ఈ వారం మార్కెట్ల ట్రెండ్‌పై అంచనాలు
టీసీఎస్, టాటా ఎలక్సీ రెడీ
పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కీలకం
విదేశీ అంశాలకూ ప్రాధాన్యం
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నడిపించనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. దీనికితోడు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు, ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇవికాకుండా ప్రపంచ రాజకీయ, భౌగోళిక అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం..
9న షురూ
సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం టీసీఎస్‌తోపాటు టాటా గ్రూప్ కంపెనీ టాటా ఎలక్సీ, ఫైనాన్షియల్ పీఎస్‌యూ ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ(ఇరెడా) గురువారం(9న) క్యూ3 పనితీరును వెల్లడించనున్నాయి. తద్వారా ఫలితాల సీజన్‌కు శ్రీకారం చుట్టనున్నాయి. ఇటీవలే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన ఫిన్‌టెక్ సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ మంగళవారం తొలిసారి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. టీసీఎస్ పటిష్ట పనితీరు సాధిస్తే ఇటీవల అమ్మకాల బాటలో సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులవైపు దృష్టి పెట్టవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు.
దేశీ అంశాలు
వారాంతాన(10న) ప్రభుత్వం నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్(ఐఐపీ) గణాంకాలు వెల్లడించనుంది. అక్టోబర్‌లో ఐఐపీ వార్షికంగా 3.5 శాతం పుంజుకుంది. అంతేకాకుండా డిసెంబర్ నెలకు హెచ్‌ఎస్‌బీసీ సరీ్వసెస్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. వచ్చే నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్‌ను ప్రకటించనుంది. దీంతో ఇన్వెస్టర్లు బడ్జెట్ ప్రతిపాదలపైనా దృష్టి పెట్టనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ అభిప్రాయపడ్డారు.
ట్రంప్ ఎఫెక్ట్
ఈ నెల మూడో వారంలో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో గత వారాంతాన ముడిచమురు ధరలు బలపడ్డాయి. బ్రెంట్ బ్యారల్ 75 డాలర్లను తాకింది. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 85.79కు చేరింది. ఇక ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) గత పాలసీ నిర్ణయాలకు సంబంధించిన వివరాలు(మినిట్స్) 9న వెల్లడికానున్నాయి. ఈ అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయగలవని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ అంచనా వేశారు. కాగా.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. అయితే దేశీ ఫండ్స్ భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈ అంశాలన్నీ ట్రెండ్ నిర్ణయంలో కీలకంగా నిలవనున్నట్లు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సే తెలియజేశారు.
గత వారమిలా
శుక్రవారం(3)తో ముగిసిన గత వారం తీవ్ర ఆటుపోట్ల మధ్య మార్కెట్లు బలపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ నికరంగా 524 పాయింట్లు(0.7 శాతం) పుంజుకుని 79,223 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 191 పాయింట్లు(0.8 శాతం) ఎగసి 24,000 పాయింట్లకు ఎగువన 24,005 వద్ద నిలిచింది. ఈ బాటలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 1.3 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2 శాతం జంప్‌చేసింది.
ఎఫ్‌పీఐలు వెనక్కి
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కొత్త ఏడాది తొలి మూడు(1–3) ట్రేడింగ్ రోజుల్లో నికర అమ్మకందారులుగా నిలిచారు. వెరసి రూ. 4,285 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే డిసెంబర్‌లో తొలుత అమ్మకాలకే పరిమితమైనప్పటికీ చివరి రెండు వారాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే. వెరసి గత నెలలో నికరంగా రూ. 15,446 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. యూఎస్ బాండ్ల ఈల్డ్స్ ఆకర్షణీయంగా మారడం, డాలరు బలపటడంతో ఎఫ్‌ఫీఐలు అమ్మకాలకే కట్టుబడవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment