గసగసాల సాగు వెనుక డ్రగ్‌ మాఫియా! | Drug mafia behind poppy cultivation | Sakshi
Sakshi News home page

గసగసాల సాగు వెనుక డ్రగ్‌ మాఫియా!

Published Tue, Mar 16 2021 5:05 AM | Last Updated on Tue, Mar 16 2021 5:05 AM

Drug mafia behind poppy cultivation - Sakshi

సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం మాలెపాడులో గసగసాల (ఓపియం పాపీ సీడ్స్‌) సాగు వెనుక డ్రగ్‌ మాఫియా హస్తమున్నట్టు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అనుమానిస్తోంది. దాని మూలాలను కనుగొనేందుకు దర్యాప్తు చేపట్టిన ఎస్‌ఈబీ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించింది. పక్కా సమాచారం మేరకు చిత్తూరు జిల్లా ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాలతో ఆదివారం మాలెపాడులో నిషేధిత గసగసాల సాగును గుర్తించి ధ్వంసం చేశారు. ఇందుకు బాధ్యులైన నాగరాజు, లక్ష్మన్న, సోమశేఖర్‌ అనే వారిని అదుపులోకి తీసుకుని విచారించిన ఎస్‌ఈబీ వారినుంచి అనేక కీలక విషయాలను రాబట్టింది. నిషేధిత డ్రగ్స్‌ తయారీకి ఉపయోగించే గసగసాల పంట సాగు చేస్తున్న ఆ ముగ్గురిపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డీపీఎస్‌) యాక్ట్‌–1985 కింద కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ సోమవారం చెప్పారు. లోతైన దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 

తోటల్లో అంతర పంటగా..
చిత్తూరు జిల్లాలోని మామిడి, టమాట తోటల్లో అంతర పంటగా గసగసాలను సాగు చేయడం విస్తుగొల్పుతోంది. నాగరాజు అనే రైతు తన మామిడి తోటలో సుమారు 10 సెంట్ల స్థలంలో విద్యుత్‌ తీగలతో మూడంచెల కంచె ఏర్పాటు చేసి 15 వేలకుపైగా గసగసాల మొక్కలను సాగు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇంకా ఎక్కడన్నా సాగు జరుగుతుందేమోనని ఎస్‌ఈబీ దృష్టి సారించింది. మార్ఫిన్, హెరాయిన్, బ్రౌన్‌ షుగర్‌ వంటి డ్రగ్స్‌లో ఉపయోగించే గసగసాల సాగుపై నిషేధం ఉంది. పలు వురు అధిక సంపాదన కోసం ఎవరికీ అనుమానం రాకుం డా అల్లనేరేడు, మొక్కజొన్న, టమాట తోటల్లో అంతర పంటగా దీన్ని సాగు చేస్తున్నారు.

ఇది డ్రగ్‌ మాఫియా పనే
మత్తు పంట గసగసాల సాగుకు మన దేశంలో అనుమతి లేదు. కేంద్ర ప్రభుత్వ ఔషధ తయారీ సంస్థ అనుమతులు పొందిన చోట్ల మాత్రమే పరిమితులకు లోబడి సాగు చేస్తారు. ఆ పంటను ప్రభుత్వ యంత్రాంగమే సేకరించి వైద్యపరమైన మత్తుమందులకు వినియోగిస్తారు. చివరగా వచ్చే గసగసాలను వంటింటి వినియోగం కోసం మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. ఈ విషయంలో అడుగ డుగునా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పకడ్బందీ విధానాన్ని అమలు చేస్తారు. కొన్ని రహస్య ప్రాంతాల్లో గసగసాల పంటను రైతులతో సాగుచేయించి డ్రగ్‌ మాఫియా కాసులు దండుకుంటోంది. ఈ మొక్క నుంచి గసగసాలతో పాటు కాయ నుంచి జిగురు, బెరడును కూడా సేకరిస్తారు. కాయ ఏపుగా పెరిగినప్పుడు దానిపై బ్లేడ్లతో గాట్లు పెట్టి అందులోంచి వెలువడే జిగురును సేకరిస్తారు. దీన్ని కొకైన్, హెరాయిన్‌ వంటి డ్రగ్స్‌ తయారీకి ఉపయోగిస్తారు. చిత్తూరు జిల్లాలో గసగసా లను రహస్యంగా సాగు చేయిస్తున్న డ్రగ్స్‌ మాఫియా వాటి కాయలను, బెరడును సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.

కర్ణాటక కేంద్రంగా స్మగ్లింగ్‌
కర్ణాటకలోని కోలారు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు ప్రాంతాల్లో బెంగళూరు ముఠాకు చెందిన ఏజెంట్లు ఉన్నట్టు ఎస్‌ఈబీ అధికారులు గుర్తించారు. వారి వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులను పట్టుకునే పనిలోఎస్‌ఈబీ ప్రత్యేక బృందం దృష్టి పెట్టింది. ఈ దందా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్‌ మాఫియా హస్తమున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

ఎవరూ సాగు చేయొద్దు
డబ్బులకు ఆశపడి రైతులెవరూ గసగసాల సాగు చేయొద్దు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్‌ అంధకారం అవుతుంది. గసగసాల సాగు చేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, అమ్మినా తీవ్రమైన నేరమవుతుంది. అలాంటి వారిపై కఠినమైన నాన్‌–బెయిలబుల్‌ కేసులు నమోదవుతాయి. దోషులకు పదేళ్ల జైలు శిక్ష తప్పదు.
– వినీత్‌ బ్రిజ్‌లాల్, ఎస్‌ఈబీ కమిషనర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement