సాక్షి, హైదరాబాద్ : కేజీ టు పీజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలను తెరిచింది. రెసిడెన్షియల్ విధానంలో కొనసాగే ఈ పాఠశాలలు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ స్కూళ్లు మాత్రం రోజురోజుకూ తీసికట్టుగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ ప్రభుత్వ పాఠశాల మాత్రం గురుకులాలకు దీటుగా ఫలితాలు సాధించి స్ఫూర్తిగా నిలిచింది. ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో 92 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఆ పాఠశాలల ఉపాధ్యాయులు, స్థానికులు కలసి చేసిన వినూత్న ఆలోచనే ఈ విజయానికి కారణం. ఇంతకీ ఆ పాఠశాల ఏదో తెలుసా.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి ఉన్నత పాఠశాల. ఈ పాఠశాలలో ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ కంటే కాస్త ముందుగానే పాఠ్యాంశాల బోధన కొనసాగించడం, గురుకులాల తరహాలో రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్ నిర్వహిస్తూ.. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, సాయంత్రం చిరుతిళ్లు పంపిణీ చేయడం గమనార్హం. ఇప్పుడీ పాఠశాల రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
అల్పాహారం, చిరుతిళ్లు ఇవ్వడంతో..
ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల్లో 85% మందికిపైగా పేదలే. ఉదయం బడికి వచ్చే సమయంలో ఎక్కువ మంది పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోకుండానే వస్తున్నట్టు పలు సంస్థల సర్వేల్లో తేలింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడుతున్నా విద్యార్థులు ఉదయం ఆహారం తీసుకోకపోవడంతో... బోధన, అభ్యసనపై పూర్తి దృష్టి పెట్టలేకపోతున్నారు. సాయంత్రం ఇళ్లకు తిరిగి వెళుతున్న పిల్లలు.. ఇంటి వద్ద అభ్యసనపై దృష్టి సారించడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన రాచర్ల గొల్లపల్లి పాఠశాల టీచర్లు.. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించడంతోపాటు ఉదయం అల్పాహారం, సాయంత్రం చిరుతిళ్లు అందజేయాలని నిర్ణయించారు. పలువురు దాతలు కూడా విరాళాలు ఇవ్వడంతో.. గతేడాది అర్ధ వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత తమ ప్రణాళికను అమల్లోకి తెచ్చారు. అయితే ఈ పాఠశాలలో 261 మంది విద్యార్థులు ఉన్నారు. అం దులో పదో తరగతిలో 60 మంది ఉన్నారు. పాఠశాలలోని విద్యార్థులందరికీ అల్పాహారం, చిరుతిళ్లు అందించడానికి డబ్బు సరిపోయే పరిస్థితి లేకపోవడంతో.. 60 మంది విద్యార్థులున్న పదో తరగతిని మాత్రం ఎంపిక చేసుకున్నారు.
ప్రత్యేకంగా ప్రణాళికతో..
ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ కంటే ముందుగా బోధన, అభ్యసన తరగతులు చేపట్టేందుకు ఉపాధ్యాయులు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించి.. పాఠ్యాంశాల పునశ్చరణ కొనసాగించారు. ఆ సమయంలో విద్యార్థులకు పాలు, ఉప్మా, గుగ్గిళ్లు అందజేశారు. వెనుకబడిన విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టి చదివించారు. ఈ ప్రణాళిక సత్ఫలితాలను ఇచ్చింది. ఏటా సగటున టెన్త్‌లో 70 శాతం ఉత్తీర్ణత నమోదు చేసిన ఈ పాఠశాల... 2017–18 విద్యా సంవత్సరంలో ఏకంగా 92 శాతం ఉత్తీర్ణత సాధించింది. అంతేకాదు పది మంది విద్యార్థులు ఏకంగా 9 పాయింట్లపైన గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) సాధించడం గమనార్హం. ఇదే తరహాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కొత్తగా ఆలోచించాలి
‘‘కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పనిచేయాలంటే ప్రభుత్వ పాఠశాలలు కొత్త తరహాలో ఆలోచించాలి. పరిస్థితులను బట్టి ప్రణాళికను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ స్కూళ్లలో చదివే పిల్లలు ఆర్థికంగా మెరుగ్గా ఉంటారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారిలో పేదలే ఎక్కువ. వారికి పాఠశాలల్లో బోధనతో పాటు అభ్యసన కార్యక్రమాలు నిర్వహించాలి. అదే సమయంలో పౌష్టికాహారం కూడా అందించాలి. మేమం చేసింది అదే. ఈ ఏడాది ఈ కార్యచరణను మరింతగా విస్తరిస్తున్నాం..’’ – మీస రవి, సోషల్ టీచర్, రాచర్ల గొల్లపల్లి హైస్కూల్
Comments
Please login to add a commentAdd a comment