సాక్షి, అమరావతి: ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించింది. ఎర్ర స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఉద్దేశించిన టాస్క్ ఫోర్స్‌ను ‘స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్) పరిధిలోకి తీసుకొచ్చింది. రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృత వ్యవస్థ ద్వారా ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు దశాబ్దాలుగా చేస్తున్న యత్నాలు పూర్తి స్థాయిలో సఫలీకృతం కావడం లేదు.
చాలా ఏళ్ల కిందటే ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. కానీ జిల్లా ఎస్పీల బాధ్యత ఆయా జిల్లాలకే పరిమితమవుతుండటంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఎర్ర చందనం ఆయా జిల్లాలతో పాటు అనంతపురం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోంచి రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. మరోవైపు ఎర్రచందనం స్మగ్లర్లు తమిళనాడులో ఉంటూ ఏపీలో కూలీలు, ఏజంట్ల ద్వారా యథేచ్చగా దందా సాగిస్తున్నారు. దీంతో ఈ స్మగ్లింగ్‌ను అరికట్టాలంటే పొరుగు రాష్ట్రాలతో మరింత కేంద్రీకృత సమన్వయం అవసరమని గుర్తించారు. ఈ నేపథ్యంలో సెబ్ పరిధిలోకి ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్‌ను తీసుకొచ్చారు.
గంజాయి సాగు, రవాణాను రూపుమాపడంలో సెబ్ విజయవంతం
అక్రమ ఇసుక, అక్రమ మద్యం, గుట్కా, గంజాయి దందాలను అరికట్టడంతో సెబ్ ఇప్పటికే విజయవంతమైంది. తాజాగా ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)ల్లో దశాబ్దాలుగా సాగుతున్న గంజాయి సాగు, అక్రమ రవాణాను విజయవంతంగా రూపుమాపడం సెబ్ సమర్థతకు నిదర్శనం. అందుకే ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించే బాధ్యతను సెబ్‌కు అప్పగించింది. డీజీపీ నియంత్రణలో సెబ్ కమిషనర్ ఎర్రచందనం నిరోధక టాస్క్ ఫోర్స్‌ను పర్యవేక్షిస్తారు. ఆయనకు సెబ్ డైరెక్టర్ సహకరిస్తారు. అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ పాలనపరమైన అంశాలను పర్యవేక్షిస్తారు. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు ప్రభుత్వం సవరణలు చేసింది.
రాష్ట్రం అంతా సెబ్ అధికార పరిధిలోకి వస్తున్నందున జిల్లా సరిహద్దులు వంటి సాంకేతిక అడ్డంకులుండవు. సెబ్‌కు ఇప్పటికే ప్రత్యేక పోలీస్ స్టేషన్లున్నాయి. పొరుగు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర పరిధిలోని పోర్టు అధికార వర్గాలతో సంప్రదింపులు, సహకారం వంటివి సెబ్‌కు మరింత సులభతరమవుతాయి. అవసరమైనప్పుడు పొరుగు రాష్ట్రాల పోలీసులతో కలసి జాయింట్ ఆపరేషన్లు కూడా నిర్వహించేందుకు అవకాశముంటుంది. ఏవోబీలో గంజాయి దందాను అరికట్టేందుకు ఒడిశా పోలీసులతో సమన్వయంతో పనిచేయడం తాజా తార్కాణం. ఈ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్‌ను సెబ్ పరిధిలోకి తీసుకురావడం సానుకూల నిర్ణయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా దశాబ్దాలుగా వేళ్లూనుకుని ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్‌ను తుద ముట్టించవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment