విచారణకు పోలీస్‌బాస్‌ ! | Investigation against DGP Rajendran | Sakshi
Sakshi News home page

విచారణకు పోలీస్‌బాస్‌ !

Published Sat, Jul 29 2017 3:53 AM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

విచారణకు పోలీస్‌బాస్‌ ! - Sakshi

విచారణకు పోలీస్‌బాస్‌ !

♦ గుట్కా కేసులో మదురై హైకోర్టు స్పష్టీకరణ
♦ విచారణ కమిషన్‌కు పూర్తి అధికారాలు

సాక్షి ప్రతినిధి, చెన్నై:  శాంతి భద్రతలు పరిరక్షిస్తూ, నేరాలను అదుపుచేయాల్సిన డీజీపీ రాజేంద్రనే నిందితుడుగా మారిపోయాడు. నిషేధిత గుట్కా అమ్మకాలను గుట్టుగా కానిచ్చేశారనే ఆరోపణలపై విచారణ జరిపేందుకు మదురై హైకోర్టు అనుమతించింది. అవినీతి నిరోధకశాఖకు పూర్తి అధికారాలు కల్పిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది.

రాజేంద్రన్‌ చెన్నై నగర్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న సమయంలో 2015లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత డీజీపీగా పదోన్నతి కల్పించారు. డీజీపీ రాజేంద్రన్‌ గత నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా ఆయన పదవీకాలాన్ని సీఎం ఎడపాడి మరో రెండేళ్లు పొడిగించారు. నిషేధిత గుట్కా, పాన్‌ మసాలా అక్రమ అమ్మకాల కేసులో డీజీపీ రాజేంద్రన్‌ కూడా ఒక నిందితుడని, నగర కమిషనర్‌గా ఉన్న కాలంలో సైతం గుట్కా అమ్మకాలు సాగాయని ఇంగ్లిషు టీవీ చానల్‌ ఆధారాలు సహా బైటపెట్టింది.

గుట్కా గోల్‌మాల్‌ నుంచి రాజేంద్రన్‌ను రక్షించేందుకే ఆయన పదవీకాలాన్ని పొడిగించారని తప్పుపడుతూ మదురై మీనాంబాళపురానికి చెందిన కే కదిరేశన్‌ ఈనెల 7వ తేదీన హైకోర్టు మదురై శాఖలో పిటిషన్‌ వేశారు. అవినీతి నిరోధక శాఖ నుంచి విచారణ ఎదుర్కొంటున్న డీజీపీకి కల్పించిన పదవీకాల పొడిగింపుపై స్టే విధించాలని, కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్‌ కోరాడు. తనకు బెదిరింపులు వస్తున్నందున సాయుధ పోలీసును బందోబస్తుకు కేటాయించాలని కోరుతో మరో అనుబంధ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు కేకే శశిధరన్, జీఆర్‌ స్వామినాథన్‌ల ముందుకు ఈనెల 6వ తేదీన విచారణకు వచ్చింది.

పిటిషన్‌ తరఫు వాదనపై వివరాలు అందజేయాల్సిందిగా న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ఆనాడు ఆదేశించారు. ఈనెల 17వ తేదీ వాయిదా నాటికి ప్రభుత్వ అధికారులు పత్రాలను దాఖలు చేసి తమ వాదనను వినిపించారు. అత్యున్నత స్థానంలోని అధికారులపై చేసే ఫిర్యాదులకు ఆధారాలు కూడా సమర్పించాలని న్యాయమూర్తులు పిటిషనర్‌ను ఆదేశించారు. శుక్రవారం ఈ కేసు మరోసారి విచారణకు రాగా ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తులు కేకే శశిధరన్, జీఆర్‌ స్వామినాథన్‌ మాట్లాడుతూ డీజీపీ పదవీకాలం పొడిగింపుపై తాము స్టే మంజూరు చేయలేం, అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలపై 20 రోజుల్లోగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అవినీతి నిరోధకశాఖ కమిషనర్‌ నేతృత్వంలో విచారణ జరగాలని వారు తీర్పు చెప్పారు. డీజీపీ, ప్రభుత్వం, రాజకీయ జోక్యం లేకుండా ఈ విచారణ కమిషన్‌ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పిటిషన్‌పై సాహసోపేతంగా విచారణ జరపాలని వారు సూచించారు. విచారణ సమయంలో రాష్ట్ర హోంమంత్రిత్వశాఖ, మరే ఇతర శాఖల నుంచి అనుమతి పొందాల్సిన అవసరం కూడా లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement