
గుట్కాపై గూండా యాక్ట్
♦ ఇక, ఉక్కు పాదం
♦ నాన్ బెయిలబుల్ కేసులు
♦ చెన్నై పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు
గుట్కా, మావా, జర్దా వంటి మత్తు పదార్థాలను విక్రయించే వారి భరతం పట్టేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. ఇక, నాన్‌బెయిల్ వారెంట్‌తో కూడిన గుండా చట్టాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకు ఆదేశాలను నగర పోలీసు కమిషనర్ విశ్వనాథన్ జారీచేశారు. గస్తీ పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. నిఘా పెంచాలని సూచించారు. ఈనేపథ్యంలో ఆదివారం పోలీసులు రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు జోరందుకున్నాయి.
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో గుట్కా, మావా, జర్దా, హాన్స్ వంటి పొగాకు వస్తువుల్ని నిషేధించి ఉన్నారు. ఈ నిషేధంతో రాష్ట్రంలోకి ఇటీవల గంజాయి ప్రవేశం మరింతగా పెరిగింది. అన్నిరకాల మత్తు పదార్థాలకు నిషేధం ఉన్నా, మార్కెట్లో మాత్రం యథేచ్ఛగా ఆ వస్తువులు లభిస్తుండడం గమనార్హం. చిన్న చిన్న దుకాణాల్లోనే కాదు, జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లోనూ గుట్కాలు జోరుగా లభిస్తుండటంతో యువత పెడదారి పడుతోందని చెప్పవచ్చు.
మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం, పోలీసుల బృందాల తనిఖీలు సాగుతున్నా, పట్టుబడేది మాత్రం గోరంతే అన్న విమర్శలు ఉన్నాయి. ఇక, గుట్కాల విక్రయాల వ్యవహారంలో పోలీసు బాసులు చేతివాటం సైతం ఉన్నట్టుగా ఇటీవల వెలుగులోకి వచ్చింది. మంత్రితో పాటుగా పోలీసు పెద్దల సహకారంతోనే రాష్ట్రంలోకి గుట్కాలు తరలి వస్తున్నట్టు, పాన్ మసాలాల అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు వెలుగులోకి వచ్చిన సమాచారం వివాదానికి దారితీసింది. వ్యవహారం కోర్టుకు సైతం చేరడంతో పోలీసు బాసులు తమ జాగ్రత్తల్లో పడ్డారు. ఇక, గుట్కాలు వంటి మత్తు పదార్థాలు విక్రయించే వారి భరతం పట్టే విధంగా నాన్ బెయిలబుల్ సెక్షన్‌తో కూడిన గూండా చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధం అయ్యారు.
భరతం పడతారు
జనవరి ఒకటో తేదీ నుంచి చెన్నై నగరంలో గుట్కా, గంజాయి వంటి మత్తుపదార్థాలు, పొగాకు వస్తువుల విక్రయాలకు సంబంధించి పోలీసులు 1120 కేసులు నమోదు చేసిన 1919 మందిని అరెస్టు చేశారు. ఈ ఏడు నెలల కాలంలో రూ.57 లక్షల 84 వేల 381 విలువ గల పొగాకు వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 84 వేల గుట్కా ప్యాకెట్లు, 8 వేల కేజీల మేరకు గంజాయి ఉందని చెప్పవచ్చు. తమమీద ప్రసుత్తం ఆరోపణలు బయలుదేరిన నేపథ్యంలో ఇక, గుట్కా విక్రయదారుల భరతం పట్టే విధంగా చెన్నై పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ ఆయా స్టేషన్లకు ఉత్తర్వులను జారీచేశారు.
ఆమేరకు ఇక, గుట్కా వంటి వాటిని విక్రయిస్తూ పట్టుబడే వారి మీద గూండా చట్టం నమోదు చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల పరిసరాల్లోని చిన్న చిన్న దుకాణాల మీద నిఘా పెంచాలని సూచించి ఉన్నారు. అలాగే, ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే వాహనాల మీద నిఘా వేయడంతో పాటుగా, ఎవరైనా గుట్కా నములుతూ కనిపించినా, వారిని పట్టుకుని , ఎక్కడ విక్రయిస్తున్నారో ఆరా తీసి, ఆయా దుకాణాల మీద చర్యలు తీసుకునే విధంగా గస్తీ పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. ఇక, పొగాకు వస్తువుల్ని విక్రయించినా, బయటి ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలిస్తూ పట్టుబడినా, ఉపేక్షించబోమని, గూండా చట్టం నమోదు చేయడం తథ్యమని కమిషనర్ హెచ్చరించడం గమనార్హం.
దాడులు
గుండా యాక్ట్ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఆయా ప్రాంతాల్లో ఆదివారం తమ దూకుడు ప్రదర్శించారు. దుకాణా ల్లో విక్రయిస్తున్న పాన్ మసాలా, గుట్కా వంటివి స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ దాడులు జోరందుకున్నాయి. కన్యాకుమారి జిల్లాలో అయితే, పెద్దఎత్తున గుట్కాలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.పది లక్షలుగా నిర్ధారించారు.