ప్రత్యేక నిఘాతోనే గుట్కాపై ఉక్కుపాదం | Gutka Packets Seized In Adilabad | Sakshi
Sakshi News home page

ప్రత్యేక నిఘాతోనే గుట్కాపై ఉక్కుపాదం

Published Sat, Jul 7 2018 10:48 AM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

Gutka Packets Seized In Adilabad - Sakshi

గోదాములో గుట్కా నిల్వలతో పోలీసులు

ఆదిలాబాద్‌: జిల్లాలో గుట్కా మహమ్మారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ తెలిపారు. గురువారం ఆదిలాబాద్‌ డాల్డా కంపెనీ కాలనీలో గల దేశ్‌ముక్‌ గోదాములో బయటపడ్డ గుట్కాదందాను శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో కొందరు వ్యాపారులు గుట్కా అమ్మడమే ప్రధాన వ్యాపారం సాగిస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమాచార వ్యవస్థను పటిష్టపరుస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 229 మందిపై కేసులు నమోదు చేసి రూ.కోటి 70 లక్షల విలువైన నిషేధిత గుట్కాను స్వాధీనపర్చుకున్నామన్నారు. సమాచార వ్యవస్థతో నిల్వలను తెలుసుకుని దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిన్నింగ్‌ పరిశ్రమల్లోని గిడ్డంగి యజమాని దేవదర్‌ దేశ్‌ముఖ్‌ ఖాళీగా ఉన్న గోదాంను రూ.9 వేలకు అద్దెకు ఇచ్చి పరోక్షంగా గుట్కా వ్యాపారులకు సహాయపడినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు.

అన్నదమ్ములు ఈ కేసులో నిందితులుగా ఉన్నారని దర్యాప్తులో తేలిందన్నారు. మొదటి నిందితుడు సైవుల్లాఖాన్‌(45), షమిఉల్లాఖాన్‌(44), ఫసిఉల్లాఖాన్‌(43), సాజిదుల్లాఖాన్‌(42), ఖలీముల్లాఖాన్‌(40)తోపాటు జిన్నింగ్‌ యజమాని జయదర్‌ దేశ్‌ముఖ్‌ (62)ను సైతం నిందితునిగా చేర్చినట్లు తెలిపారు. వీరిపై నాన్‌ బెయిలెబుల్‌ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ రోజు నాల్గవ ముద్దాయి సాజిదుల్లాఖాన్‌ (42) జయదర్‌ దేశ్‌ముక్‌ (62)ను అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రధాన ముద్దాయిలు పరారీలో ఉన్నారన్నారు.

వారికోసం పట్టణ సీఐ, సీపీఎస్‌ పోలీసులతో పాటు రెండు బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. నిరంతర దాడులు కొనసాగుతాయన్నారు. గుట్కా అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణంలో అన్ని చోట్ల సోదాలు నిర్వహించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అక్రమ వ్యాపారం కోసం అద్దెకు ఇచ్చిన వారిపై సైతం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంటి యజమానులు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement