ఎఫ్‌అండ్‌ఓ ముగింపు నేపథ్యంలో ఊగిసలాట ఉండొచ్చు
ప్రపంచ పరిణామాలు, విదేశీ పెట్టుబడులు కీలకం
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. డెరివేటివ్ కాంట్రాక్టుల నెలవారీ గడువు గురువారం(జూన్ 27)తో పూర్తి కానుండడం కూడా మార్కెట్లో ఊగిసలాట ఉండొచ్చంటున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు.
‘‘స్టాక్ మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నప్పట్టకీ., కొనుగోళ్లు చేసేందుకు గానీ, అమ్మకాలు జరిపేందుకు గానీ ప్రేరేపించే అంశాలేవీ లేనందున సూచీలు పరిమిత శ్రేణిలో చలించవచ్చు. అలాగే బడ్జెట్ అంచనాల వార్తలకు అనుగుణంగా బడ్జెట్ ఆధారిత రంగ షేర్లలో మూమెంటమ్ అధికంగా ఉండొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 23,400 – 23,700 శ్రేణిలో దిద్దుబాటు ఉండొచ్చు. దిగువ స్థాయిలో 23,300–23,200 పరిధిలో తక్షణ మద్దతు నెలకొని ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సాంకేతిక నిపుణులు ప్రవేశ్ గౌర్ తెలిపారు.
ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే గతవారంలో సెన్సెక్స్ 217 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్లు లాభపడ్డాయి.
జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశ నిర్ణయాల ప్రభావం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జరిగిన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశ నిర్ణయాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ముఖ్యంగా ఎరువులపై జీఎస్‌టీ 18% నుంచి 5 శాతానికి తగ్గింపు ప్రతిపాదనను మంత్రుల బృందానికి (జీవోఎం) సిఫార్సు చేయడంతో ఫెర్టిలైజర్లలో కదలికలు ఉండొచ్చు. అలాగే, ఈ సమావేశంలో ఆన్‌లైన్ గేమింగ్‌పై జీఎస్‌టీకి సంబంధించి ఎటువంటి చర్చ జరగకపోవడంతో ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు.
విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయ్
విధాన సంస్కరణలు, ఆర్థిక వృద్ధి కొనసాగింపుపై అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. ఈ జూన్ ఇప్పటివరకు(జూన్ 21 నాటికి) నికరంగా రూ.12,170 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫైనాన్సియల్ సరీ్వసెస్, టెలికం, రియల్టీ షేర్ల పట్ల ఆసక్తి కనబరిచారు. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్, అయిల్‌అండ్‌గ్యాస్ షేర్లను విక్రయించారు. ఇక డెట్ మార్కెట్ లో రూ.10,575 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు.
‘‘కేంద్రం వృద్ధికి మద్దతనిచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చనే ఆశలు ఎఫ్‌ఐఐలను కొనుగోళ్లకు ప్రేరేపిస్తున్నాయి. అయినప్పట్టకీ దేశీయ ఈక్విటీ మార్కెట్ వాల్యుయేషన్లు భారీ పెరిగాయనే నెపంతో ఎఫ్‌ఐఐలు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు’’ అని మార్నింగ్‌స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవత్సవ తెలిపారు. ఇక మేలో ఎఫ్‌పీఐలు ఈక్విటీల నుండి రూ. 25,586 కోట్లను ఉపసంహరించుకున్నారు, ఏప్రిల్‌లో రూ. 8,700 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అదే మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్లు నికర పెట్టుబడి పెట్టారు.
రెండు ఐపీఓలు, 2 లిస్టింగులు
రెండు కంపెనీలు ఈ వారంలో నిధుల సమీకరణకు రానున్నాయి. ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ పబ్లిక్ ఇష్యూ మంగళవారం( 25న) ప్రారంభమై, గురువారం (జూన్ 27న) ముగియనుంది. తద్వారా రూ.1,500 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 26న ప్రారంభంకానుంది. 28న ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 171 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇదే వారంలో డీఈఈ డెవలప్‌మెంట్ ఇంజినీర్స్ షేర్లు మంగళవారం, ఆక్మే ఫిన్‌ట్రేడ్ షేర్లు శుక్రవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి.
స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం
అమెరికా మార్చి త్రైమాసిక జీడీపీ వృద్ధి గణాంకాలు గురువారం, అదే రోజు యూరోజోన్ జూలై కన్జూమర్ కాని్ఫడెన్స్ డేటా, జపాన్ మే రిటైల్ అమ్మక గణాంకాలు విడుదల కానున్నాయి. మరుసటి రోజు(శుక్రవారం) చైనా మార్చి క్వార్టర్ కరెంట్ ఖాతా లోటు, జపాన్ మే నిరుద్యోగ గణాంకాలు, బ్రిటన్ క్యూ1 జీడీపీ వృద్ధి డేటా వెల్లడి కానున్నాయి. భారత మే నెల వాణిజ్య లోటు, మౌలిక రంగ వృద్ధి, మార్చి త్రైమాసిక కరెంటు ఖాతా లోటు (సీఏడీ), విదేశీ కరెన్సీ రుణ గణాంకాలు శుక్రవారం విడుదల కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment