గుట్కా మాఫియాపై సీబీఐ పంజా | CBI raids Tamil Nadu Health Minister and DGP's residences | Sakshi
Sakshi News home page

గుట్కా మాఫియాపై సీబీఐ పంజా

Published Thu, Sep 6 2018 2:15 AM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

CBI raids Tamil Nadu Health Minister and DGP's residences - Sakshi

విజయభాస్కర్‌, టీకే రాజేంద్రన్‌, జార్జ్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో మూడేళ్లుగా రహస్యంగా సాగుతున్న గుట్కా అక్రమ అమ్మకాలపై సీబీఐ పంజా విసిరింది. గుట్కా తయారీదారుల నుంచి రూ.40 కోట్ల ముడుపులు పుచ్చుకున్నారన్న ఆరోపణలపై ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, డీజీపీ టీకే రాజేంద్రన్, చెన్నై నగర మాజీ పోలీస్‌ కమిషనర్‌ జార్జ్‌ ఇళ్లపై బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. తమిళనాడులో మొత్తం 40 చోట్ల, బెంగళూరు, ముంబైలో రెండు చోట్ల దాడులు జరిగినట్లు తెలిసింది. రూ.250 కోట్ల ఆదాయ పన్నును ఎగవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ గుట్కా వ్యాపారి గిడ్డంగులపై అధికారులు సోదాలు నిర్వహించడంతో గతేడాది జూలై 8న ఈ స్కాం వెలుగుచూసింది. ఆదాయ పన్ను ఎగవేత ఆరోపణలపై విజయభాస్కర్‌ నివాసంలో గతంలో ఐటీ అధికారులు కూడా సోదాలు జరిపారు. పదవిలో ఉండగా సీబీఐ దాడులు ఎదుర్కొన్న తొలి డీజీపీ రాజేంద్రనే కావడం గమనార్హం.

మాజీ మంత్రి, ఐఆర్‌ఎస్‌ నివాసాల్లోనూ
గుట్కా మాఫియాపై ఆధారాలు లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే అనుమాని తుల నివాసాలపై సీబీఐ దాడులు ప్రారంభమయ్యాయి. చెన్నై గ్రీన్‌వేస్‌రోడ్డులోని ఆరోగ్యమంత్రి విజయభాస్కర్‌ నివాసంలో ఐదుగురు, ముగప్పేరీలోని డీజీపీ రాజేంద్రన్‌ ఇంట్లో పది మంది అధికారులు సోదాలు జరిపారు. నొళంబూరులో నివసిస్తున్న మాజీ పోలీస్‌ కమిషనర్‌ జార్జ్‌ ఇంట్లో ఐదుగురు అధికారులు తనిఖీలు చేశారు. వీరుగాక విజయభాస్కర్‌ అనుచరులు, సహాయకులు, తిరువళ్లూరులో నివసిస్తున్న మాజీ మంత్రి రమణ, 2009 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారిణి గుల్జార్‌ బేగం తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అన్ని చోట్ల నుంచి కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విజయభాస్కర్, రాజేంద్రన్‌ను వారివారి పదవుల నుంచి తొలగించాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు.

నిషేధాన్ని నీరుగార్చిన మంత్రి
గుట్కా, పాన్‌ మసాలా తదితర మత్తుపదార్థాల అమ్మకాలపై 2013లో తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా రాష్ట్రవ్యాప్తంగా గుట్కా అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుట్కా హోల్‌సేల్‌ వ్యాపారి మాధవరావుకు చెందిన గిడ్డంగిపై ఆకస్మిక దాడులు నిర్వహించి భారీ ఎత్తున సరుకును, ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు.ఆ డైరీలో కార్పొరేషన్‌లోని కిందిస్థాయి అధికారి మొదలుకుని ఐపీఎస్‌ అధికారులు, ఒక మంత్రి వరకు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు, ఏయే తేదీల్లో ముట్టజెప్పిన వివరాలు ఉన్నాయి. గుట్కాపై నిషేధాన్ని మంత్రి, అధికారులే నీరుగార్చేశారని తెలుసుకుని ఐటీ అధికారులు విస్తుపోయారు. డైరీలో ఉన్న లెక్కల ప్రకారం మంత్రి, 23 మంది అధికారులకు సగటున రూ.60 లక్షల చొప్పున మొత్తం రూ.40 కోట్ల వరకు ముడుపులు చెల్లించినట్లు తేలింది.

శశికళకూ సంబంధాలు?
జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగానే గుట్కా అక్రమాలపై ఆదాయ పన్ను శాఖ రాసిన లేఖ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు, డీజీపీ అశోక్‌కుమార్‌లకు చేరింది. అయితే వారు ఈ విషయాన్ని జయలలిత దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఆమె చనిపోయిన తరువాత గుట్కా కేసు దాదాపుగా అటకెక్కింది. ఆ తరువాత జయలలిత నివాసంలో సోదాలు జరిపినప్పుడు శశికళ గదిలో ఐటీ శాఖ రాసిన ఉత్తరం దొరకడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. గుట్కా అమ్మకాలు గుట్టుగా సాగడంలో శశికళ ప్రమేయం ఉందన్న అనుమానంతో, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని అవినీతి నిరోధకశాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. డీఎంకే ఎమ్మెల్యే, సీనియర్‌ నేత దురైమురుగన్‌ విజ్ఞప్తి మేరకు గత ఏప్రిల్‌ నెలలో మద్రాస్‌ హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది.


చెన్నైలో రాజేంద్రన్‌ ఇల్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement