంది. అదికూడా రాలేదు. దీంతో భర్త రాజేశ్‌తో కలిసి తనకు ఉన్న మూడు ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంట మొత్తం దెబ్బతినడంతో ఆవేదనకు గురైంది.
భర్త రాజేశ్ గత ఆదివారం తిరుపతికి వెళ్లగా ఇంట్లో ఇద్దరు పిల్లలతో ఉంటున్న జ్యోతి ఉద్యోగం, ఉపాధి లేక పంట దెబ్బతినడంతో తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం తెల్లావారుజామున పురుగుల మందు తాగింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో వాంతులు కావడంతో మృత్యురాలి తల్లి కమలాబాయి హుటహూటిన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్ తరలించగా అక్కడి వైద్యులు రిమ్స్‌కు రెఫర్ చేశారు. అక్కడికి వెళ్తుండగా మృతి చెందింది. మృత్యురాలికి ఎనిమిదేళ్ల బాబు, 12 ఏళ్ల పాప ఉంది. ఆమె తల్లి కమలాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణకుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment