ప్రొద్దుటూరులో గుట్కామాఫియా | Gutka Mafia In Proddatur YSR kadapa | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో గుట్కామాఫియా

Published Fri, Nov 23 2018 12:00 PM | Last Updated on Fri, Nov 23 2018 12:00 PM

Gutka Mafia In Proddatur YSR kadapa - Sakshi

ప్రొద్దుటూరులోని దుకాణాల్లో లభ్యమవుతున్న గుట్కా రకాలు

ప్రొద్దుటూరు క్రైం : గుట్కా మాఫియా ప్రొద్దుటూరులో చెలరేగి పోతోంది. నిషేధిత గుట్కాను అనుమతి ఉన్న కంపెనీ ఉత్పత్తుల మాదిరిగా బహిరంగ విక్రయాలు చేస్తున్నారు. ఇక్కడి ప్రధాన డీలర్ల నుంచి హోల్‌ సేల్‌ దుకాణాలకు.. అక్కడి నుంచి కిల్లీ కొట్టు, సిగరెట్‌ దుకాణాలు, కిరాణా కొట్లకు సరఫరా అవుతున్నాయి. మూడు గుట్కాలు, ఆరు ఖైనీలు అన్న చందంగా వీరి వ్యాపారం జోరుగా సాగుతోంది.

ప్రొద్దుటూరుకు వాణిజ్య పరంగా మంచి పేరుంది. సంబంధిత అధికారులు, ఇక్కడి పోలీసులు అక్రమ వ్యాపారాన్ని పట్టించుకోకపోవడంతో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి పాన్‌ షాప్, టీ బంకులు, కిరాణా కొట్టుల్లో విరివిగా లభిస్తున్నాయి. వీటి నిర్వాహకులకు అక్రమ వ్యాపారం కాసులు కురిపిస్తోంది. వీటి వాడకంతో క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయనే కారణంతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిషేధం విధించింది. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి వీటిని అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. కానీ ప్రొద్దుటూరులో మాత్రం నిషేధిత గుట్కా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటిని అధికారులు నిరోధించిన సందర్భాలు చాలా తక్కువని చెప్పవచ్చు. దాడుల పేరుతో చిన్నా చితకా వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారు గానీ అసలు సూత్రదారుల జోలికి మాత్రం వెళ్లడం లేదు. కోనేటికాల్వ వీధిలోని అనేక దుకాణాల్లో గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు గోడౌన్‌లలో నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నారు.

మార్కెట్‌లో మంచి డిమాండు
బాగా వాడుకలో ఉండి తర్వాత నిషేధానికి గురైన ఏ వస్తువుకైనా మార్కెట్‌లో మంచి డిమాండు ఉంటుంది. గతంలో గుట్కా, పొగాకు ఉత్పత్తులను పెద్ద ఎత్తున విక్రయించేవారు. అయితే ప్రభుత్వం వీటి అమ్మకాలను నిషేధించినా ప్రజలు మాత్రం వాటి అలవాటును మానుకోలేదు. ప్రజల బలహీనతను అవకాశంగా చేసుకొని, నిషేధాన్ని సాకుగా చూపి రెండు నుంచి నాలుగు రెట్లు పెంచి అ«ధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడి వ్యాపారులు రూ. లక్షల్లో పెట్టుబడులు పెట్టి రూ. కోట్లలో ఆదాయం పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి సరుకును అక్రమంగా తరలించి, అక్కడి నుంచి కడప జిల్లాతో పాటు రాయలసీమలోని ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. ప్రొద్దుటూరులో హోల్‌ సేల్‌ వ్యాపారం చేసే వ్యాపారులు అ«ధికంగా ఉన్నారు. గుట్కా వ్యాపారం ఒక మాఫియాలాగా మారిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ తెలిసినా పోలీసు అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు పోలీసు అధికారుల చల్లని చూపుతో వ్యాపారులకు పూర్తి స్వేచ్ఛ లభిస్తోంది. నిత్యావసర సరుకులు విక్రయించినంత తేలికగా జిల్లాలోనూ, పసిడిపురిగా పేరు గాంచిన ప్రొద్దుటూరులో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు సాగిస్తున్నారు.

పక్కరాష్ట్రాల నుంచి దిగుమతి
పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గుట్కా, ఖైనీలను జిల్లాకు దిగుమతి చేసుకుంటున్నారు. వస్తు రవాణా వాహనాలు, ట్రావెల్స్‌ బస్సుల్లో ప్రొద్దుటూరుకు పంపిస్తున్నారు. ఇందులో కర్నాటక సరుకుకు మంచి డిమాండు ఉంది. ప్రొద్దుటూరులోని వ్యాపారులు గుట్కా వ్యాపారమే ప్రధాన ఆదాయ వనరుగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం ప్రొద్దుటూరులోని యానాది కాలనీ, కోనేటి కాల్వవీధి, బాలోబిగారి వీధుల్లో పెద్ద ఎత్తున నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కిరాణా కొట్లలో విక్రయిస్తున్న చిరు వ్యాపారులను పలు మార్లు పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెద్ద ఎత్తున గుట్కా వ్యాపారం చేస్తున్నా ఇప్పటి వరకూ పోలీస్‌స్టేషన్‌ మెట్లక్కని బడా వ్యాపారులు ప్రొద్దుటూరులో చాలా మంది ఉన్నారు. కొందరు పోలీసుల అండదండలతో ప్రొద్దుటూరులో గుట్కా మాఫియా రూ. లక్షలు ఆర్జిస్తోంది.

రెట్టింపు ధరలకు విక్రయం
30 ప్యాకెట్లు ఉండే ఖైనీ బండిల్‌ ధర రూ.155, ఒక్కో ప్యాకెట్‌ రూ. 3 పడుతుంది. దీనిని వ్యాపారులు రూ. 9కి విక్రయిస్తున్నారు.
20 ప్యాకెట్ల జోడాబుల్‌ ఖైనీ రూ.100కు కొని రూ.400లకు రిటైల్‌గా విక్రయిస్తున్నారు.
80 ప్యాకెట్ల ఎంసీ దండను రూ.300లకు కొనుగోలు చేసి రూ.800లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
ఆర్‌ఎండీ మిక్సింగ్‌ గుట్కా 100 ప్యాకెట్లు రూ. వెయ్యికి కొని రూ. 2500లకు అమ్ముతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement