Poppy cultivation
-
గసగసాల సాగును కనిపెట్టేందుకు డ్రోన్లు
సాక్షి, అమరావతి/మదనపల్లె టౌన్: చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలో నిషేధిత ఓపిఎం పాపీ సీడ్స్ (గసగసాల) సాగును గుర్తించేందుకు ప్రత్యేక బలగాలు డ్రోన్ల సాయంతో జల్లెడ పడుతున్నాయి. మాదక ద్రవ్యాల్లో వినియోగించే నిషేధిత గసగసాల సాగును మదనపల్లి మండలం మాలేపాడులో గుర్తించిన నేపథ్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్), పోలీస్ శాఖకు చెందిన 100 మందికి పైగా సిబ్బంది మంగళవారం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. పొలాలు, మామిడి తోటలు, సమీప అడవుల్లో డ్రోన్ కెమెరాల సాయంతో గసగసాల పంటల స్థావరాలను గుర్తించడానికి కూంబింగ్ నిర్వహించారు. నిషేధిత పంటను సాగు చేసిన నాగరాజు ఫోన్ కాల్స్ ఆధారంగా డ్రగ్స్ ముఠాను కనుగొనేందుకు ముగ్గురు సీఐలతో కూడిన బృందం వేట ప్రారంభించింది. మహా నగరాలకు ప్రత్యేక బృందాలు ఈ పంటలను సాగు చేసిన రైతులతో పాటు వారికి విత్తనాలను సరఫరా చేస్తున్న వ్యాపారులు, తెరవెనుక పాత్ర పోషిస్తున్న మాఫియా ముఠా పాత్రపై ఎస్ఈబీ బృందం లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, ముంబైలోని డ్రగ్స్ మాఫియా వివరాలను ఇప్పటికే సేకరించారు. వారిని పట్టుకోవడానికి ఎస్ఈబీ డీఎస్పీ నేతృత్వంలో ఓ బృందం బెంగళూరు, మరో బృందం చెన్నై, ఇంకో బృందం ముంబై మహా నగరాలకు సోమవారం రాత్రే వెళ్లినట్టు సమాచారం. రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఈబీ సీఐ కేవీఎస్ ఫణీంద్ర, ఎస్ఐలు శ్రీధర్, దిలీప్‌కుమార్ మాలేపాడులో ఇంకా ఎవరైనా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారా అనే దిశగా అన్వేషణ ప్రారంభించారు. మదనపల్లె, చౌడేపల్లె మండలాల్లో 2014 జనవరిలో ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసులో పాత ముద్దాయిల కదలికలపైనా ఆరా తీస్తున్నారు. -
గసగసాల సాగు వెనుక డ్రగ్ మాఫియా!
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం మాలెపాడులో గసగసాల (ఓపియం పాపీ సీడ్స్) సాగు వెనుక డ్రగ్ మాఫియా హస్తమున్నట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అనుమానిస్తోంది. దాని మూలాలను కనుగొనేందుకు దర్యాప్తు చేపట్టిన ఎస్ఈబీ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించింది. పక్కా సమాచారం మేరకు చిత్తూరు జిల్లా ఎస్ఈబీ అదనపు ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాలతో ఆదివారం మాలెపాడులో నిషేధిత గసగసాల సాగును గుర్తించి ధ్వంసం చేశారు. ఇందుకు బాధ్యులైన నాగరాజు, లక్ష్మన్న, సోమశేఖర్ అనే వారిని అదుపులోకి తీసుకుని విచారించిన ఎస్ఈబీ వారినుంచి అనేక కీలక విషయాలను రాబట్టింది. నిషేధిత డ్రగ్స్ తయారీకి ఉపయోగించే గసగసాల పంట సాగు చేస్తున్న ఆ ముగ్గురిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) యాక్ట్–1985 కింద కేసులు నమోదు చేసినట్టు ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ సోమవారం చెప్పారు. లోతైన దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తోటల్లో అంతర పంటగా.. చిత్తూరు జిల్లాలోని మామిడి, టమాట తోటల్లో అంతర పంటగా గసగసాలను సాగు చేయడం విస్తుగొల్పుతోంది. నాగరాజు అనే రైతు తన మామిడి తోటలో సుమారు 10 సెంట్ల స్థలంలో విద్యుత్ తీగలతో మూడంచెల కంచె ఏర్పాటు చేసి 15 వేలకుపైగా గసగసాల మొక్కలను సాగు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇంకా ఎక్కడన్నా సాగు జరుగుతుందేమోనని ఎస్ఈబీ దృష్టి సారించింది. మార్ఫిన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ వంటి డ్రగ్స్‌లో ఉపయోగించే గసగసాల సాగుపై నిషేధం ఉంది. పలు వురు అధిక సంపాదన కోసం ఎవరికీ అనుమానం రాకుం డా అల్లనేరేడు, మొక్కజొన్న, టమాట తోటల్లో అంతర పంటగా దీన్ని సాగు చేస్తున్నారు. ఇది డ్రగ్ మాఫియా పనే మత్తు పంట గసగసాల సాగుకు మన దేశంలో అనుమతి లేదు. కేంద్ర ప్రభుత్వ ఔషధ తయారీ సంస్థ అనుమతులు పొందిన చోట్ల మాత్రమే పరిమితులకు లోబడి సాగు చేస్తారు. ఆ పంటను ప్రభుత్వ యంత్రాంగమే సేకరించి వైద్యపరమైన మత్తుమందులకు వినియోగిస్తారు. చివరగా వచ్చే గసగసాలను వంటింటి వినియోగం కోసం మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఈ విషయంలో అడుగ డుగునా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పకడ్బందీ విధానాన్ని అమలు చేస్తారు. కొన్ని రహస్య ప్రాంతాల్లో గసగసాల పంటను రైతులతో సాగుచేయించి డ్రగ్ మాఫియా కాసులు దండుకుంటోంది. ఈ మొక్క నుంచి గసగసాలతో పాటు కాయ నుంచి జిగురు, బెరడును కూడా సేకరిస్తారు. కాయ ఏపుగా పెరిగినప్పుడు దానిపై బ్లేడ్లతో గాట్లు పెట్టి అందులోంచి వెలువడే జిగురును సేకరిస్తారు. దీన్ని కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ తయారీకి ఉపయోగిస్తారు. చిత్తూరు జిల్లాలో గసగసా లను రహస్యంగా సాగు చేయిస్తున్న డ్రగ్స్ మాఫియా వాటి కాయలను, బెరడును సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక కేంద్రంగా స్మగ్లింగ్ కర్ణాటకలోని కోలారు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు ప్రాంతాల్లో బెంగళూరు ముఠాకు చెందిన ఏజెంట్లు ఉన్నట్టు ఎస్ఈబీ అధికారులు గుర్తించారు. వారి వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులను పట్టుకునే పనిలోఎస్ఈబీ ప్రత్యేక బృందం దృష్టి పెట్టింది. ఈ దందా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా హస్తమున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఎవరూ సాగు చేయొద్దు డబ్బులకు ఆశపడి రైతులెవరూ గసగసాల సాగు చేయొద్దు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్ అంధకారం అవుతుంది. గసగసాల సాగు చేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, అమ్మినా తీవ్రమైన నేరమవుతుంది. అలాంటి వారిపై కఠినమైన నాన్–బెయిలబుల్ కేసులు నమోదవుతాయి. దోషులకు పదేళ్ల జైలు శిక్ష తప్పదు. – వినీత్ బ్రిజ్‌లాల్, ఎస్ఈబీ కమిషనర్ -
నిషేధిత గసగసాల సాగు!
మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా): మదనపల్లె మండలంలో గుట్టుగా సాగుతున్న మాదకద్రవ్యాల తయారీకి ఉపయోగించే నిషేధిత గసగసాల (ఓపీఎం పోపీ) పంట సాగు గుట్టు రట్టయింది. సెబ్ ఎస్ఐ శ్రీధర్ ఆదివారం విలేకరులకు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె మండలంలోని మాలేపాడు పంచాయతీ కత్తివారిపల్లి గ్రామానికి చెందిన బొమ్మరాసి గంగులప్ప కుమారుడు బి.నాగరాజు కత్తివారిపల్లె, దేవళంపల్లె మధ్యలో ఉన్న తన మామిడి తోటలో నిషేధిత గసగసాల పంటను సాగు చేస్తున్నట్లు సెబ్ అధికారులకు సమాచారం అందింది. సిబ్బందితో వెళ్లి తోటలో దాడులు చేయగా గసగసాల సాగు విషయం బట్టబయలైంది. తోటలో సోదాలు చేస్తుండగా యజమాని నాగరాజు ఆదేశాల మేరకు అదే గ్రామానికి చెందిన నాగరాజు దగ్గరి బంధువులు ట్రాక్టర్‌తో అధికారుల కళ్ల ఎదుటే పంటను ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. అధికారులు వారితో వారించి ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. వారి వద్ద నాలుగు బస్తాల గసగసాలను స్వాధీనం చేసుకుని, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గత కొన్నేళ్లుగా ‘సాగు’తున్న దందా.. నాగరాజు గత కొన్ని సంవత్సరాలుగా మదనపల్లె, ములకలచెరువు, కుప్పం, వి.కోట, కర్నాటకలలో కూడా నిషేధిత పంటలను సాగు చేస్తూ, గుట్టు చప్పుడు కాకుండా పొరుగు రాష్ట్రాలకు తరలించి విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందని ఎస్ఐ శ్రీధర్ వెల్లడించారు. ప్రధాన నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పట్టుబడిన çగసగసాల విలువ రూ.లక్షల్లో ఉంటుందని, బ్లాక్ మార్కెట్లో అయితే రూ.కోట్లలో ధర ఉంటుందన్నారు. కాగా, ఇదే గ్రామంలో పదేళ్ల క్రితం అప్పటి ఎక్సైజ్ పోలీసులు నిషేధిత గసగసాల పంటలపై దాడులు చేపట్టి, వాటిని ధ్వంసం చేశారు. కొందరిపై కేసులు కూడా పెట్టారు. ఆ కేసుల్లో నాగరాజు కూడా ఉన్నట్లు సమాచారం. -
అన్నదాతపై దండయాత్ర
రెండు వేల ఎకరాల్లో గసగసాల పంటను ధ్వంసం చేసిన అధికారులు రూ. పది కోట్ల మేర నష్టం ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ పంట సాగు చేయడం నేరమని వారికి తెలియదు. గతంలో ప్రతి ఏటా పంట చేతికొచ్చే సమయానికి ధరల్లేక వారంతా నష్టపోయారు. అప్పుల బారి నుంచి బయటపడాలనుకున్నారు. కొందరు వ్యాపారుల మాటలు నమ్మి నాలుగేళ్లుగా గసగసాలు సాగు చేశారు. తక్కువ సమయంలో పంట చేతికొస్తోంది. ధర నిలకడగా ఉంది. దీంతో పుంగనూరు నియోజకవర్గంలో 550 మంది రైతులు 2 వేల ఎకరాలు గసగసాలు సాగుచేశారు. మంగళవారం పిడుగుపడినట్టు అధికారులంతా ఒక్కసారిగా పంటను ధ్వంసం చేశారు. దాదాపు పదికోట్ల రూపాయల మేరకు నష్టం వచ్చిందని రైతులు లబోదిబోమంటున్నారు. గతంలో ఎవరూ ఈ పంట సాగుచేయడం నేరమని చెప్పలేదని విలపిస్తున్నారు. చౌడేపల్లె : బోయకొండ, భవానినగర్, మేకలవారిపల్లె, అట్లవారిపల్లె, దిగువపల్లె, కాగతి, పెద్దూరు, గజ్జలవారిపల్లె, గాజు లవారిపల్లె, మల్లువారిపల్లె, ఊటూరు, కొలింపల్లె, రాచవారి పల్లె, కోటూరు, పెద్దకొండామర్రి, చారాల, కాగతియల్లంపల్లె, వెంగలపల్లె పరిసర గ్రామాల్లో గసగసాల పంట సాగవుతోంది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ డీవీ.సత్యప్రసాద్, పలమనేరు డీఎస్పీ పీ.శంకర్, సీఐలు చంద్రశేఖర్, జానకిరాం ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్, ఎక్సైజ్ పోలీసులు, రెవెన్యూ, స్థానిక పోలీసులు కలసి 13 టీములుగా ఏర్పడి రెండు రోజులుగా మండలంలో గసాలు పంటపై సమాచారం సేకరించారు. ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, ఎస్పీ శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ ఆర్వీ.కర్ణన్‌తో ఫోన్లో విషయం చెప్పారు. గసాలు సాగు చేసిన రైతులతోనూ మాట్లాడారు. పంట సాగు చేయడం చట్టరీత్యా నే రమని, ధ్వంసం చేయడానికి సహకరించాలని కోరారు. ఉన్న ఫలంగా సుమారు 200 మంది పోలీసులు పంట పొలాలపై పడి ధ్వంసం చేశారు. దీనిపై నిషేధం ఉన్న విషయం తమకు తెలియదని రైతులు చెప్పినా పట్టించుకోలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండువేల ఎకరాల్లో పంటను నాశనం చేశారు. సుమారు రూ.10 కోట్ల మేరకు పంట నష్టం వాటిల్లింది. కిలో జిగురు రూ.3 లక్షలు, పొట్టు రూ.4 వేలు, గసాలు రూ.800 గసాలు పంట పండిన తర్వాత రైతులు గసాలును కిలో రూ.800 చొప్పున విక్రయిస్తారు. గసాలు కాయ బెరడును కిలో రూ.4 వేలు చొప్పున, పచ్చికాయ జిగురును కిలో రూ.3 లక్షల చొప్పున విక్రయించి రైతులు లాభాలు గడిస్తున్నారు. ఆ జిగురును, బెరడును బెంగళూరు, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు రైతుల వద్ద నుంచి కిలో రూ.50 వేలు చొప్పున కొనుగోలు చేస్తారు. దీన్ని ఆ వ్యాపారులు రూ.3 లక్షల చొప్పున విక్రయిస్తుంటారని రైతులు తెలిపారు. మత్తు పదార్థాల తయారీలో వీటిని ఉపయోగిస్తారు. పోలీసుల అదుపులో ఏడుగురు రైతులు గసాలు పంట సాగు కేసులో ఏడుగురు రైతులను ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంటు పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విత్తనాలు, మార్కెటింగ్ చేస్తున్న దళారుల వివరాలు తెలియజేసి విచారణకు సహకరించాలని ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ కోరారు. ఈ దాడుల్లో ఏఈఎస్ మధుసూదన, మల్లారెడ్డి, సీఐ చౌదరి, ఎస్ఐలు మనోహర్‌రాజు, ఇస్మాయిల్ పాల్గొన్నారు. 27పిజిఆర్31 :చ ౌడేపల్లె మండలం భవానినగర్ సమీపంలో పంటలు ధ్వంసం చేస్తున్న పోలీసులు. 27పిజిఆర్34 : చౌడేపల్లెలో వివరాలు వెల్లడిస్తున్న ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ సత్యప్రసాద్. 27పిజిఆర్36 : చౌడేపల్లెలో సాగుచేసిన గసాలుకాయ.