సాక్షి, సిటీబ్యూరో: ఉత్తర మండల పరిధిలోని మోండా మార్కెట్ కేంద్రంగా తండ్రీకొడుకుల గుట్కా దందాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. వారి నుంచి రూ.3.25 లక్షల విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. న్యూ బోయగూడకు చెందిన తండ్రీకొడుకులు ఎస్‌ఎం జైన్, రాకేష్ జైన్ 20 ఏళ్లుగా మోండా మార్కెట్‌లో వందన ఏజెన్సీస్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నారు. పాన్ మసాలాలు, సిగరెట్లు విక్రయించే వీరు ప్రభుత్వ నిషేధంతో గుట్కా, పొగాకు ఉత్పత్తులకు పెరిగిన డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలని భావించారు.
ఇందులో భాగంగా ఈది బజార్, బేగంబజార్ ప్రాంతాలకు చెందిన ప్రధాన ఏజెంట్లు అన్వర్, మోసిన్‌ఖాన్ నుంచి హోల్‌సేల్‌గా నిషేధిత ఉత్పత్తులు ఖరీదు చేస్తున్నారు. వీటిని తమ ఏజెన్సీకి తరలించి అక్కడి నుంచి సబ్ ఏజెంట్లు, పాన్ దుకాణాల వారితో పాటు పరిచయస్తులైన వినియోగదారులకు విక్రయించేవారు. దీనిపై సమాచారం అందడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. కేసును స్థానిక పోలీసులకు అప్పగించి పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment