అన్నదాతపై దండయాత్ర
రెండు వేల ఎకరాల్లో గసగసాల పంటను ధ్వంసం చేసిన అధికారులు
రూ. పది కోట్ల మేర నష్టం
ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆ పంట సాగు చేయడం నేరమని వారికి తెలియదు. గతంలో ప్రతి ఏటా పంట చేతికొచ్చే సమయానికి ధరల్లేక వారంతా నష్టపోయారు. అప్పుల బారి నుంచి బయటపడాలనుకున్నారు. కొందరు వ్యాపారుల మాటలు నమ్మి నాలుగేళ్లుగా గసగసాలు సాగు చేశారు. తక్కువ సమయంలో పంట చేతికొస్తోంది. ధర నిలకడగా ఉంది. దీంతో పుంగనూరు నియోజకవర్గంలో 550 మంది రైతులు 2 వేల ఎకరాలు గసగసాలు సాగుచేశారు. మంగళవారం పిడుగుపడినట్టు అధికారులంతా ఒక్కసారిగా పంటను ధ్వంసం చేశారు. దాదాపు పదికోట్ల రూపాయల మేరకు నష్టం వచ్చిందని రైతులు లబోదిబోమంటున్నారు. గతంలో ఎవరూ ఈ పంట సాగుచేయడం నేరమని చెప్పలేదని విలపిస్తున్నారు.
చౌడేపల్లె : బోయకొండ, భవానినగర్, మేకలవారిపల్లె, అట్లవారిపల్లె, దిగువపల్లె, కాగతి, పెద్దూరు, గజ్జలవారిపల్లె, గాజు లవారిపల్లె, మల్లువారిపల్లె, ఊటూరు, కొలింపల్లె, రాచవారి పల్లె, కోటూరు, పెద్దకొండామర్రి, చారాల, కాగతియల్లంపల్లె, వెంగలపల్లె పరిసర గ్రామాల్లో గసగసాల పంట సాగవుతోంది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ డీవీ.సత్యప్రసాద్, పలమనేరు డీఎస్పీ పీ.శంకర్, సీఐలు చంద్రశేఖర్, జానకిరాం ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్, ఎక్సైజ్ పోలీసులు, రెవెన్యూ, స్థానిక పోలీసులు కలసి 13 టీములుగా ఏర్పడి రెండు రోజులుగా మండలంలో గసాలు పంటపై సమాచారం సేకరించారు. ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, ఎస్పీ శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్‌తో ఫోన్‌లో విషయం చెప్పారు. గసాలు సాగు చేసిన రైతులతోనూ మాట్లాడారు. పంట సాగు చేయడం చట్టరీత్యా నే రమని, ధ్వంసం చేయడానికి సహకరించాలని కోరారు. ఉన్న ఫలంగా సుమారు 200 మంది పోలీసులు పంట పొలాలపై పడి ధ్వంసం చేశారు. దీనిపై నిషేధం ఉన్న విషయం తమకు తెలియదని రైతులు చెప్పినా పట్టించుకోలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండువేల ఎకరాల్లో పంటను నాశనం చేశారు. సుమారు రూ.10 కోట్ల మేరకు పంట నష్టం వాటిల్లింది.
కిలో జిగురు రూ.3 లక్షలు, పొట్టు రూ.4 వేలు, గసాలు రూ.800
గసాలు పంట పండిన తర్వాత రైతులు గసాలును కిలో రూ.800 చొప్పున విక్రయిస్తారు. గసాలు కాయ బెరడును కిలో రూ.4 వేలు చొప్పున, పచ్చికాయ జిగురును కిలో రూ.3 లక్షల చొప్పున విక్రయించి రైతులు లాభాలు గడిస్తున్నారు. ఆ జిగురును, బెరడును బెంగళూరు, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు రైతుల వద్ద నుంచి కిలో రూ.50 వేలు చొప్పున కొనుగోలు చేస్తారు. దీన్ని ఆ వ్యాపారులు రూ.3 లక్షల చొప్పున విక్రయిస్తుంటారని రైతులు తెలిపారు. మత్తు పదార్థాల తయారీలో వీటిని ఉపయోగిస్తారు.
పోలీసుల అదుపులో ఏడుగురు రైతులు
గసాలు పంట సాగు కేసులో ఏడుగురు రైతులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంటు పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విత్తనాలు, మార్కెటింగ్ చేస్తున్న దళారుల వివరాలు తెలియజేసి విచారణకు సహకరించాలని ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ కోరారు. ఈ దాడుల్లో ఏఈఎస్ మధుసూదన, మల్లారెడ్డి, సీఐ చౌదరి, ఎస్‌ఐలు మనోహర్‌రాజు, ఇస్మాయిల్ పాల్గొన్నారు.
27పిజిఆర్31 :చ ౌడేపల్లె మండలం భవానినగర్ సమీపంలో పంటలు ధ్వంసం చేస్తున్న పోలీసులు.
27పిజిఆర్34 : చౌడేపల్లెలో వివరాలు వెల్లడిస్తున్న ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ సత్యప్రసాద్.
27పిజిఆర్36 : చౌడేపల్లెలో సాగుచేసిన గసాలుకాయ.