'గుట్టు'కా దందా! | Gutka Business With Chain System in Yadadri | Sakshi
Sakshi News home page

'గుట్టు'కా దందా!

Published Mon, Jun 8 2020 12:06 PM | Last Updated on Mon, Jun 8 2020 12:06 PM

Gutka Business With Chain System in Yadadri - Sakshi

సంస్థాన్‌ నారాయణపురం(మునుగోడు) : నిషేధిత గుట్కా వ్యాపారం గుట్టుగా సాగుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గుట్కాల నిషేధం అమలు చేస్తున్నప్పటికీ కొందరు అక్రమార్కులు మాఫియాను తలపించే విధంగా గుట్కా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. మాఫియా ఎత్తులు వేస్తూ నిషేధిత గుట్కాను కిరాణం షాపులు, పాన్‌ డబ్బాలకు చేరవేస్తున్నారు. ఎస్‌ఓటీ పోలీస్‌లు అక్కడక్కడ దాడులు చేసి పట్టుకున్నప్పటికీ వ్యాపారాన్ని అదుపు చేయలేకపోతున్నారు.

చైన్‌ సిస్టంలో గుట్కా దందా..
మాఫియా తీరును పోలి చైన్‌ సిస్టంలో గుట్కా దందా నడుస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి వాహనాల ద్వారా రాష్ట్రంలోకి వస్తుంది. వాహనాల్లో అడుగు భాగంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు పైన నిత్యావసర సరుకులు, కూరగాయలు వేస్తూ, కొందరు కార్లలో తీసుకు వస్తారు. వీరి దగ్గర నుంచి ఒక ప్రాంతాన్ని బట్టి మరొక దళారీ కొనుగోలు చేస్తాడు. అతను మండలంలోని ఒక్కరు, ఇద్దరు ఏజెంట్లను పెట్టుకుంటాడు. వారు రిటైల్‌(కిరాణం షాపులు, పాన్‌డబ్బాలు)గా లక్ష్యంగా పెట్టుకొని అక్కడికి చేరవేస్తారు.

పోలీస్‌లకు చిక్కరు..
చైన్‌ సిస్టంలో ఉన్న వారు ఎవరు కూడా పోలీస్‌లకు చిక్కరు. గుట్కా తీసుకొస్తున్న వాహనం ముందు మరో వ్యక్తి ద్విచక్ర వాహనం పోలీస్‌ల తనిఖీలపై సూచనల మేరకు గుట్కా వాహనం ముందుకు వస్తుంది. వాహనం, మొబైల్‌ నంబర్లు తరచు మారుస్తుంటారు. గుట్కాల కోసం పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు కాల్‌ చేస్తారు కానీ, కింది స్థాయి నుంచి కాల్‌ చేసే పరిస్థితి ఉండదు.(రిటైల్‌ యజమాని ఏజెంట్‌కు, ఏజెంట్‌ దళారికి.. కాల్‌ చేసే పరిస్థితి ఉండదు). గుట్కాలు ఎంపిక చేసే ప్రాంతానికి వచ్చే వరకు తీసుకునే వ్యక్తికి తెలియకుండా చేరవేస్తారు. ఏజెంట్లు కూడా స్టాక్‌ పాయింట్‌లను ఎప్పటికప్పుడు మారుస్తూ దందా చేస్తున్నారు. ఏజెంట్లు కూడా వాహనాలు మారుస్తూ, కొంత మంది ఏజెంట్‌లు స్నేహం పేరుతో యువతను మద్యానికి బానిసలుగా మార్చి దందాలో వాడుకుంటున్నారు. ఎస్‌ఓటీ పోలీస్‌లు గుట్కా ఏజెంట్లపై నిఘా పెట్టి దాడులు చేస్తుండడంతో అప్పుడప్పుడు కేసులు నమోదవుతున్నాయి. మూడు, నాలుగు రోజుల తర్వాత యథావిధిగా నిషేధిత గుట్కా దందా కొనసాగుతోంది.

జిల్లాలో రూ.3 కోట్లకు పైగానే దందా
జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారం నెలకు రూ.3కోట్లకు పైగానే ఉంటుంది. గుట్కా నమిలేవారి అభిరుచి ఆధారంగా సుమారు 10 పేర్లతో సాధారణ గుట్కా, పాన్‌మసాలాగుట్కా(రెండు ప్యాకెట్‌లను కలిపి తింటారు) తయారు చేస్తారు. ఈ ప్యాకెట్‌ మీద ధర రూ.9, కొన్నింటి మీద రూ.10 వరకు ఉంటుంది. దళారి వద్దకు వచ్చే సరికి రూ.7, ఏజెంట్‌ వద్దకు వచ్చే సరికి 8,  రిటైల్‌గా వచ్చే సరికి రూ.12 ఉండగా, గుట్కా నమిలేవారి దగ్గరికి వచ్చేసరికి రూ.20 ధర ఉంటుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీటి ధరలు దళారి, ఏజెంట్లు అమాంతం పెంచారు. రిటైల్‌గా ప్యాకెట్‌కు రూ. 40నుంచి రూ.50వరకు అమ్మకం చేస్తున్నారు. ప్రతి మండలంలోని ఏజెంట్ల దందా నెలకు రూ.12లక్షలు ఉండగా, హైదరాబాద్, నల్లగొండ నుంచి తెచ్చుకునే వారిది మరో రూ.3లక్షల వరకు ఉంటుంది. చౌటుప్పల్, భువనగిరి, ఆలేరు, మోతూరు, వలిగొండ, రామన్నపేట, యాదగిరిగుట్ట పెద్దపెద్ద మండలాల్లో వీటి అమ్మకం చిన్న మండలంలో కంటే రెట్టింపు ఉంటుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిషేధిత గుట్కా కొరతను చూపుతూ అధిక ధరలు అమ్ముతుండడంతో నెల టర్నోవర్, లాభం రెట్టింపు అయ్యిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యాపారి తెలిపాడు.

నారాయణపురం నుంచి నల్లగొండ..
సంస్థాన్‌ నారాయణపురం నుంచి నల్లగొండ వరకు ముగ్గురు గుట్కా దందాదారుల కనుసన్నల్లో నిషేధిత గుట్కా దందా గుట్టుగా నడుస్తోందని ఆరోపణలు ఉన్నాయి. నల్లగొండకు  చెందిన ఓ వ్యక్తి గుట్కా దళారి, ఏజెంట్‌గా నల్లగొండ, చుట్టు పక్కల మండలాల్లోని ఏజెంట్లకు, మునుగోడులోని కొన్ని గ్రామాలకు అమ్మకం చేస్తాడు. చిట్యాల మండలానికి చెందిన మరో ఏజెంట్‌ చిట్యాల, చౌటుప్పల్, మునుగోడులోని కొన్ని గ్రామాలకు, సంస్థాన్‌ నారాయణపురం మండలానికి చెందిన మరో ఏజెంట్‌ సంస్థాన్‌ నారాయణపురం , మర్రిగూడ, మునుగోడు, చౌటుప్పల్‌ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో నిషేధిత గుట్కా దందా నిర్వహిస్తున్నారు.

గత మూడు నెలల్లో నమోదైన కేసులు..
మే 29న కర్నాటక రాష్ట్రంలోని బీదర్‌ నుంచి స్విఫ్ట్‌ కారులో 16 బ్యాగులు గుట్కా ప్యాకెట్‌లును ఆలేరు మీదుగా తరలిస్తుండగా, రోడ్డు ప్రమాదం జరగడంతో గుర్తించారు. కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌కు చెందిన ఇమ్రాన్, రాహులు కలిసి భూదాన్‌ పోచంపల్లి మండలంలో రూ.50వేల విలువ చేసే నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
చౌటుప్పల్‌లోని ఓ కిరాణం షాపులో 1.50లక్షల నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.
భువనగిరిలో ఇద్దరు వ్యక్తులు ఉన్న రూ.30వేల విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.
చౌటుప్పల్‌ మండలంలోని పంతంగిలో ఓ కిరాణం షాపులో రూ.40వేల గుట్కాను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.  
చౌటుప్పల్‌ మండలంలోని పీపల్‌పహాడ్‌లో ఓ ఏజెంట్‌ రూ.50వేల గుట్కాను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.
వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామంలో ఓ కిరాణం షాపులో రూ.50వేల విలువ చేసే గుట్కాలను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.
భూదాన్‌పోచంపల్లి మండలంలో ఓ కిరాణం షాపులో రూ.60వేల విలువ చేసే నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

కేసులు నమోదు చేస్తున్నాం
నిషేధిత గుట్కాపై ఇప్పటికే భువనగిరి, చౌటుప్పల్, అలేరులో కేసులు నమోదు చేశాం. సమాచారం ఉంటే గుర్తించి, కేసులు నమోదు చేస్తాం.  – నారాయణరెడ్డి, డీసీపీ,యాద్రాది భువనగిరి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement