నిషేధం.. వారికి ఓ వరం | illegal gutka business: Telangana | Sakshi
Sakshi News home page

నిషేధం.. వారికి ఓ వరం

Published Sat, Sep 28 2024 6:28 AM | Last Updated on Sat, Sep 28 2024 6:28 AM

illegal gutka business: Telangana

జోరుగా గుట్కా దందా

కర్ణాటకలో అమల్లో లేని నిషేధం... అన్ని ప్రాంతాలకు బీదర్‌ నుంచే 

సరిహద్దులు చెరిపేసి చెక్‌పోస్టులు దాటేసి... యథేచ్ఛగా తెలంగాణ జిల్లాలకు రవాణా 

ప్రతీరోజు రూ.కోట్లలో టర్నోవర్‌ 

గుట్కా దందా వెనుక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: 
రాష్ట్ర ప్రభుత్వం గుట్కాను నిషేధించిన విష యం తెలిసిందే. కానీ ఆ నిషేధిత వస్తువే కొందరికి వరంగా మారి కోట్లాది రూపా యల లాభం చేకూరుస్తోంది. మొన్నటి వరకు వ్యాపారులే గుట్కా దందా చేయగా..ఇప్పుడు కొందరు రాజకీయ నాయకులు కూడా అందులోకి దిగారు. అసలే రాజకీయ నేతలు..ఆపై ప్రజాప్రతినిధులు కావడంతో ఆహార కల్తీ నియంత్రణ, పోలీసు శాఖలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అడపాదడపా టార్గెట్ల కోసం దాడులు చేసి గుట్కా ప్యాకెట్లను స్వా«దీనం చేసుకొని కేసులు పెడుతున్నారే తప్ప సూత్రధారులు, గుట్కా రాకెట్‌ను నిరోధించలేకపోతున్నారు. 

ఒక్క లారీ సరుకుపై రూ.60–రూ.80 లక్షల ఆదాయం 
మాణిక్‌చంద్, సితార్, సాగర్, గోవా, రెబల్, సిమ్లా, గోవా, అంబర్‌..పేర్లేవైనా తెలంగాణవ్యాప్తంగా గుట్కా, తంబాకు ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి మొదలైన గుట్కా దందా వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. గతంలో ప్రతిరోజూ రూ. 5 కోట్ల విలువైన గుట్కా ప్యాకెట్లు అమ్ముడుపోగా.. ఇప్పుడా అమ్మకాలు, ధరలు పెరిగి రూ.10 కోట్లకు చేరినట్టు అంచనా. కంపెనీ నుంచి హోల్‌సేల్‌ వ్యాపారికి.. అక్కడి నుంచి రిటైల్‌గా షాపులకు సరఫరా చేసేందుకు ప్రతీ జిల్లాలో ‘గుట్కా మాఫియా’పెద్ద నెట్‌వర్క్‌నే ఏర్పాటు చేసుకుంది.

 ఒక్క గుట్కా లారీ (డీసీఎం వ్యాన్‌) నేరుగా వ్యాపారి వద్దకు వస్తే రూ.60 లక్షల సంపాదన వచ్చినట్టే. ఒక లారీలో 250 కాటన్ల గుట్కా వస్తుంది. ఒక్కో కాటన్‌లో 70 పొడలు, ఒక్కో పొడలో 50 ప్యాకెట్లు ఉంటాయి. 50 పొట్లాలు ఉండే ఒక్క పొడ (బాక్స్‌) రూ.350లకు ఇస్తుండగా... రిటైల్‌ వ్యాపారులు ‘నిర్భంధం, నిషేధం, పోలీసు నిఘా’తదితర పదాలు వాడుతూ రూ.750 ల వరకు సొమ్ము చేసుకుంటున్నారు. అంటే ఒక్క గుట్కా ప్యాకెట్‌ను రూ.7లకు తీసుకొని రూ.15ల నుంచి 18ల వరకు అమ్ముతున్నారంటే లాభాలు ఏ మేరకు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. హోల్‌సేల్‌ వ్యాపారులు ఇవే గుట్కాలను కంపెనీని బట్టి రూ.20ల నుంచి రూ.25ల వరకు.. పాన్‌ టేలా, కిరాణం దుకాణందారులు రూ.30ల నుంచి రూ.40లు కూడా అమ్ముతున్నారు. 

సరిహద్దు 10 కిలోమీటర్ల దూరంలోనే... 
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కర్ణాటక రాష్ట్రం ఉంది. బీదర్‌ పట్టణం రాష్ట్ర సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. బీదర్‌ నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలకు గుట్కా సరఫరా అవుతోంది. కర్ణాటకలో గుట్కాపై నిషేధం లేదు. తెలంగాణ ఉన్న నిషేధం, డిమాండ్‌ను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో గుట్కాకు ఉన్న డిమాండ్‌ను చూసి కొంతమంది వ్యాపారులు పట్టణంలో పరిశ్రమలను స్థాపించారు. అక్రమార్కులు బీదర్‌లో తయారవుతున్న గుట్కాను తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలంగాణ అంతా రవాణా చేస్తున్నారు. కాగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం 2006 సంవత్సరంలో ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచి్చంది.

దాని ప్రకారం పొగాకు ఉత్పత్తుల, విక్రయాలపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో 2005లో గోవాలో గుట్కా, పాన్‌ మాసాలాను నిషేధించగా, 2012, 2013లలో మరో 15 రాష్ట్రాలు అమలు చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 జనవరి 9న గుట్కాలపై నిషేధం విధించగా, రాష్ట్ర వి¿¶భజన తర్వాత కూడా ఈ రెండు రాష్ట్రాల్లో అమలవుతోంది. బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్, హరిణాయా, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, పంజాబ్, మిజోరాం, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాలలోనూ గుట్కా విక్రయాలపై నిషేధం ఉంది. ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే గుట్కా విక్రయాలు, తయారీకి లైసెన్స్‌లు ఇవ్వగా, అక్కడి నుంచి అన్ని జిల్లాలకు యథేచ్ఛగా రవాణా అవుతోంది. 

రకరకాల పేర్లు, అధిక రేట్లు... 
నిండు జీవితాలు బలి  పొగాకు ఉత్పత్తులను రకరకాల పేర్లతో ఎంఆర్‌పీ లేకుండా అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. వీటిలో విమల్, మాణిక్‌చంద్‌ (ఎంసీ), సితార్, సాగర్, గోవా, ఎంజీఎం, హాన్స్, చైనీఖైనీ, మీరాజ్, రెబల్, సిమ్లా, పాన్‌బార్, విమల్, 1000, ఖలేజా, ఆర్‌డీఎం, కె 7000, కె 9000, 24 క్యారెట్‌ .. వంటి వాటికి ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా భారీ గిరాకీ ఉంది. వీటిని విక్రయించే స్థలం, సమయం, పరిస్థితిని బట్టి 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అధిక ధర అయినా, దొరకడమే భాగ్యం అన్నట్టుగా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. విచ్చలవిడిగా గుట్కా, చైనీఖైనీ, వంటి పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తుండడంతో యువత వాటికి బానిసలవుతున్నారు. 2009–10 ప్రపంచ పొగాకు ఉత్పత్తుల సర్వే ప్రకారం 53.5 శాతం మంది పొగాకు, నికోటిన్‌ ఉత్పత్తులు వినియోగిస్తున్నట్టు తేలింది. గుట్కా, పాన్‌ మసాలాను నమిలేవారు 48.07 శాతం మంది ఉన్నారని ఈ సర్వేలో తేలింది. వీరిలో పిల్లలు

16 శాతం వరకు ఉన్నారని అంచనా. 
17 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్న యువకులే అధికంగా ఉన్నారు. కేన్సర్, గుండె, 
కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.  

దొరుకతలేవు అంటుండ్రు... అడ్డగోలు ధరకు ఇస్తుండ్రు  
రోజూ పనికి పోయినచోట మా పెద్దన్నతోటి మెల్లమెల్లగా గుట్కా అలవాటు అయ్యింది. టైంపాస్‌ కోసం ఏసుకున్నందుకు ఇప్పుడు అలవాటుగా మారింది. దొరుకుతలేవు అంటండ్రు.. రోజుకో రూపాయి పెంచి అమ్ముతండ్రు. ఎం.సీ (మానిక్‌చంద్‌) ఎనిమిది రూపాలుండే. ఇప్పుడు రూ.35ల నుంచి రూ.40లు అంటండ్రు. రెబల్, కె.7000, 24 క్యారెట్‌లేమో రూ.25ల నుంచి రూ.30లకు ఇస్తుండ్రు. నిషేధం ఉండుడేమో గాని అడ్డగోలు ధరలు పెంచి అమ్ముతండ్రు.  – గుట్కా వినియోగదారుడు, జనగాం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement