న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఐటీ దిగ్గజాలతోపాటు, ప్రయివేట్ రంగ బ్యాంకులు ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు విడుదల చేయనున్నాయి. సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. మరోవైపు ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలు సైతం వెలువడనున్నాయి. వీటికి జతగా చైనా, యూఎస్ ద్రవ్యోల్బణ వివరాలు వెల్లడికానున్నాయి. ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లలో భారీ పెట్టుబడులు కుమ్మరిస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సైతం మార్కెట్లకు జోష్ నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం..
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ.. సై
టాటా గ్రూప్ బ్లూచిప్ కంపెనీ టీసీఎస్ తొలిగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను ఈ నెల 12న ప్రకటించనుంది. ఈ బాటలో ఇదే రోజు ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సైతం క్యూ1 పనితీరు వెల్లడించనుండగా.. మరో ఐటీ దిగ్గజం విప్రో 13న ఫలితాలు విడుదల చేయనుంది. అయితే అనిశ్చితులు ఎదుర్కొంటున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఐటీ రంగానికి అంత ఆశావహంగా లేనట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నా యి. దీంతో ఐటీ దిగ్గజాల ఫలితాలు ఆకర్షణీయ స్థా యిలో వెలువడకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ప్రయివేట్ రంగ సంస్థలు ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ సైతం ఈ వారంలో క్యూ1 పనితీరును వెల్లడించనున్నాయి. కాగా.. ఈ వారం నుంచీ స్టాక్ ఆధారిత యాక్టివిటీ ఊపందుకోనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ లిమిటెడ్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. ఇందుకు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో తెరతీయనున్నట్లు తెలియజేశారు.
టోకు ధరల ఎఫెక్ట్
జూన్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ)తోపాటు, మే నెలకు తయారీ రంగం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు బుధవారం(12న) విడుదలకానున్నాయి. ఇక టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు శుక్రవారం(14న) వెలువడనున్నాయి. మరోపక్క చైనా ద్రవ్యోల్బణ రేటు 10న వెల్లడికానుండగా.. 12న కీలక ద్రవ్యోల్బణ గణాంకాలను యూఎస్ ప్రకటించనుంది. వారాంతాన యూఎస్ పేరోల్స్, నిరుద్యోగ వివరాలు వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రభావితం చేసే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటికితోడు ఎఫ్‌పీఐల పెట్టుబడుల తీరు సైతం మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించగలదని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ లిమిటెడ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా అభిప్రాయపడ్డారు.
గత వారం కొత్త రికార్డ్
ఎఫ్‌పీఐ పెట్టుబడుల అండతో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 65,899 వద్ద, నిఫ్టీ 19,524 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. నికరంగా సెన్సెక్స్ 562 పాయింట్లు జమ చేసుకుని 65,280 వద్ద నిలవగా.. 143 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 19,332 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి 300 లక్షల కోట్లను అధిగమించి చరిత్ర సృష్టించింది. అయితే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఇవ్వడంతో వారాంతాన ప్రపంచ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి.
ఎఫ్‌పీఐల దన్ను
గత వారం దేశీ స్టాక్ మార్కెట్లకు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీ పెట్టుబడులతో జోష్‌నిచ్చారు. ఈ నెల తొలి వారంలో దేశీ ఈక్విటీలలో దాదాపు రూ. 22,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశి్చతులున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టత ఎఫ్‌పీఐలను ఆకర్షిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఈ నెలలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు మే(రూ. 43,838 కోట్లు), జూన్(రూ. 47,148 కోట్లు)లను మించవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. మార్చి నుంచి నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్న ఎఫ్‌పీఐలు జనవరి, ఫిబ్రవరిలలో రూ. 34,626 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. రుతుపవన విస్తరణ, అంచనాలను మించనున్న కార్పొరేట్ ఫలితాలు వంటి అంశాలు ఎఫ్‌పీఐలకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు
అభిప్రాయపడ్డారు.
గణాంకాలు, ఫలితాలే దిక్సూచి
Published Mon, Jul 10 2023 6:26 AM | Last Updated on Mon, Jul 10 2023 6:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment