
కుర్సెంగ్ గౌరుబాయి మృతదేహం, మడపచ్చి భరత్ మృతదేహం
వాంకిడి(ఆసిఫాబాద్): ఇంట్లో పెద్దలు ప్రేమకు ఒప్పుకోలేదని తీవ్ర మనస్థాపానికి గురై ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడగా.. అది చూసి ప్రియుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన వాంకిడి మండలంలోని మహాగాంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్సెంగ్ గౌరుబాయి(18) అదే గ్రామానికి చెందిన మడపచ్చి భరత్(22) ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు వరుసకు బావమరుదళ్లు.
వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో గౌరుబాయిని తల్లిదండ్రులు ఇటీవల మందలించారు. అప్పటి నుంచి మనస్థాపానికి గురైన గౌరుబాయి తన ప్రేమకు తల్లిదండ్రులు ఇక ఒప్పుకోరన్న బాధతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఇంటి పక్కవారు గమనించి మహారాష్ట్రలోని చికిలి పాటన్ గ్రామానికి చెందిన గౌరుబాయి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆసిఫాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో గౌరుబాయి మృతిచెందింది.
బహిర్భూమికి వెళ్లి ప్రియుడు..
ప్రియురాలి మరణ వార్త తెలుసుకున్న ప్రియుడు మడపచ్చి భరత్(22) శనివారం ఉదయం బహిర్భూమికి అని వెళ్లి ఇంటి పక్కనే గల చేనులో పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. అప్పటికే భరత్ స్పృహా కోల్పోతున్న భరత్ జరిగిన విషయాన్ని అన్నయ్య తిరుపతికి చెప్పాడు. దీంతో వెంటనే భరత్‌ను వాంకిడి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఆసిఫాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో భరత్ కూడా మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. చిన్న వయసులోనే ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాదచాయలు కమ్ముకున్నాయి. ఇరువైపులా కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment