విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న పోలీసులు
సాక్షి, భైంసా(ఆదిలాబాద్) : ఆ ముగ్గురు విద్యార్థులవీ దాదాపు మధ్య తరగతి కుటుంబాలే. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని తాము చదువుతున్న హాస్టల్ నుంచి హైదరాబాద్‌కు రైలులో పారిపోయారు. గురువారం రాత్రి 7.20 గంటల ప్రాంతంలో భైంసాలోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ముగ్గురు బాగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పాఠశాల నుంచి పారిపోయినట్లు వారి వదిలివెళ్లిన లేఖ ఆధారంగా తెలుస్తోంది. పాఠశాల ప్రిన్సిపాల్ సుదర్శన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకున్నారు. వారి ఆచూకీ కోసం గాలిస్తుండగా, విద్యార్థులే తమ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉన్నామని.. తిరిగి వస్తున్నామని చెప్పినట్లు సీఐ వేణుగోపాల్‌రావు వివరించారు. సాయంత్రం వచ్చిన విద్యార్థులను మందలించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
గురువారం రాత్రి నుంచే అదృశ్యం..
వివరాల్లోకి వెళ్తే.. భైంసా పట్టణంలోని ఆటోనగర్ బైపాస్‌రోడ్డులో మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో జల్లా శివకుమార్, జాదవ్ వికాస్, మనీష్ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. శివకుమార్ తండ్రి భైంసాలో మీడియాలో పని చేస్తుండగా, సారంగపూర్ మండలం మహావీర్‌తండాకు చెందిన జాదవ్ వికాస్ తండ్రి రవి వేరుగా ఉంటుండటంతో అతడి తల్లి నీలాబాయి చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేస్తూ కొడుకును చదివిస్తోంది. కుభీర్‌కు చెందిన మనీష్ తండ్రి సాయినాథ్ టైలర్‌గా పని చేస్తున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు చెప్పారు. గురువారం రాత్రి 7.20 గంటల ప్రాంతంలో ఈ ముగ్గురు హాస్టల్ నుంచి తప్పించుకుపోయినట్లు ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లకు వెళ్లి ఉంటారని భావించి వారి తల్లిదండ్రులకు ఫోన్‌లో సంప్రదించారు. రాలేదని వారు తెలపడంతో అదృశ్యమైనట్లు శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నెలకు రూ.15వేలు సంపాదిస్తే..
దాదాపు 40 మంది వరకు విద్యార్థులు ఉండే ఈ తరగతి గదిలో శివకుమార్, వికాస్, మనీష్‌లు ఎప్పుడూ ఒక జట్టుగా ఉండేవారని, వీరి ఆలోచనా విధానం అంతా బాగా బతకాలనే ధోరణిలో ఉండేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. శివకుమార్‌కు షార్ట్‌ఫిలింలు తీయాలనే ఆసక్తి, రాజకీయాల్లో రాణించాలనే ఆసక్తిగా ఉండేదని గమనించినట్లు చెప్పారు. ఇక వికాస్ కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో డబ్బు సంపాదించాలనుకునేవాడని చెప్పాడు. మనీష్ తండ్రి టైలర్‌గా చేస్తుండగా, పాఠశాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ముగ్గురు కలిసి పాల్గొనేవారని పేర్కొన్నారు. డబ్బు సంపాదన కోసం వీరు రాసుకున్న లేఖ ఉపాధ్యాయులకు లభించింది. అందులో ఇలా ఉంది..వికాస్ నెల సంపాదన రూ.10వేలు, శివకుమార్‌కు రూ.5వేలు, మనీష్‌కు రూ.5వేలు, ముగ్గురు కలిసి నెలకు రూ.20వేలు సంపాదిస్తామని, ఇందులో రూ.5వేలు ఖర్చులకుపోగా, నెలకు రూ.15వేలు, ఏడాదికి రూ.లక్షా 80వేలు సంపాదించవచ్చని, మరుసటి ఏడాది రూ.3.60లక్షలు, మూడో ఏడాది రూ.5.40లక్షలు.. ఇలా రూ.కోటి వరకు సంపాదించేలా ప్రణాళిక వేసుకున్నారు. ఈ చేతిరాత వికాస్‌దేనని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కేవలం డబ్బు సంపాదించాలనే ఆశే వారిని హాస్టల్ వదిలి వెళ్లేలా చేసి ఉంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
విద్యార్థుల భద్రతపై అనుమానాలు..
ఇదిలా ఉండగా, హాస్టల్ నుంచి ముగ్గురు విద్యార్థులు పారిపోయిన విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం పాఠశాల నుంచి పారిపోతే తమకు ఉదయం వరకు ఎందుకు చెప్పలేదని మండిపడ్డారు. భరోసాతో ఇక్కడ చదివిస్తున్నామని, ఇలా ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహించారు.
Comments
Please login to add a commentAdd a comment