12న టీసీఎస్‌తో షురూ
ఆర్థిక గణాంకాలూ కీలకమే
విదేశీ పెట్టుబడులకు ప్రాధాన్యం
ఈ వారం ట్రేడింగ్ 4 రోజులే
మార్కెట్లపై నిపుణుల అంచనాలు
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కార్పొరేట్ ఫలితాలు జోష్‌నివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ సేవలకు దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తున్న టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసిక ఫలితాలతో సీజన్‌ను ప్రారంభించనుంది. శుక్రవారం(12న) టీసీఎస్ జనవరి–మార్చి(క్యూ4)తోపాటు పూర్తి ఏడాదికి సైతం ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. ఇదే రోజు ఆర్థిక గణాంకాలు సైతం వెలువడనున్నాయి.
ప్రభుత్వం(ఎన్‌ఎస్‌వో) మార్చి నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను విడుదల చేయనుంది. అంతేకాకుండా ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి వివరాలు సైతం వెల్లడికానున్నాయి. ఫిబ్రవరిలో సీపీఐ నామమాత్ర వెనకడుగుతో 5.09 శాతానికి చేరింది. ఇక పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) జనవరిలో 3.4 శాతంగా నమోదైంది. కాగా.. గురువారం(11న) ఈద్(రంజాన్) సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది.
గత వారం రికార్డు
గత వారం ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. చివరికి శుక్రవారంతో ముగిసిన గత వారం సెన్సెక్స్ 597 పాయింట్లు(0.8 శాతం) లాభపడి 74,248 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ సైతం 187 పాయింట్లు(0.84 శాతం) ఎగసి 22,514 వద్ద స్థిరపడింది. అయితే చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగడంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3.84 శాతం జంప్‌చేసి 40,831 వద్ద నిలిచింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ మరింత అధికంగా 6.64 శాతం దూసుకెళ్లి 46,033 వద్ద ముగిసింది.
చమురు, రూపాయి ఎఫెక్ట్
ప్రపంచ స్టాక్ మార్కెట్లు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగలవని స్టాక్ నిపుణులు ప్రస్తావించారు. అంతేకాకుండా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు లేదా అమ్మకాలు మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకాగలవని పేర్కొన్నారు. మరోవైపు రష్యా తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఇక ఇటీవల యూఎస్ డాలరుతో బలహీనంగా కదులుతున్న దేశీ కరెన్సీ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.
గత వారం డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి చేరువైన నేపథ్యంలో ఆరు ప్రపంచ కరెన్సీలతో డాలరు మారకపు విలువ కీలకంగా నిలవనున్నట్లు విశ్లేíÙంచారు. విదేశీ అంశాల విషయానికివస్తే గత వారాంతాన మార్చి నెలకు యూఎస్ వ్యవసాయేతర రంగాలలో ఉపాధి, నిరుద్యోగిత గణాంకాలు వెలువడ్డాయి. వీటితోపాటు ఈ నెల 10న(బుధవారం) యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి.
ఇటీవల చేపట్టిన పాలసీ సమీక్షలో యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. ఫండ్స్ రేట్లను యథాతథంగా నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ బాటలో దేశీయంగా సైతం ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును ఏడోసారీ యథాతథంగా 6.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) జీడీపీ వృద్ధి రేటును 7 శాతంగా అంచనా వేసింది. సీపీఐ లక్ష్యాన్ని 4.5 శాతంగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment