బేల(ఆదిలాబాద్): గుట్కా, ప్లాస్టిక్‌లపై నిషేధం ఉన్నా ఇవి మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. పాన్‌షాపులలో మరింత విరివిగా లభిస్తున్నాయి. ఓ వైపు గుట్కా దందా జోరుగా కొనసాగుతుండగా, మరోవైపు ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా మారింది. కాగా పాన్‌షాపులలో ఈ నిషేధత తంబాకులు, పోకలు, సున్నంతో కలిపి నిషేధిత ప్టాస్టిక్‌లో వేసి నలిచి కర్రా పూడిలను(గుట్కా పొట్లాలు) మరీ తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ గుట్కా తయారీ జిల్లా కేంద్రంతోపాటు ఆదిలాబాద్‌రూరల్, మావల, జైనథ్, బేల, గాదిగూడ, తదితర మహారాష్ట్ర సరిహద్దు మండలాల్లో యథేచ్ఛగా కొనసాగుతోంది. వీటిపై అధికారుల తనిఖీలు అంతంతే ఉండడంతో గుట్కా, ప్లాస్టిక్‌ల నిషేధం ఏమాత్రం అమలు కావడం లేదు.
గుట్కా, ప్లాస్టిక్ విరివిగా లభ్యం
‘గుట్కా నమలడం కేన్సర్‌కు కారకం’..అని సినిమా థియేటర్లలో, అక్కడక్కడా ప్రచార మాధ్యమాల్లో, వాల్‌పోస్టర్లలో చూస్తుంటాం, చదువుతుంటాం. దీంతో పాటు ‘ప్లాస్టిక్‌తో పర్యవరణానికి ముప్పు’ అని సైతం చూస్తుంటాం. అయినా నిషేధిత గుట్కా, ప్లాస్టిక్‌లు కలిసి మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఇదిలా ఉండగా..నిషేధిత ఈగల్, మాజా, బాబా, రత్నా, 160, తదితర తంబాకులను పోకలు, సున్నంతో కలిపి నిషేధిత ప్టాస్టిక్‌లో వేసి సాధారణ మిమన్‌ల ద్వారా నలిచి నలిచి కర్రా పూడిలను తయారు చేస్తున్నారు. ఈ గుట్కా తయారీకి కరెంటు మిషన్‌లను సైతం యథేచ్ఛగా వినియోగిస్తుండటంతో గుట్కా, ప్లాస్టిక్‌లు దందా మరింత జోరుగా సాగుతోంది.
మూడు ప్యాకెట్‌లు..ఆరు కాటన్‌లుగా గుట్కా దందా..
మార్కెట్‌లో విమల్, సాగర్, నజర్, ఆర్‌ఎండీ, వంటి గుట్కాలు సాధారణంగా లభిస్తున్నాయి. ప్టాస్టిక్ ప్యాకింగ్‌తో ఉన్న అంబర్ తంబాకును ప్రత్యేకంగా ఫ్రీజ్‌లలో కూలింగ్ చేసి, రెండింతలతో మరి విక్రయిస్తున్నారు. ఇంతేకాకుండా నిషేధిత కర్రా పూడిలను ఒక్కొక్కటి రూ.10 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా తయారు చేసిన కర్రాలను ముందుగా వయసు పైబడ్డవారు, వయోజనులు, యువకులు తినేవారు. గత ఒకట్రెండు ఏళ్ల నుంచి మహిళలతోపాటు బడీడు పిల్లలు సైతం తినడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో చిన్నాపెద్ద తేడా లేకుండా తింటుండంతో ‘మూడు ప్యాకెట్‌లు..ఆరు కాటన్‌లు’గా ఈ గుట్కా దందా రోజు లక్షల్లో కొనసాగుతోంది. ఈ గుట్కాతో ప్రతీరోజు చిన్న పాన్‌షాపులలో ఆరేడు వేలు పైబడి గిరాకైతే, పెద్ద పాన్‌షాపులలో రూ.35వేలకు పైబడి దాటుతోంది. ఈ గుట్కాకు అలవాటు పడ్డవారు దాన్ని మానలేక ఎక్కడ దొరుకుతాయో కనుక్కుని మరి నములుతున్నారు. వీళ్ల అలవాటును పసిగట్టిన కొందరు మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్రమ నిల్వలు ఉంచి, అవసరాన్ని బట్టి పాన్‌షాపులకు సరఫరా చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
అవగాహన లోపం..
రాష్ట్రంలో గుట్కాను నిషేధించినా అలవాటు పడ్డవారు మానలేకపోతున్నారు. ఇక్కడి ప్రజల్లో అవగాహన లేకపోవడం, గుట్కాతో కలిగే దుష్పరిణామాలను మామూలుగానే తీసుకుంటూ నమిలేస్తున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యం గుళ్ల అవుతోంది. గుట్కా నమిలే వాళ్ల వద్ధ పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. బహిరంగా ప్రదేశాల్లోనూ, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడంతో అపరిశుభ్రత నెలకొంటోంది. దీంతో తోటి వారు ఇబ్బందులు పడుతున్నారు. గుట్కా నమిలితే కాలేయం, నోటి కేన్సర్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, కేన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు, పోలీసులు ముందుకు వచ్చి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నిషేధించినా గుట్కా నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
గుట్కాపై నిషేధమేది?
Published Wed, Jun 19 2019 9:27 AM | Last Updated on Wed, Jun 19 2019 9:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment