సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ రకాల స్మగ్లింగ్‌లు, దందాలను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. ఉదాశీన చట్టాలను అవకాశంగా చేసుకుని దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైన ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్‌లైన్ గేమింగ్ తదితర దందాలపై కఠిన చర్యలకు సమాయత్తమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)కు సర్వాధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. ఐపీసీ, సీఆర్‌పీసీ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు అప్పగించింది.
ఏళ్ల తరబడి సాగుతున్న దోపిడీ
చట్టంలో లొసుగులను అవకాశంగా చేసుకుని రాష్ట్రంలో ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్‌లైన్ గేమింగ్ దందా దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైంది. ఇంతవరకు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై రాష్ట్ర మైనింగ్, మినరల్స్ నియంత్రణ చట్టం ప్రకారమే కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంది. ఎవరైనా వరుసగా 2సార్లు పట్టుబడితే ఆ చట్టం ప్రకారం జరిమానా విధించి విడిచిపెట్టేవారు. మూడోసారి దొరికితే కేసు పెట్టేందుకు అవకాశం ఉంది. అది కూడా స్థానిక పోలీసులకు అప్పగించాలి. అంతేగానీ రెవెన్యూ అధికారులకు ఎలాంటి అధికారం ఉండదు. అదే ప్రాతిపదికన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2020లో ఏర్పాటుచేసిన ‘సెబ్’కు కూడా కేసులు పెట్టేందుకు సాంకేతికంగా అడ్డంకులు తలెత్తాయి.
మద్యం అక్రమ రవాణా విషయంలోనూ ఎక్సైజ్ చట్టం ప్రకారం నమోదుచేసే కేసులు ఎలాంటి ప్రభావం చూపించడంలేదు. ఇక మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి జీవితాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న ఆన్‌లైన్ జూదం దందాపై కూడా కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదుకూ అవకాశంలేదు. రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కూడా అటవీ చట్టాల కింద పెట్టే కేసులు స్మగ్లర్ల ఆట కట్టించేందుకు సరిపోవడంలేదు. ఇటువంటి వ్యవస్థీకృత లోపాలతో రాష్ట్రంలో ఇసుక, అక్రమ మద్యం, గంజాయి, ఎర్రచందనం, ఆన్‌లైన్ గేమింగ్ దందాలు యథేచ్ఛగా సాగుతూ అటు ప్రజాధనాన్ని కొల్లగొట్టడంతోపాటు ఇటు సామాన్యుల జీవితాలను దెబ్బతీస్తున్నాయి. గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం కూడా స్మగ్లర్లకు ఊతమిచ్చింది.
కొరఢా ఝళిపించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో అన్ని రకాల స్మగ్లింగ్ దందాలను నిర్మూలించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉద్యుక్తమైంది. అందుకోసం ‘సెబ్’కు విశిష్ట అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. అందుకే ఆయా దందాల్లోని పాత్రధారులు, సూత్రధారులపై ఐపీసీ, సీఆర్‌పీసీ తదితర సెక్షన్ల కింద కఠిన శిక్షలు విధించేలా చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు కల్పిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం..
►రాష్ట్రం ఒక యూనిట్‌గా ‘సెబ్’ కమిషనరేట్‌ను గుర్తించడంతోపాటు రాష్ట్రంలో ఉన్న ‘సెబ్’ స్టేషన్లను పోలీస్‌స్టేషన్లుగా గుర్తిస్తూ హోంశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారం ‘సెబ్’కు ఐపీసీ, సీఆర్‌పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసేందుకు అవకాశం కల్పిస్తూ మైనింగ్, ఎక్సైజ్, అటవీ శాఖలు విడివిడిగా కూడా నోటిఫికేషన్లు జారీచేయాల్సి ఉంది.
►ఇప్పటికే గనుల శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. దాంతో ఇక నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ‘సెబ్’ దాడులు నిర్వహించి నేరుగా ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తుంది. ఆ కేసులను స్థానిక పోలీసులకు అప్పగించాల్సిన అవసరంలేదు. జరిమానాలతో కేసులను సరిపెట్టరు. దీంతో.. ప్రజాధనం లూటీ, సహజ వనరుల దోపిడీ కింద ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు ‘సెబ్’కు అధికారాలు సంక్రమించాయి.
► హోం, ఎక్సైజ్ శాఖలు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడంతో అక్రమ మద్యం, గంజాయి దందాలకు పాల్పడే వారిపై కూడా ‘సెబ్’ నేరుగా ఐపీసీ, సీఆర్‌పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు మార్గం సుగమమైంది.
►ఇక ఎర్రచందనం స్మగ్లర్లపై ‘సెబ్’ నేరుగా ఐపీసీ, సీఆర్‌పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు అవకాశం కల్పిస్తూ అటవీ శాఖ కూడా ఉత్తర్వులు జారీచేయనుంది.
► అలాగే, ఆన్‌లైన్ జూదాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసేందుకు వీలుగా ఐటీ శాఖ త్వరలో నోటిఫికేషన్‌ను జారీచేయనుంది.
►గుట్కా దందాపై కఠిన చర్యలకు వీలుగా వైద్య–ఆరోగ్య శాఖ ఇటీవల ఉత్తర్వులిచ్చింది. తదనుగుణంగా త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment