‘లక్ష్యం’ గాలికి.. | school headmasters negligence towards students | Sakshi
Sakshi News home page

‘లక్ష్యం’ గాలికి..

Published Sat, Feb 3 2018 2:37 PM | Last Updated on Sat, Feb 3 2018 2:37 PM

school headmasters negligence towards students - Sakshi

అక్కన్నపేటలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు

హుస్నాబాద్‌రూరల్‌ : పదో తరగతి పరీక్షల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రణాళికబద్ధంగా తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు సబ్జెక్టు ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని హెచ్‌ఎంలకు సూచించింది. అయితే, రోజుకు ఒక సబ్జెక్ట్‌ ఉపాధ్యాయుడితోనే ప్రత్యేక తరగతుల నిర్వహించి ప్రధానోపాధ్యాయులు చేతులు దులుపుకుంటున్నట్టు సమాచారం.

వార్షిక ఫలితాలపై ప్రభావం
హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలలో 15 ప్రభుత్వ పాఠశాలలో 350 మంది 10వ తరగతి చదువుతున్నారు. వీరికి వారం వారం ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది మండలంలో మీర్జాపూర్, మోడల్‌ స్కూల్, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి. మొత్తంగా హుస్నాబాద్‌ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు గత ఏడాది 87 శాతం ఫలితాలు సాధించాయి. ఈసారి ప్రతి పాఠశాల వందశాతం ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

హెచ్‌ఎంల తీరుపై విమర్శలు
సిద్దిపేట విద్యాధికారి ఆదేశాల మేరకు గత ఏడాది అక్టోబర్‌ 16 నుంచి డిసెంబర్‌ 31 వరకు నిత్యం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఒక సబ్జెక్ట్‌ టీచర్‌ విద్యా బోధన చేశారు. జనవరి నుంచి ఉదయం, సాయంత్రం 2 గంటలు ప్రత్యేక తరగతులు బోధిస్తున్నారు. సెలవు రోజుల్లో మాత్రం ఉదయం 8.30 నుంచి 11.30 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో హెచ్‌ఎంల తీరుతో ఫలితాలపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది. మరోవైపు తాగునీరు, అల్పాహారం అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు రాత్రి 7 గంటలకు ఇళ్లకు చేరుతుండటంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హెచ్‌ఎంల పనితీరు మార్చుకోవాలని అటు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

పాఠశాల గ్రాంట్స్‌కు బోగస్‌ బిల్లులు
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఏటా రాజీవ్‌ విద్యా మిషన్‌(ఆర్వీఎం) కింద రూ.10 వేలు ప్రాఠశాల గ్రాంట్, రూ.15,000 నిర్వహణ ఖర్చులు, ఒక టీచర్‌కు రూ.500 టీచింగ్‌ గ్రాంట్స్‌ ప్రభుత్వం విడుదల చేస్తుంది. వీటితో పాటు ఆర్‌ఎంఎస్‌ఏ(రాజీవ్‌ మాధ్యమిక శిక్షా అభియాన్‌) కింద పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ఏటా రూ.50 వేలు అందుతాయి. గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఒక్కో 10వ తరగతి విద్యార్థికి స్నాక్స్, ఇతర సౌకర్యాల కోసం రూ.4 అందిస్తున్నారు. కాగా, హెచ్‌ఎంలు గ్రామాలకు చెందిన దాతలతో అల్పాహారం ఏర్పాటుచేయిస్తూ.. నిధులు కాజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలో గ్రంథాలయ పుస్తకాలు, సైన్స్‌ పరికరాలు ఏర్పాటుచేయకుండానే గ్రాంట్స్‌ కాజేస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. అక్కన్నపేట పాఠశాలకు సంబంధించిన బిల్లుల విషయంలో యువజనులు గతంలో సమాచార చట్టం కింద వివరాలను సేకరిస్తే ఇలాంటి అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.

హెచ్‌ఎంలు అందుబాటులో ఉండాలి
10వ తరగతి ప్రత్యేక తరగతులకు సబ్జెక్ట్‌ ఉపాధ్యాయుడు ఉన్నప్పటికీ పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే వరకు ప్రధానోపాధ్యాయులు ఉండాల్సిందే. ఒకటి, రెండు రెండు చోట్ల హెచ్‌ఎంలు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవచ్చు. దీనిపై ఆరా తీస్తాం. – మారంపల్లి అర్జున్, ఎంఈఓ

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement