ప్రపంచ మార్కెట్ల పనితీరుపై దృష్టి
ఎఫ్‌ఐఐల పెట్టుబడులూ కీలకమే
మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం సెలవు
ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణుల అభిప్రాయం
ముంబై: స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పనితీరు, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయిస్తాయని చెబుతున్నారు.
వీటితో పాటు క్రూడాయిల్ ధరలు, బాండ్లపై రాబడులు, రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఎక్సే్చంజీలు పనిచేయవు. ఈ వారం ఈక్విటీ ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లలో సాయంత్రం సెషన్‌లో ట్రేడింగ్ జరుగుతుంది.
ఆకర్షణీయమైన క్యూ3 జీడీపీ డేటా నమోదు, ఫిబ్రవరి తయారీ రంగ, ఆటో అమ్మకాలు మెప్పించడంతో గతవారం సూచీలు సరికొత్త గరిష్టాలను అధిరోహించాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 663 పాయింట్లు, నిఫ్టీ 166 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. బ్యాంకులు, ఆటో, మెటల్ షేర్లు రాణించాయి.
‘‘స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల రక్షణ దృష్ట్యా తగిన విధివిధానాలను అమలు చేయలంటూ సెబీ ఏంసీఏలను ఆదేశించడంతో చిన్న, మధ్య తరహా షేర్లలో దిద్దుబాటు మెదలైంది. రానున్న రోజుల్లోనూ కొనసాగే వీలుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలూ స్వల్పంగా పెరిగాయి. ఏవైనా ప్రతికూల సంకేతాలు నెలకొంటే మార్కెట్‌లో ప్రస్తుత సానుకూలతను దెబ్బతీయగలవు. అయితే ప్రతికూలతను మార్కెట్ విస్మరిస్తే బుల్లిష్ మూమెంటం కొనసాగొచ్చు.
రెండు నెలల స్థిరీకరణ తర్వాత నిఫ్టీ బుల్లిష్ వైఖరి ప్రదర్శిస్తోంది. తాజాగా శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ నాడు కీలకమైన నిరోధం 22,400 స్థాయిని చేధించి 22,420 వద్ద ముగిసింది. లాభాల కొనసాగితే 22,500 స్థాయిని పరీక్షింవచ్చు. లాభాల స్వీకరణ జరిగితే 22,200 స్థాయి వద్ద కీలక మద్దతు ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింఘ్ తెలిపారు.
3 ఐపీఓలు రూ.1,325 కోట్లు
ప్రాథమిక మార్కెట్లో ఈ వారమూ ఐపీఓల సందడి కొనసాగనుంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా గోపాల్ స్నాక్స్, జేజీ కెమికల్స్, ఆర్‌కే స్వామి కంపెనీలు రూ.1,325 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సరీ్వసెస్ సంస్థ ఆర్‌కె స్వామీ 4–6 తేదీల మధ్య పబ్లిక్ ఇష్యూకు రానుంది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 173 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ నుంచి మరో రూ. 250.56 కోట్లను మొత్తం రూ.423.56 కోట్ల వరకు నిధుల సమీకరించనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 270–288 మధ్య నిర్ణయించింది.
జింక్ ఆక్సైడ్ తయారీ కంపెనీ జేజీ కెమికల్స్ 5–7 తేదీల మధ్య రూ. 251.2 కోట్ల నిధులను సమీకరించనుంది. రూ. 210–221 శ్రేణిలో ధరలను నిర్ణయించగా, కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 165 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ రూ. 86.2 కోట్లను సేకరించనుంది. రాజ్‌కోట్ కేంద్రంగా కార్యకలాపాలను సాగించే గోపాల్ స్నాక్స్ కంపెనీ ఈ నెల 6–11 తేదీల మధ్య పబ్లిక్ ఇష్యూకు అందుబాటులో ఉండనుంది. రూ. 650 కోట్ల వరకు నిధుల కోసం సిద్ధమవుతున్న కంపెనీ రూ. 381–401 శ్రేణిలో షేర్ల ధరలను నిర్ణయించింది. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 16 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ. 13 వేల కోట్ల వరకు సేకరించాయి.
దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు
దేశీయంగా మంగళవారం ఫిబ్రవరి సేవారంగం గణాంకాలు విడుదల అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ఫిబ్రవరి 23 తేదీతో ముగిసిన బ్యాంకు రుణ, డిపాజిట్ వృద్ధి డేటా, మార్చి ఒకటో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వలు వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment