గుట్కా వ్యాపారం గుట్టు రట్టు | Gutka Gang Arrest in YSR Kadapa | Sakshi
Sakshi News home page

గుట్కా వ్యాపారం గుట్టు రట్టు

Published Thu, Dec 26 2019 11:04 AM | Last Updated on Thu, Dec 26 2019 11:04 AM

Gutka Gang Arrest in YSR Kadapa - Sakshi

పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యాపారులు, స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లు

ఖాజీపేట : ఖాజీపేట కేంద్రంగా గత కొంతకాలంగా సాగుతున్న గుట్కా వ్యాపారం గుట్టు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసుల దాడితో రట్టయింది. సుమారు రూ.లక్ష విలువైన గుట్కాను స్వాధీనం చేసుకుని నలుగురు వ్యాపారులను అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఖాజీపేట కేంద్రంగా గత కొంతకాలంగా గుట్కా, ఖైనీ, మావా వంటి నిషేధిత గుట్కాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఈ విషయం స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకు సమాచారం రావడంతో మైదుకూరు ఎస్‌బీ ఏఎస్‌ఐ వెంకటసుబ్బయ్య, ఎస్‌బీ  కానిస్టేబుళ్లు సంతోష్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డిలు బుధవారం చిల్లర కొట్టు  దుకాణాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు లక్ష రూపాయల విలువగల గుట్కా, ఖైనీ, మావా వంటి పాకెట్ల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. దుకాణాల్లో అమ్మకాలు సాగిస్తున్న మేడా మోహన్‌చంద్ర, సుంకు ప్రహ్లాద, నల్లగుండు వెంకటసుబ్బయ్య, కోనేటి నాగేంద్రలను అదుపులోకి తీసుకుని ఖాజీపేట పోలీసులకు అప్పగించారు.

ఖాజీపేట నుంచే సరఫరా
ఖాజీపేటలోని పలువురు వ్యాపారులు హైదరాబాద్, బెంగళూరు నుంచి ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల ద్వారా ఈ బస్తాలను తీసుకు వస్తున్నట్లు విచారణలో గుర్తించారు. తమకు అనుకూలమైన వారు బస్సు డ్రైవర్‌గా ఉన్నప్పుడు బస్తాలను తీసుకు వస్తున్నారు. ఆ బస్తాలను బైపాస్‌లో దించి అక్కడినుంచి రహస్య గోడౌన్‌లకు తరలిస్తున్నారు. ఆ తర్వాత ఖాజీపేటలోని అన్ని దుకాణాలకు, గ్రామాల్లోని దుకాణాలకు,  చెన్నూరు, మైదుకూరు,  కడపకు సరఫరా చేస్తున్నారు.

అధిక లాభమే వ్యాపారానికి కారణం
గుట్కా వ్యాపారంతో భారీ ఆదాయం వస్తున్నందున పోలీసులు ఎన్ని కేసులు పెడుతున్నా అమ్మకాలు ఆపడం లేదు. గతంలో మేడా మోహన్‌చంద్రపై పోలీసులు కేసులు నమోదు చేసినా తిరిగి అమ్మకాలు చేస్తున్నారు. ఒక ప్యాకెట్‌ ధర రూ.5లు ఉంటే దాన్ని రూ. 15నుంచి రూ.20ల వరకు విక్రయిస్తున్నారు. అలాగే హోల్‌ సేల్‌ అమ్మకాల్లో భారీగా ఆదాయం వస్తుండటంతో అమ్మకాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా నిషేధిత గుట్కా అమ్మకాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి పూర్తిగా అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement