మామిడి తోటలో డ్రోన్ కెమెరాలతో తనిఖీ చేస్తున్న పోలీసులు
సాక్షి, అమరావతి/మదనపల్లె టౌన్: చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలో నిషేధిత ఓపిఎం పాపీ సీడ్స్ (గసగసాల) సాగును గుర్తించేందుకు ప్రత్యేక బలగాలు డ్రోన్ల సాయంతో జల్లెడ పడుతున్నాయి. మాదక ద్రవ్యాల్లో వినియోగించే నిషేధిత గసగసాల సాగును మదనపల్లి మండలం మాలేపాడులో గుర్తించిన నేపథ్యంలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్), పోలీస్ శాఖకు చెందిన 100 మందికి పైగా సిబ్బంది మంగళవారం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. పొలాలు, మామిడి తోటలు, సమీప అడవుల్లో డ్రోన్ కెమెరాల సాయంతో గసగసాల పంటల స్థావరాలను గుర్తించడానికి కూంబింగ్ నిర్వహించారు. నిషేధిత పంటను సాగు చేసిన నాగరాజు ఫోన్ కాల్స్ ఆధారంగా డ్రగ్స్ ముఠాను కనుగొనేందుకు ముగ్గురు సీఐలతో కూడిన బృందం వేట ప్రారంభించింది.
మహా నగరాలకు ప్రత్యేక బృందాలు
ఈ పంటలను సాగు చేసిన రైతులతో పాటు వారికి విత్తనాలను సరఫరా చేస్తున్న వ్యాపారులు, తెరవెనుక పాత్ర పోషిస్తున్న మాఫియా ముఠా పాత్రపై ఎస్‌ఈబీ బృందం లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, ముంబైలోని డ్రగ్స్ మాఫియా వివరాలను ఇప్పటికే సేకరించారు. వారిని పట్టుకోవడానికి ఎస్‌ఈబీ డీఎస్పీ నేతృత్వంలో ఓ బృందం బెంగళూరు, మరో బృందం చెన్నై, ఇంకో బృందం ముంబై మహా నగరాలకు సోమవారం రాత్రే వెళ్లినట్టు సమాచారం. రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఈబీ సీఐ కేవీఎస్ ఫణీంద్ర, ఎస్‌ఐలు శ్రీధర్, దిలీప్‌కుమార్ మాలేపాడులో ఇంకా ఎవరైనా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారా అనే దిశగా అన్వేషణ ప్రారంభించారు. మదనపల్లె, చౌడేపల్లె మండలాల్లో 2014 జనవరిలో ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసులో పాత ముద్దాయిల కదలికలపైనా ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment