social welfare schools
-
గురుకులాల్లో 317 గుబులు! జోనల్ ఉద్యోగుల్లో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల్లోని ఉద్యోగుల్లో జీఓ 317 గుబులు మొదలైంది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఆమేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులను కేడర్ల వారీగా కేటాయించే ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. తాజాగా సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు జరపాలని ప్రభుత్వం ఆయా సొసైటీల కార్యదర్శులను ఆదేశించింది. దీంతో కేడర్ల వారీగా ఉద్యోగుల కేటాయింపుపై సొసైటీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఇందులోభాగంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్)లు జీఓ 317 అమలుకు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వగా... అధికారులు చర్యలు వేగవంతం చేశారు. అతి త్వరలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూ ఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల పరిధిలోనూ కొత్త జోన్ల వారీగా ఉద్యోగ కేటాయింపు ప్రక్రియ మొదలు కానుంది. నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితేనే కొత్తగా నియామకాలు, పోస్టింగులు ఇవ్వడానికి మార్గం సుగమం కానుంది. వివరాల సేకరణ షురూ ఎస్సీ, మైనార్టీ గురుకుల సొపైటీల్లో ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ వేగవంతమైంది. ఉద్యోగుల నుంచి నిర్దేశించిన ఫార్మాట్లో వివరాలను సేకరించే పనిలో రీజినల్ కోఆర్డినేటర్లు బిజీ అయ్యారు. ఇప్పటికే దాదాపు సమాచారం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. వీటిని పరిశీలించాక సీనియారిటీ జాబితాను రూపొందించిన అనంతరం కేటాయింపులు జరుపుతారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతరత్రా నిర్దేశించిన కేటగిరీల్లోని ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తారు. జోనల్ ఉద్యోగుల్లో గందరగోళం కొత్త జోనల్ విధానం ప్రకారం విభజన అంశం జోనల్ స్థాయి ఉద్యోగుల్లోనే ఎక్కువ గుబులు పుట్టిస్తోంది. ఇదివరకు రాష్ట్రంలో రెండు జోన్లు మాత్రమే ఉండేవి. కొత్త విధానంతో జోన్ల సంఖ్య ఏడుకు పెరిగింది, ఇందులో జోన్ పరిధి తగ్గింది. ఈ క్రమంలో జోనల్ స్థాయి ఉద్యోగుల స్థానికత ఆధారంగా కేటాయింపులు జరిపితే సగానికి పైగా ఉద్యోగులకు స్థానచలనం అనివార్యం కానున్నట్లు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల స్థానచలనం జరిగితే పిల్లల చదువులు, ఇతరత్రా అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతాయనే వాదన ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తోంది. కేడర్ల వారీగా ఉద్యోగుల విభజన ఇలా... జిల్లా స్థాయి: జూనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ అటెండర్ జోనల్ స్థాయి: టీజీటీ, సూపరింటెండెంట్, ఫిజికల్ డైరెక్టర్ (గ్రేడ్ 2), లైబ్రేరియన్, సీనియర్ అసిస్టెంట్, స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, వార్డెన్, పీఈటీ, ల్యాబ్ అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, ప్లంబర్/ఎలక్ట్రీషియన్ మల్టీ జోనల్ స్థాయి: ప్రిన్సిపల్ (గ్రేడ్ 2), డిగ్రీ కాలేజీలోని లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్లు, హెల్త్ సూపర్వైజర్లు, జూనియర్ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్ (గ్రేడ్ 1), పీజీటీలు. జిల్లా, మల్టీ జోన్లలో కొందరు జిల్లాస్థాయి, మల్టీ జోనల్ స్థాయి కేడర్ ఉద్యోగుల్లోనూ కొన్ని మార్పులు తప్పవని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జిల్లాల పరిధి కుదించుకోపోవడం, ఇదివరకు మల్టీ జోన్ లేకుండా రాష్ట్రస్థాయి పోస్టులుండగా... ఇప్పుడు ఆయా కేడర్లలోని ఉద్యోగుల్లో కొందరికి మార్పు తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం వివరాల సేకరణలో ఉన్న అధికారులు.. వారంలోగా సీనియారిటీ ఆధారంగా కేటాయింపులపై ప్రాథమిక జాబితాలు రూపొందిస్తే కొంత స్పష్టత రానుంది. మరోవైపు ఉద్యోగుల కేటాయింపులు మాత్రమే ఇప్పుడు జరిపి, స్థానచలనం జరిగితే కొంత సమయం ఇవ్వాలనే ఉద్యోగుల వినతులను ప్రభుత్వం పరిశీలిస్తోందని విశ్వసనీయ సమాచారం. చదవండి: Telangana: ఊరూరా గోదారే!.. కనీవినీ ఎరుగని జలవిలయం -
డబ్బులు సంపాదిద్దాం.. టార్గెట్ రూ.కోటి..!
సాక్షి, భైంసా(ఆదిలాబాద్) : ఆ ముగ్గురు విద్యార్థులవీ దాదాపు మధ్య తరగతి కుటుంబాలే. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని తాము చదువుతున్న హాస్టల్ నుంచి హైదరాబాద్‌కు రైలులో పారిపోయారు. గురువారం రాత్రి 7.20 గంటల ప్రాంతంలో భైంసాలోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ముగ్గురు బాగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పాఠశాల నుంచి పారిపోయినట్లు వారి వదిలివెళ్లిన లేఖ ఆధారంగా తెలుస్తోంది. పాఠశాల ప్రిన్సిపాల్ సుదర్శన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకున్నారు. వారి ఆచూకీ కోసం గాలిస్తుండగా, విద్యార్థులే తమ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉన్నామని.. తిరిగి వస్తున్నామని చెప్పినట్లు సీఐ వేణుగోపాల్‌రావు వివరించారు. సాయంత్రం వచ్చిన విద్యార్థులను మందలించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. గురువారం రాత్రి నుంచే అదృశ్యం.. వివరాల్లోకి వెళ్తే.. భైంసా పట్టణంలోని ఆటోనగర్ బైపాస్‌రోడ్డులో మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో జల్లా శివకుమార్, జాదవ్ వికాస్, మనీష్ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. శివకుమార్ తండ్రి భైంసాలో మీడియాలో పని చేస్తుండగా, సారంగపూర్ మండలం మహావీర్తండాకు చెందిన జాదవ్ వికాస్ తండ్రి రవి వేరుగా ఉంటుండటంతో అతడి తల్లి నీలాబాయి చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేస్తూ కొడుకును చదివిస్తోంది. కుభీర్‌కు చెందిన మనీష్ తండ్రి సాయినాథ్ టైలర్‌గా పని చేస్తున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు చెప్పారు. గురువారం రాత్రి 7.20 గంటల ప్రాంతంలో ఈ ముగ్గురు హాస్టల్ నుంచి తప్పించుకుపోయినట్లు ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లకు వెళ్లి ఉంటారని భావించి వారి తల్లిదండ్రులకు ఫోన్లో సంప్రదించారు. రాలేదని వారు తెలపడంతో అదృశ్యమైనట్లు శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెలకు రూ.15వేలు సంపాదిస్తే.. దాదాపు 40 మంది వరకు విద్యార్థులు ఉండే ఈ తరగతి గదిలో శివకుమార్, వికాస్, మనీష్‌లు ఎప్పుడూ ఒక జట్టుగా ఉండేవారని, వీరి ఆలోచనా విధానం అంతా బాగా బతకాలనే ధోరణిలో ఉండేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. శివకుమార్‌కు షార్ట్‌ఫిలింలు తీయాలనే ఆసక్తి, రాజకీయాల్లో రాణించాలనే ఆసక్తిగా ఉండేదని గమనించినట్లు చెప్పారు. ఇక వికాస్ కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో డబ్బు సంపాదించాలనుకునేవాడని చెప్పాడు. మనీష్ తండ్రి టైలర్‌గా చేస్తుండగా, పాఠశాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ముగ్గురు కలిసి పాల్గొనేవారని పేర్కొన్నారు. డబ్బు సంపాదన కోసం వీరు రాసుకున్న లేఖ ఉపాధ్యాయులకు లభించింది. అందులో ఇలా ఉంది..వికాస్ నెల సంపాదన రూ.10వేలు, శివకుమార్‌కు రూ.5వేలు, మనీష్‌కు రూ.5వేలు, ముగ్గురు కలిసి నెలకు రూ.20వేలు సంపాదిస్తామని, ఇందులో రూ.5వేలు ఖర్చులకుపోగా, నెలకు రూ.15వేలు, ఏడాదికి రూ.లక్షా 80వేలు సంపాదించవచ్చని, మరుసటి ఏడాది రూ.3.60లక్షలు, మూడో ఏడాది రూ.5.40లక్షలు.. ఇలా రూ.కోటి వరకు సంపాదించేలా ప్రణాళిక వేసుకున్నారు. ఈ చేతిరాత వికాస్దేనని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కేవలం డబ్బు సంపాదించాలనే ఆశే వారిని హాస్టల్ వదిలి వెళ్లేలా చేసి ఉంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల భద్రతపై అనుమానాలు.. ఇదిలా ఉండగా, హాస్టల్ నుంచి ముగ్గురు విద్యార్థులు పారిపోయిన విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం పాఠశాల నుంచి పారిపోతే తమకు ఉదయం వరకు ఎందుకు చెప్పలేదని మండిపడ్డారు. భరోసాతో ఇక్కడ చదివిస్తున్నామని, ఇలా ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహించారు. -
ఫ్రీడం స్కూళ్లు: చదువు, పరీక్షలు మన ఇష్టం
సాక్షి, హైదరాబాద్: ఫ్రీడం స్కూల్.. అక్కడ పిల్లలకు పాఠ్యాంశ పుస్తకాలుండవు.. టీచర్లు గంటల తరబడి బ్లాకు బోర్డుపై బోధించే పద్ధతి కనిపించదు. బట్టీ పట్టే విధానం అస్సలుండదు. ఇదీ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పాఠశాలల్లో తీసుకొచ్చిన సరికొత్త కాన్సెప్ట్. విద్యార్థులపై ఒత్తిడి లేని విధంగా బోధన, అభ్యసన సాగాలనే లక్ష్యంతో ఎస్సీ గురుకుల సొసైటీ సరికొత్తగా ‘ఫ్రీడం స్కూల్’విధానాన్ని తీసుకొచ్చింది. గురుకులం నిర్వహణంతా సొసైటీ ఆధ్వర్యంలోనే సాగినప్పటికీ.. ఇక్కడ నిర్వాహకులు, బోధకులు, పరీక్షల విధానం, కార్యాచరణ అంతా విద్యార్థుల అభీష్టం మేరకే నడుస్తుంది. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడమే ఉపాధ్యాయుల పని. మిగతా కార్యక్రమాలన్నీ విద్యార్థుల ఆలోచనలు, సూచనల మేరకే నడుస్తాయి. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానంపై పూర్తిగా అధ్యయనం చేసిన ఎస్సీ గురుకుల సొసైటీ.. రాష్ట్రంలో 23 గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ విధానం విజయవంతమైతే అన్ని గురుకుల పాఠశాలల్లో అమలు చేయాలని సొసైటీ భావిస్తోంది. పెన్ను, పేపర్ లేని పరీక్షలు సాధారణంగా బడికి వేళ్లే పిల్లలకు పాఠ్యాంశ పుస్తకాలుంటాయి. వీటి ప్రకారం నిర్దేశించిన తేదీల్లో బోధన చేపడతారు. ఆమేరకు అభ్యసన పూర్తి చేసిన విద్యార్థులకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి, అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. కానీ ఫ్రీడం స్కూల్ విధానంలో ఈ పద్ధతులేవీ కనిపించవు. ఒక్కో క్లాస్ 90 నిమిషాల పాటు ఉంటుంది. ప్రతి రోజూ 4 íపీరియడ్లు మాత్రమే ఉంటాయి. ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థులుంటారు. ప్రతి నలుగురు విద్యార్థులతో ఒక బృందం చొప్పున క్లాస్‌రూముల్లో 10 బృందాలుంటాయి. ప్రతి బృందానికి ఒక లీడర్ ఉంటారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలకు బదులుగా మాడ్యూల్స్ ఉంటాయి. వీటిలోని అంశాలపై విద్యార్థులే పరస్పరం వేర్వేరుగా, బృందంగా చర్చలు జరపడం, లోతుగా పరిశోధించడం లాంటివి చేస్తారు. ప్రతి మాడ్యూల్లో అం శం, దాని తాలూకూ చరిత్ర ఉం టుంది. వీటిపై గ్రూప్ డిస్కర్షన్స్తో పాటు మాడ్యూల్‌లోని అంశాలపై స్కిట్లు రూపొందించడం, డిబేట్, క్విజ్ ఏర్పాటు చేయడం లాంటివి చేస్తారు. దీంతో ప్రతి అంశంపై విద్యార్థులకు లోతైన జ్ఞానం వస్తుంది. ఇక్కడి విద్యార్థులకు సాధారణ స్కూల్లో నిర్వహించే పరీక్షలుండవు. ఇక్కడ జరిగే పరీక్షల్లో విద్యార్థులు పెన్ను, పేపర్లను వినియోగించరు. స్కిట్స్, డిబేట్స్, క్విజ్, డ్రామా లాంటి అంశాలతోనే వారికి మార్కులు పడతాయి. బోధన, అభ్యసన అంశాలు, పరీక్షల నిర్వహణకు విద్యార్థుల ఆమోదం తప్పనిసరి. తరగతి గదిలో మెజార్టీ విద్యార్థుల అభిప్రాయం మేరకు ఆరోజు కార్యక్రమాలు సాగుతాయి. ఈ స్కూళ్లు ఎక్కడెక్కడంటే.. రాష్ట్రవ్యాప్తంగా 23 గురుకుల పాఠశాలలను ఫ్రీడం స్కూల్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. బోథ్, బెల్లంపల్లి, మంచిర్యాల, హయత్‌నగర్, సరూర్‌నగర్, కొందుర్గు, శంషాబాద్, ఆర్కేపురం, చేవెళ్ల, నార్సింగి, షేక్‌పేట్, చొప్పదండి, తిరుమలాయపాలెం, వెల్దండ, గద్వాల్, ఆర్.ఆర్.గూడెం, సిద్దిపేట్ రూరల్, ములుగు, చండూరు, వేల్పుర్, వరంగల్ ఈస్ట్, అడ్డగూడురు, చౌటుప్పల్ గురుకుల పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ పాఠశాలల నిర్వహణపై ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తున్న సొసైటీ క్రమక్రమంగా వాటిని మెరుగుపర్చేందుకు సరికొత్త కార్యాచరణ ప్రణాళికలు తయారు చేస్తున్నారు. -
‘ఎవరెస్ట్’విద్యార్థులకు ఘన స్వాగతం
సాక్షి, విజయవాడ: ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి తిరిగి వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ, ట్రైబెల్ వెల్ఫెర్ రెసిడెన్షియల్ విద్యార్థుల బృందానికి మంత్రి అనందబాబు ఘన స్వాగతం పలికారు. ఎవరెస్ట్ శిఖరాన్ని పూర్తిగా అధిరోహించిన ముగ్గురు సోషల్ వెల్ఫెర్, ఇద్దరు ట్రైబెల్ వెల్ఫెర్ విద్యార్థులను మంత్రి ఘనంగా సన్మానించారు. శిఖరాన్ని పూర్తిగా అధిరోహించిన విద్యార్థులకు రూ.10లక్షలు, మధ్యలో వెనుతిరిగిన విద్యార్థులకు రూ.5లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎవరెస్ట్ శిఖరరోహణ ద్వారా విద్యార్థులు రాష్ట్ర ప్రతిష్టతను మరింత పెంపొందించారని అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఈ బడి.. చదువులమ్మ ఒడి
సాక్షి, హైదరాబాద్ : కేజీ టు పీజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలను తెరిచింది. రెసిడెన్షియల్ విధానంలో కొనసాగే ఈ పాఠశాలలు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ స్కూళ్లు మాత్రం రోజురోజుకూ తీసికట్టుగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ ప్రభుత్వ పాఠశాల మాత్రం గురుకులాలకు దీటుగా ఫలితాలు సాధించి స్ఫూర్తిగా నిలిచింది. ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో 92 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఆ పాఠశాలల ఉపాధ్యాయులు, స్థానికులు కలసి చేసిన వినూత్న ఆలోచనే ఈ విజయానికి కారణం. ఇంతకీ ఆ పాఠశాల ఏదో తెలుసా.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి ఉన్నత పాఠశాల. ఈ పాఠశాలలో ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ కంటే కాస్త ముందుగానే పాఠ్యాంశాల బోధన కొనసాగించడం, గురుకులాల తరహాలో రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్ నిర్వహిస్తూ.. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, సాయంత్రం చిరుతిళ్లు పంపిణీ చేయడం గమనార్హం. ఇప్పుడీ పాఠశాల రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అల్పాహారం, చిరుతిళ్లు ఇవ్వడంతో.. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల్లో 85% మందికిపైగా పేదలే. ఉదయం బడికి వచ్చే సమయంలో ఎక్కువ మంది పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోకుండానే వస్తున్నట్టు పలు సంస్థల సర్వేల్లో తేలింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడుతున్నా విద్యార్థులు ఉదయం ఆహారం తీసుకోకపోవడంతో... బోధన, అభ్యసనపై పూర్తి దృష్టి పెట్టలేకపోతున్నారు. సాయంత్రం ఇళ్లకు తిరిగి వెళుతున్న పిల్లలు.. ఇంటి వద్ద అభ్యసనపై దృష్టి సారించడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన రాచర్ల గొల్లపల్లి పాఠశాల టీచర్లు.. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించడంతోపాటు ఉదయం అల్పాహారం, సాయంత్రం చిరుతిళ్లు అందజేయాలని నిర్ణయించారు. పలువురు దాతలు కూడా విరాళాలు ఇవ్వడంతో.. గతేడాది అర్ధ వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత తమ ప్రణాళికను అమల్లోకి తెచ్చారు. అయితే ఈ పాఠశాలలో 261 మంది విద్యార్థులు ఉన్నారు. అం దులో పదో తరగతిలో 60 మంది ఉన్నారు. పాఠశాలలోని విద్యార్థులందరికీ అల్పాహారం, చిరుతిళ్లు అందించడానికి డబ్బు సరిపోయే పరిస్థితి లేకపోవడంతో.. 60 మంది విద్యార్థులున్న పదో తరగతిని మాత్రం ఎంపిక చేసుకున్నారు. ప్రత్యేకంగా ప్రణాళికతో.. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ కంటే ముందుగా బోధన, అభ్యసన తరగతులు చేపట్టేందుకు ఉపాధ్యాయులు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించి.. పాఠ్యాంశాల పునశ్చరణ కొనసాగించారు. ఆ సమయంలో విద్యార్థులకు పాలు, ఉప్మా, గుగ్గిళ్లు అందజేశారు. వెనుకబడిన విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టి చదివించారు. ఈ ప్రణాళిక సత్ఫలితాలను ఇచ్చింది. ఏటా సగటున టెన్త్‌లో 70 శాతం ఉత్తీర్ణత నమోదు చేసిన ఈ పాఠశాల... 2017–18 విద్యా సంవత్సరంలో ఏకంగా 92 శాతం ఉత్తీర్ణత సాధించింది. అంతేకాదు పది మంది విద్యార్థులు ఏకంగా 9 పాయింట్లపైన గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) సాధించడం గమనార్హం. ఇదే తరహాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొత్తగా ఆలోచించాలి ‘‘కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పనిచేయాలంటే ప్రభుత్వ పాఠశాలలు కొత్త తరహాలో ఆలోచించాలి. పరిస్థితులను బట్టి ప్రణాళికను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ స్కూళ్లలో చదివే పిల్లలు ఆర్థికంగా మెరుగ్గా ఉంటారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారిలో పేదలే ఎక్కువ. వారికి పాఠశాలల్లో బోధనతో పాటు అభ్యసన కార్యక్రమాలు నిర్వహించాలి. అదే సమయంలో పౌష్టికాహారం కూడా అందించాలి. మేమం చేసింది అదే. ఈ ఏడాది ఈ కార్యచరణను మరింతగా విస్తరిస్తున్నాం..’’ – మీస రవి, సోషల్ టీచర్, రాచర్ల గొల్లపల్లి హైస్కూల్ -
‘లక్ష్యం’ గాలికి..
హుస్నాబాద్‌రూరల్ : పదో తరగతి పరీక్షల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రణాళికబద్ధంగా తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు సబ్జెక్టు ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని హెచ్ఎంలకు సూచించింది. అయితే, రోజుకు ఒక సబ్జెక్ట్ ఉపాధ్యాయుడితోనే ప్రత్యేక తరగతుల నిర్వహించి ప్రధానోపాధ్యాయులు చేతులు దులుపుకుంటున్నట్టు సమాచారం. వార్షిక ఫలితాలపై ప్రభావం హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలలో 15 ప్రభుత్వ పాఠశాలలో 350 మంది 10వ తరగతి చదువుతున్నారు. వీరికి వారం వారం ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది మండలంలో మీర్జాపూర్, మోడల్ స్కూల్, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి. మొత్తంగా హుస్నాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు గత ఏడాది 87 శాతం ఫలితాలు సాధించాయి. ఈసారి ప్రతి పాఠశాల వందశాతం ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. హెచ్ఎంల తీరుపై విమర్శలు సిద్దిపేట విద్యాధికారి ఆదేశాల మేరకు గత ఏడాది అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు నిత్యం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఒక సబ్జెక్ట్ టీచర్ విద్యా బోధన చేశారు. జనవరి నుంచి ఉదయం, సాయంత్రం 2 గంటలు ప్రత్యేక తరగతులు బోధిస్తున్నారు. సెలవు రోజుల్లో మాత్రం ఉదయం 8.30 నుంచి 11.30 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో హెచ్ఎంల తీరుతో ఫలితాలపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది. మరోవైపు తాగునీరు, అల్పాహారం అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు రాత్రి 7 గంటలకు ఇళ్లకు చేరుతుండటంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హెచ్ఎంల పనితీరు మార్చుకోవాలని అటు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల గ్రాంట్స్‌కు బోగస్ బిల్లులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఏటా రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) కింద రూ.10 వేలు ప్రాఠశాల గ్రాంట్, రూ.15,000 నిర్వహణ ఖర్చులు, ఒక టీచర్‌కు రూ.500 టీచింగ్ గ్రాంట్స్ ప్రభుత్వం విడుదల చేస్తుంది. వీటితో పాటు ఆర్‌ఎంఎస్‌ఏ(రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్) కింద పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ఏటా రూ.50 వేలు అందుతాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఒక్కో 10వ తరగతి విద్యార్థికి స్నాక్స్, ఇతర సౌకర్యాల కోసం రూ.4 అందిస్తున్నారు. కాగా, హెచ్ఎంలు గ్రామాలకు చెందిన దాతలతో అల్పాహారం ఏర్పాటుచేయిస్తూ.. నిధులు కాజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలో గ్రంథాలయ పుస్తకాలు, సైన్స్ పరికరాలు ఏర్పాటుచేయకుండానే గ్రాంట్స్ కాజేస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. అక్కన్నపేట పాఠశాలకు సంబంధించిన బిల్లుల విషయంలో యువజనులు గతంలో సమాచార చట్టం కింద వివరాలను సేకరిస్తే ఇలాంటి అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. హెచ్ఎంలు అందుబాటులో ఉండాలి 10వ తరగతి ప్రత్యేక తరగతులకు సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు ఉన్నప్పటికీ పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే వరకు ప్రధానోపాధ్యాయులు ఉండాల్సిందే. ఒకటి, రెండు రెండు చోట్ల హెచ్ఎంలు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవచ్చు. దీనిపై ఆరా తీస్తాం. – మారంపల్లి అర్జున్, ఎంఈఓ -
సిటింగ్ జడ్జితో విచారణ జరపాలి
డుంబ్రిగుడ: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో మృతి చెందుతున్న గిరిజన విద్యార్థులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు. విశాఖలోని హాస్టల్లో ఉండి చదువుకుంటూ మృతి చెందిన బోయిన రాజ్‌కుమార్ కుటుంబాన్ని కురిడి గ్రామానికి వచ్చి ఆయన మంగళవారం పరామర్శించారు. గిరిజన విద్యార్థులు నిత్యం వ్యాధుల బారిన పడి మృతి చెందుతున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రాజ్‌కుమార్ కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేసియా చెల్లించాలని..తక్షణమే వారి తల్లిదండ్రులకు అందజేయాలని చెప్పారు. అధికారులు నిర్లక్ష్యంతోనే విద్యార్థులు మృతి చెందుతున్నారని అన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని.. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గిరిజన సంఘ అధ్యక్ష కార్యదర్శులు టి.సూర్యనారాయణ, పాంగి సురేష్ పాల్గొన్నారు. -
గురుకుల విద్యాలయాలకు మహర్దశ
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో 12 సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. నాలుగు బాలురకు, ఎనిమిది బాలికలకు కేటాయించారు. ఇందులో ఐదో తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్ వరకు ఉచితంగా చదువుకోవచ్చు. విద్యార్థులకు తరగతుల నిర్వహణతోపాటు వసతులలో ఇబ్బందులు తలెత్తరాదనే ఉద్దేశంతో ఎస్సీ సబ్ ప్లాన్ కింద జిల్లాలోని 12 పాఠశాలలకు ప్రభుత్వం రూ.14.10 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. ఇన్నేళ్లుగా అరకొర వసతులతో అవస్థలు పడిన విద్యార్థులకు తిప్పలు తీరనున్నాయి. విద్యాప్రమాణాలు మెరుగుపడనున్నాయి. జిల్లాలో పాఠశాలలు జిల్లాలో బాలురకు ఆసిఫాబాద్, సిర్పూర్(టి), ఇందారం, ముథోల్‌లో పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా సిర్పూర్(టి), బెల్లంపల్లి, లక్సెట్టిపేట, కడెం, సారంగాపూర్, బోథ్, పోచంపాడు(లెఫ్ట్), ఆదిలాబాద్‌లలో బాలికలకు పాఠశాలలను ఏర్పాటు చేశారు. మంజూరైన నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణం, లైబ్రరీ, ప్రయోగశాల, పడక గదులు, భోజనశాల, క్రీడా సామగ్రి, ప్రిన్సిపాల్, బోధన, బోధనేత ర సిబ్బందికి క్వార్టర్లు, ప్రహరీ నిర్మించాలి. ప్రతి పాఠశాలలో మంజూరైన నిధులతో పనులు పూర్తి చేసినచో విద్యార్థుల దశ మారనుంది. మరో రెండు మంజూరు ఒక్కొక్క పాఠశాలకు రూ.14 కోట్ల చొప్పున జిల్లాకు కొత్తగా రెండు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయి. వీటిలో ఒకటి చెన్నూరు(బాలికలు), బెల్లంపల్లి(బాలురు). చెన్నూరు పాఠశాల వల్ల కోటపల్లి, వేమనపల్లి మారుమూల మండలాల విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా బెల్లంపల్లి పాఠశాలతో నెన్నెల, భీమిని, దహెగాం మండలాల విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది.