రౌడీషీటర్‌ దారుణహత్య | Rowdy Sheeter Murdered In Kagaznagar Over Old Gang Rivalry | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్‌ దారుణహత్య

Published Mon, Jun 1 2020 8:40 AM | Last Updated on Mon, Jun 1 2020 8:43 AM

Rowdy Sheeter Murdered In Kagaznagar Over Old Gang Rivalry - Sakshi

గుర్రం సంతోష్‌ (ఫైల్‌)

సాక్షి, కాగజ్‌నగర్‌టౌన్‌ : కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని గోల్‌బజార్‌ ఏరియాకు చెందిన రౌడీషీటర్‌ గుర్రం సంతోష్‌ అలియాస్‌ సంతు (35) హత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి గాంధీ చౌక్‌ మెయిన్‌ మార్కెట్‌ ఏరియాలో సంతోష్‌ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పట్టణ సీఐ డి.మోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని గోల్‌బజార్‌ ఏరియాకు చెందిన గుర్రం సత్యమ్మ, రమణమ్మ దంపతుల కుమారుడైన సంతోష్‌ ఇటీవల పీడీయాక్టు కేసులో జైలుశిక్ష అనుభవించి విడులైయ్యాడు. ప్రస్తుతం తల్లివద్దనే ఉంటున్నాడు. వ్యసనాలకు బానిసైన సంతోష్‌పై 11 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. (పగబట్టిన ప్రేమ; సాఫ్ట్‌వేర్‌ యువతికి..! )

అందులో హత్య, హత్యాయత్నాలు, దాడులు వంటివి కూడా ఉన్నాయి. మే 7న జైలు నుంచి విడుదలైన సంతోష్‌ శనివారం రాత్రి తీరందాజ్‌రోడ్డు గల్లిలో మరికొంత మంది నేరస్తులతో కలిసి మద్యం సేవిస్తుండగా గొడవపడ్డారు. వారి మధ్య ఉన్న పాత గొడవలపై ఘర్షణ చోటు చేసుకోవడంతో ఒకరు తమ ఇంటి నుంచి గొడ్డలి తీసుకువచ్చి సంతోష్‌పై దాడిచేశాడు. ఈ ఘటనలో సంతోష్‌కు తల, ఇతర భాగాల్లో తీవ్రగాయాలై మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఈ వార్త పట్టణవ్యాప్తంగా విస్తరించడంతో ఈ హత్య వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సంఘటన స్థలాన్ని కాగజ్‌నగర్‌ డీఎస్పీ బి.లక్ష్మీనర్సింహాస్వామి, సీఐ మోహన్, ఎస్సైలు రవికుమార్, తదితరులు పరిశీలించారు. సంఘటన స్థలంలో పడి ఉన్న పగిలిన మద్యం సీసాలు, ఇతర వివరాలను సేకరించారు. (కరోనా: రికార్డు స్థాయిలో కేసులు)

ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. మరికొంత మంది అనుమానితుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి తల్లి సత్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ మోహన్‌ విలేకరులకు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement