బస్తాల్లో ఉన్న గసగసాలను నేలపై పోసిన సెబ్ సిబ్బంది
మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా): మదనపల్లె మండలంలో గుట్టుగా సాగుతున్న మాదకద్రవ్యాల తయారీకి ఉపయోగించే నిషేధిత గసగసాల (ఓపీఎం పోపీ) పంట సాగు గుట్టు రట్టయింది. సెబ్ ఎస్‌ఐ శ్రీధర్ ఆదివారం విలేకరులకు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె మండలంలోని మాలేపాడు పంచాయతీ కత్తివారిపల్లి గ్రామానికి చెందిన బొమ్మరాసి గంగులప్ప కుమారుడు బి.నాగరాజు కత్తివారిపల్లె, దేవళంపల్లె మధ్యలో ఉన్న తన మామిడి తోటలో నిషేధిత గసగసాల పంటను సాగు చేస్తున్నట్లు సెబ్ అధికారులకు సమాచారం అందింది. సిబ్బందితో వెళ్లి తోటలో దాడులు చేయగా గసగసాల సాగు విషయం బట్టబయలైంది. తోటలో సోదాలు చేస్తుండగా యజమాని నాగరాజు ఆదేశాల మేరకు అదే గ్రామానికి చెందిన నాగరాజు దగ్గరి బంధువులు ట్రాక్టర్‌తో అధికారుల కళ్ల ఎదుటే పంటను ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. అధికారులు వారితో వారించి ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. వారి వద్ద నాలుగు బస్తాల గసగసాలను స్వాధీనం చేసుకుని, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
గత కొన్నేళ్లుగా ‘సాగు’తున్న దందా..
నాగరాజు గత కొన్ని సంవత్సరాలుగా మదనపల్లె, ములకలచెరువు, కుప్పం, వి.కోట, కర్నాటకలలో కూడా నిషేధిత పంటలను సాగు చేస్తూ, గుట్టు చప్పుడు కాకుండా పొరుగు రాష్ట్రాలకు తరలించి విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందని ఎస్‌ఐ శ్రీధర్ వెల్లడించారు. ప్రధాన నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పట్టుబడిన çగసగసాల విలువ రూ.లక్షల్లో ఉంటుందని, బ్లాక్ మార్కెట్లో అయితే రూ.కోట్లలో ధర ఉంటుందన్నారు. కాగా, ఇదే గ్రామంలో పదేళ్ల క్రితం అప్పటి ఎక్సైజ్ పోలీసులు నిషేధిత గసగసాల పంటలపై దాడులు చేపట్టి, వాటిని ధ్వంసం చేశారు. కొందరిపై కేసులు కూడా పెట్టారు. ఆ కేసుల్లో నాగరాజు కూడా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment